Ultraviolette F77 Super Street launched: బెంగళూరుకు చెందిన వాహన తయారీ సంస్థ ఆల్ట్రావయొలెట్ (Ultraviolette) మార్కెట్లో మ్యాక్ 2 యొక్క ఏర్గోనామిక్ వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కొత్త బైక్ పేరు ‘ఎఫ్77 సూపర్ స్ట్రీట్’ (F77 Super Street). ఈ బైక్ ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది. ధరలు ఎలా ఉన్నాయి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
వేరియంట్స్ & ధరలు
కొత్త ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ వేరియంట్ మరియు రీకాన్ వేరియంట్. వీటి ధరలు వరుసగా.. రూ. 2.99 లక్షలు, రూ. 3.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ బైక్ కోసం ఈ రోజు నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మార్చి 1న ప్రారంభమవుతాయని తెలుస్తోంది.
డిజైన్ మరియు ఫీచర్స్
ఒక్క చూపుతోనే.. వాహన ప్రేమికులను ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్.. దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువ పొడవు, వెడల్పుగా ఉంటుంది. సరికొత్త హ్యాండిల్ బార్ మరియు ఫుట్‌పెగ్ వంటివి ఇందులో చూడవచ్చు. హెడ్‌లైట్, లెయిల్ లైట్ మరియు సైడ్ ప్రొఫైల్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ బైక్ కొత్త కౌల్, 5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. 10 లెవెల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఈ బైకులో ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ బైక్ యూఎస్డీ ఫ్రంట్ పోర్క్స్, వెనుక మోనోశాక్ ఉన్నాయి. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఈ బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.
బ్యాటరీ అండ్ రేంజ్
ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ బైక్.. అత్యంత శక్తివంతమైన 10.3 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది 30 కేడబ్ల్యు మోటరుకి అనుసంధానించబడి ఉంటుంది. ఇది 40.2 హార్స్ పవర్ మరియు 100 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 211 కిమీ (స్టాండర్డ్) 323 కిమీ (రీకాన్) రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 155 కిమీ కావడం గమనార్హం.
Also Read: ఇది కదా బైక్ అంటే.. రేటు అక్షరాలా రూ.21.20 లక్షలండోయ్
సుమారు 207 కేజీల బరువున్న కొత్త ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ బైక్ బరువు.. స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత ఎక్కువే. అయితే ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుందని సమాచారం. కాబట్టి ఇది తప్పకుండా వాహన ప్రేమికులను ఆకర్షిస్తుందని.. మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.
కలర్ ఆప్షన్స్
కొత్త ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 సూపర్ స్ట్రీట్ బైక్ నాలుగు రంగులలో లభిస్తుంది. అవి టర్బో రెడ్, ఆఫ్టర్ బర్నర్ ఎల్లో, స్టెల్లార్ వైట్ మరియు కాస్మిక్ బ్లాక్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకి డిమాండ్ పెరుగుతున్న వేళ ఈ బైక్ మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది.