టయోటా ఇన్నోవా క్రిస్టా కొత్త వేరియంట్ వచ్చేసింది.. వివరాలు

Toyota Innova Crysta GX Plus Launched: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా కిర్లోస్కర్ మోటార్స్ యొక్క ఇన్నోవా క్రిస్టా కొత్త వేరియంట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్ ధర, వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధర

ఇండియన్ మార్కెట్లో కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా మిడ్ స్పెక్ వేరియంట్‌ ‘జీఎక్స్+’ (GX+) పేరుతో లాంచ్ అయింది. దీని ధర రూ. 21.39 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వెర్షన్ ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న జీఎక్స్ మరియు వీఎక్స్ వేరియంట్ల మధ్యలో ఉంటుంది. ఇది జీఎక్స్ వేరియంట్ కంటే కూడా దాదాపు రూ. 1.40 లక్షలు ఎక్కువ.

కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్+ వేరియంట్ 7 సీటర్ మరియు 8 సీటర్ ఎంపికలలో లభిస్తుంది. 7 సీటర్ ధర రూ. 21.39 లక్షలు, కాగా 8 సీటర్ ధర రూ. 21.44 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

డిజైన్ & కలర్ ఆప్షన్స్

చూడటానికి మునుపటి మోడల్ మాదిరిగా ఉన్న ఈ కారు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది అదే ఫ్రంట్ డిజైన్, రియర్ డిజైన్ కలిగి ఉంటుంది. కాబట్టి చూడగానే ఇది కొత్త వేరియంట్ అని చెప్పడం కొంత కష్టమే. అయితే ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ కారణంగా దీనిని కొత్త వేరియంట్ అని తెలుసుకోవచ్చు.

ఇన్నోవా క్రిస్టా కొత్త వేరియంట్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి సూపర్ వైట్, యాటిట్యూడ్ బ్లాక్ మైకా, అవాంట్ గార్డ్ బ్రాంజ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్ మరియు సిల్వర్ మెటాలిక్ కలర్స్. క్రిస్టా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే వస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది.

ఫీచర్స్

కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్+ వేరియంట్లో తప్పకుండా తెలుసుకోవాల్సిన అంశం కొత్త ఫీచర్స్. ఈ కొత్త మోడల్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫీచర్స్‌తో పాటు అదనంగా 14 ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. అవి రియర్ కెమెరా, ఆటో ఫోల్డ్ మిర్రర్స్, డాష్ క్యామ్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వుడ్ ప్యానెల్స్, మరియు ఫ్రీమియం ఫాబ్రిక్ సీట్లు, ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. తద్వారా ఉత్తమ రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

ఇంజిన్

టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్+ వేరియంట్ 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 150 హార్స్ పవర్ మరియు 343 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇది ఎకో అండ్ పవర్ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. మొత్తం మీద ఇది మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

మార్కెట్లో కొత్త టయోటా ఇన్నోవా క్రిస్టా జీఎక్స్+ వేరియంట్ లాంచ్ చేసిన సందర్భంగా టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ అండ్ సర్వీస్ యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ.. 2005లో ప్రారంభమైనప్పటి నుంచి, ఇన్నోవా బ్రాండ్ ఇండస్ట్రీ బెంచ్‌మార్క్‌లను సెట్ చేసింది. తద్వారా ఇది సెగ్మెంట్ లీడర్‌గా తిరుగులేని రికార్డ్ క్రియేట్ పొందింది. కంపెనీ ఇప్పుడు లాంచ్ చేసిన ఈ కారు కూడా మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యర్థులు

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త ఇన్నోవా క్రిస్టా జీఎక్స్+ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థి లేదు. కానీ మార్కెట్లో కియా కారెన్స్, మరియు మహీంద్రా మొరాజో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: మారుతి సుజుకి అద్భుతమైన డిస్కౌంట్స్.. ఏకంగా రూ.1.50 లక్షల వరకు బెనిఫీట్స్

భారతదేశంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే దాదాపు చాలా వాహన తయారీ సంస్థలు ఆధునిక ఉత్పత్తులకు లాంచ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో టయోటా కూడా ఓ కొత్త వేరియంట్ విడుదల చేసి.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఈ కారు మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.