మనసు దోచేస్తున్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125 కొత్త కలర్స్ – ధర ఎంతంటే?

TVS Ntorq 125 New Colour Options: బైకులకు, కార్లకు మాత్రమే కాకుండా ఇండియన్ మార్కెట్లో స్కూటర్లకు కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనికి కారణం కొంత తక్కువ ధరలు లభిస్తాయని మాత్రమే కాదు, రోజు వారీ వినియోగానికి.. తక్కువ దూరాలకు ప్రయాణించడానికి స్కూటర్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారణంగా స్కూటర్ మార్కెట్ బాగా వృద్ధి చెందింది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త స్కూటర్లు లేదా అప్డేటెడ్ స్కూటర్లను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ‘టీవీఎస్ మోటార్’ తన ‘ఎన్‌టార్క్ 125’ (TVS Ntorq 125) స్కూటర్‌ను కొత్త కలర్ స్కీమ్‌లలో లాంచ్ చేసింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 కొత్త కలర్స్

భారతదేశంలో ఎక్కువమందికి ఇష్టమైన మరియు అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ఇప్పుడు నాలుగు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అవి టర్కోయిస్, హార్లెక్విన్, నార్డో గ్రే మరియు మ్యాట్ బ్లాక్ కలర్స్.

మ్యాట్ బ్లాక్ కలర్ అనేది స్పెషల్ ఎడిషన్ కలర్. కాబట్టి ఇది ‘ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పీ’కు మాత్రమే పరిమితమైంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్, ఎక్స్‌టీ అనే వేరియంట్లతో పాటు మొత్తం ఇది ఐదు వేరియంట్లలో లభిస్తోంది.

ధర

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ బేస్ వేరియంట్ ధరలు రూ. 86871 కాగా.. రేస్ ఎక్స్‌పీ వేరియంట్ ధర రూ. 97501 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ధరలు ఎంచుకునే వేరియంట్ మరియు కొనుగోలు చేసే నగరం లేదా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. దీనిని కస్టమర్లు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

డిజైన్

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ యొక్క కొత్త కలర్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కలర్ అనేది ఫ్రంట్ ఆఫ్రాన్, అండర్ సీట్ ప్యానెల్ వద్ద కనిపిస్తుంది. ఇక రేస్ ఎక్స్‌పీ వేరియంట్ ఆఫ్రాన్, రెడ్ అల్లాయ్ వీల్స్ మీద చెకర్డ్ గ్రాఫిక్స్ మరియు బాడీ వర్క్ మీద మ్యాట్ & గ్లోసీ పియానో బ్లాక్ షేడ్ కలర్స్ కనిపిస్తాయి.

ఫీచర్స్

ఎన్‌టార్క్ 125 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సీడీ స్క్రీన్ పొందుతుంది. ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు మోనోషాక్ సెటప్ కలిగి రెండు చివర్లలో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. అయితే టాప్ వేరియంట్‌ యొక్క ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. మొత్తం మీద ఈ స్కూటర్ కలర్ ఆప్షన్స్ మరియు కాస్మొటిక్ అప్డేట్స్ మాత్రం కాకుండా ఇతర అప్డేట్స్ లేదని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇంజిన్

ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఇంజిన్. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ యొక్క ఇంజిన్ కూడా ఎలాంటి అప్డేట్స్ పొందలేదు. కాబట్టి స్టాండర్డ్ ఎడిషన్ 124.8 సీసీ సింగిల్ సిలిండర్ త్రీ వాల్వ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7000 ఆర్‌పీఎమ్ వద్ద 9.4 బ్రేక్ హార్స్ పవర్ (BHP) మరియు 5500 ఆర్‌పీఎమ్ వద్ద 10.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Don’t Miss: మహేష్ బాబు ఫస్ట్ బైక్ ఏదో తెలుసా? ఎవరూ ఊహించలేరు!

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎక్స్‌పీ ఎడిషన్ కూడా అదే 124.8 సీసీ సింగిల్ సిలిండర్ త్రీ వాల్వ్ ఇంజిన్ పొందుతుంది. కానీ పర్ఫామెన్స్ స్టాండర్డ్ వేరియంట్ కంటే కొంత అధికంగా ఉంటుంది. ఇది 7000 ఆర్‌పీఎమ్ వద్ద 10 బీహెచ్‌పీ పవర్ 5500 ఆర్‌పీఎమ్ వద్ద 10.8 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా పవర్ మరియు టార్క్ కొంత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త కలర్ ఆప్షన్స్ ప్రవేశపెట్టడానికి కారణం ఏమిటంటే?

వాహనప్రియులు ఎప్పటికప్పుడు కొత్తదనానికి ఆకర్షితులవుతారు. కాబట్టి కంపెనీలు కూడా అప్పటికే ఉన్న వాహనాలకు కొన్ని ఆధునిక హంగులను జోడించి మార్కెట్లో లాంచ్ చేస్తూ ఉంటాయి. ఇది ప్రజలను మరింత ఆకర్శించడానికి ఉపయోగపడుతుంది. టీవీఎస్ కంపెనీ ఇప్పుడు తన ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకురావడంతో మరింత మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.