TVS Ronin Parakram Edition Unveiled: భారతదేశంలో ఆటోమొబైల్ మార్కెట్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీగా పేరుపొందిన ఇండియాలో ఎప్పటికప్పుడు అధునాతన వాహనాలు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ టూ వీలర్ కంపెనీ ‘టీవీఎస్ మోటార్’ (TVS Motor) దేశీయ విఫలో సరికొత్త బైక్ ఆవిష్కరించింది.
రోనిన్ పరాక్రమ్ ఎడిషన్
టీవీఎస్ కంపెనీ భారతీయ విఫణిలో లాంచ్ చేసిన బైక్ ‘రోనిన్ పరాక్రమ్ ఎడిషన్’ (Ronin Parakram Edition). సంస్థ ఈ బైకును 25 సంవత్సరాల కార్గిల్ విజయ్ దివస్ జ్ఞాపకార్దంగా ఆవిష్కరించింది. ఈ బైక్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే చాలా భిన్నంగా అనేక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. అయితే ఇంజిన్ మరియు పనితీరులో మాత్రం ఎటువంటి మార్పులు లేదు.
డిజైన్
కొత్త టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్ పొంది ఉండటం వల్ల చూడగానే రోనిన్ అని గుర్తించడం కొంచెం కష్టమైన పనే. అయితే నిశితంగా పరిశీలిస్తే ఇది రోనిన్ అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ మీద వెండి రంగులో, ఆలీవ్ గ్రీన్ కలర్ చూడవచ్చు. హెడ్‌లైట్ దగ్గర నుంచి ఫ్యూయెల్ ట్యాంక్ మధ్య భాగం వరకు జాతీయ జెండా (ఇండియన్ ఫ్లాగ్) కలర్స్ ఉండటం గమనించవచ్చు.
బైక్ యొక్క మడ్‌గార్డ్, క్నీ రెసెస్ మరియు సైడ్ ప్యానెల్ వంటివన్నీ ఆలివ్ గ్రీన్ కలర్ పొందుతాయి. ఇక్కడ కార్గిల్ యుద్దానికి సంబంధించిన సైనికుల చిత్రాలు చూడవచ్చు. బైక్ ఎడమవైపు కవర్ పసుపు రంగులో 99 సంఖ్యను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది స్టాండర్డ్ రోనిన్ బైక్ మాదిరిగా కాకుండా.. సింగిల్ లెదర్ సీటు పొందుతుంది.
టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ యొక్క హ్యాండిల్ బార్ గ్రిప్‌లు కూడా లెదర్ ట్రీట్‌మెంట్‌ను పొందుతాయి. వెనుక కొంత కుదించబడి.. స్టెయిన్‌లెస్ స్టీల్ లగేజ్ క్యారియర్ పొందుతుంది. అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్ బైకులో ఉన్న మాదిరిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ టైర్ల స్థానంలో నాబీ టైర్లు ఉన్నాయి. ఇండికేటర్లు బుల్లెట్ మాదిరిగా ఉండటం చూడవచ్చు. హెడ్‌లైట్ మీద చిన్న విండ్ స్క్రీన్ చూడవచ్చు.
ఇంజిన్
ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. ముందు చెప్పుకున్నట్లు టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ ఎలాంటి యాంత్రిక మార్పులను పొందదు. కాబట్టి ఈ బైక్ అదే 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి, 7750 rpm వద్ద 20.4 హార్స్ పవర్ మరియు 3750 rpm వద్ద 19.93 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి పనితీరు కూడా స్టాండర్డ్ బైక్ మాదిరిగానే ఉంటుంది.
టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ యూఎస్డీ ఫోర్క్ మరియు ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ పొందుతుంది. ఈ బైక్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కలిగి రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. మొత్తం మీద ఈ బైక్ చూడగానే.. ఒక్క చూపుతోనే వాహన ప్రియులను ఆకర్షిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
విక్రయాలు
టీవీఎస్ కంపెనీ ఈ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ ఆవిష్కరించింది. కానీ ఇది ఎప్పుడు అమ్మకానికి వస్తుంది. ధర ఎంత ఉంటుంది అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ బైక్ లిమిటెడ్ ఎడిషన్ రూపంలో.. అంటే పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నాము. అయితే స్టాండర్డ్ రోనిన్ బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). కాబట్టి ఈ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని భావిస్తున్నాము. అయితే ధరలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
Don’t Miss: హృతిక్ రోషన్ తండ్రి కొన్న కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే దడ పుట్టాల్సిందే..
దేశీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ రోనిన్ బైక్ లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలను పొందుతూనే ఉంది. ఈ సమయంలో రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ లాంచ్ మరింత మంది వాహన ప్రియులను ఆకర్షిస్తుంది. అయితే కంపెనీ ఈ ఎడిషన్‌ను ఎక్కువ సంఖ్యలో విక్రయించే అవకాశం లేదు, కాబట్టి ఎక్కువమంది ఈ బైకును కొనుగోలు చేసే అవకాశం లేదు.