Interesting Facts About Indian Budget: భారతదేశానికి స్వాతంత్యం వచ్చే వరకు బడ్జెట్ అనే మాట వినిపించలేదు. ఎందుకంటే.. బ్రిటీష్ వారు చేసిందే చట్టం, చెప్పిందే వేదం కాబట్టి. స్వాతంత్యం వచ్చిన తరువాత.. దేశ ఆర్ధిక వ్యవస్థను అంచనా వేయడానికి 1947 నవంబర్ 26న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది ప్రవేశపెట్టిన కేవలం మూడు నెలలకే.. అంటే 1948 ఫిబ్రవరి 28న దేశ చరిత్రలో గుర్తుండిపోయేలా మొట్టమొదటి వార్షిక బడ్జెట్ వెలువడింది. ‘ఆర్‌కే షణ్ముఖం శెట్టి’ దీనిని ప్రవేశపెట్టారు. ఆ తరువాత బడ్జెట్ యధావిధిగా ప్రవేశపెడుతూనే వస్తున్నారు.
ఇందులో భాగంగానే ఈ రోజు (2025 ఫిబ్రవరి 1) కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి ‘నిర్మలా సీతారామన్’ (Nirmala Sitharaman) యూనియన్ బడ్జెట్ 2025-26 (Union Budget 2025-26) ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ తెలుసుకోవలసిన ఓ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2025 బడ్జెట్ అనేది మోదీ ప్రభుత్వంలో సీతారామన్ ప్రవేశపెడుతున్న 8వ బడ్జెట్. అంటే ఈమె 8సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిందన్న మాట.
మొత్తం మీద బడ్జెట్ 2025-26ను నిర్మల సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. అయితే భారత బడ్జెట్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో విపులంగా తెలుసుకుందాం.. వచ్చేయండి.
భారతదేశంలో మొట్ట మొదటి బడ్జెట్ ఎప్పుడంటే..
ప్రారంభంలో చెప్పుకున్నట్లు భారతదేశంలో బడ్జెట్ అనేది స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రారంభమైంది. మొట్ట మొదటి బడ్జెట్‌ను అప్పటి ప్రధాని ‘జవహర్‌లాల్ నెహ్రు’ ఆధ్వర్యంలో ఆర్‌కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. దీనిని ప్రధానంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశం యొక్క ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయడానికి ప్రవేశపెట్టారు. కాబట్టి ఇందులో చెప్పుకోదగ్గ ప్రతిపాదనలు ప్రవేశపెట్టలేదు.
బడ్జెట్ చదివిన ప్రధానమంత్రులు
సాధారణంగా ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టేది.. కేంద్ర ఆర్ధిక శాఖామంత్రి. కానీ ప్రధాన మంత్రులు కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ప్రారంభం నుంచి ఇప్పటివరకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రు (1958 బడ్జెట్), ఇందిరా గాంధీ (1970 బడ్జెట్) మరియు రాజీవ్ గాంధీ (1987 బడ్జెట్). వీరు మాత్రమే ప్రధాన మంత్రులు అయినప్పటికీ.. స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు.
అతి చిన్న బడ్జెట్ & సుదీర్ఘమైన బడ్జెట్
బడ్జెట్ గురించి తెలిసిన చాలామందికి బడ్జెట్ చరిత్రలో అతి చిన్న మరియు సుదీర్ఘ బడ్జెట్ ఏదని తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపుతుంటారు. కాబట్టి భారతదేశ బడ్జెట్ చరిత్రలో అత్యంత చిన్న బడ్జెట్ 1977లో హిరూభాయ్ పటేల్ ప్రవేశపెట్టింది. ఆయన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నిడివి కేవలం 800 పదాలతో మాత్రమే. ఇదే అప్పటి బడ్జెట్.. ఇప్పటి వరకు ఇదే అతి చిన్న బడ్జెట్ అని తెలుస్తోంది.
యూనియన్ బడ్జెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్‌ను 2020లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ ఏకంగా రెండు గంటల నలభై నిముషాల పాటు బడ్జెట్ ప్రసంగించారు. ఇప్పటి వరకు అదే అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్. కాగా ఈ రోజు (శనివారం) ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ను సంబంధిత వ్యక్తులు లేదా సీతారామన్ అనే వ్యక్తి ఎంత సమయం బడ్జెట్ గురించి ప్రస్తావిస్తారు తెలియాల్సి ఉంది.
పేపర్‌లెస్ బడ్జెట్
నిజానికి ప్రారంభం నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టేవాళ్ళు.. పేపర్లను చూసి చదివేవాళ్ళు. కానీ మొదటిసారి 2021లో పేపర్‌లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది బడ్జెట్ చరిత్రలోనే ఓ నూతన అధ్యాయం. పేపర్ వ్యర్దాలను తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పేపర్‌లెస్ బడ్జెట్ కొనసాగుతోంది.
బడ్జెట్ సమయంలో మార్పు
ప్రారంభంలో బడ్జెట్ అనేది సాయంత్రం 5 గంటల సమయానికి ప్రారంభించేవారు. కానీ ఇది అంత సమంజసంగా లేదని.. 1999లో యాశ్వంత్ సిన్హా.. బ్రిటీష్ పార్లమెంట్ షెడ్యూల్ విధానానికి స్వస్తి పలికి.. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. అప్పటి నుంచి బడ్జెట్ ఎప్పుడైనా.. 11 గంటలకు ప్రారంభిస్తున్నారు.
బడ్జెట్ ప్రెజెంటేషన్ తేదీ
2017లో కేంద్రం ప్రవేశ పెడుతున్న బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1కి మార్చారు. అంటే బడ్జెట్ తేదీని ఇంకా ముందుకు మార్చేశారు. కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 ప్రారంభమయ్యేలోపు ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన అన్ని పార్లమెంటరీ ఆమోదాలు పూర్తయ్యేలా ఈ మార్పు చేయడం జరిగింది. అప్పటి నుంచి కొత్త విధానమే ముందుకు సాగుతోంది.
రైల్వే బడ్జెట్ విలీనం
2017లో మొదటిసారి రైల్వే బడ్జెట్‌ను.. కేంద్ర బడ్జెట్‌లో చేర్చారు. ఆర్ధిక నిర్వహణను క్రమబద్దీకరించడానికి మాత్రమే కాకుండా.. రైల్వేకు సంబంధించిన నిధులలో కూడా పారదర్శకతను పెంచడానికి ఈ విధానం అవలంబించారు. అప్పటి నుంచి రైల్వే బడ్జెట్‌ను.. కేంద్ర బడ్జెట్‌లోనే ప్రవేశపెడుతున్నారు.
బ్లాక్ బడ్జెట్
భారత్ – పాకిస్తాన్ యుద్ధం వల్ల.. మనదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దాదాపు 550 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ కనిపించింది. దీనినే ‘బ్లాక్ బడ్జెట్’ అన్నారు. అంతే కాకుండా బొగ్గు గనులను కూడా జాతీయం చేశారు. ఇవన్నీ 1973లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో జరిగాయి. అప్పుడు బడ్జెట్‌ను ‘యశ్వంతరావు చవాన్’ ప్రవేశపెట్టారు.
ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రులు
బడ్జెట్‌ను ఎక్కువసార్లు ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రుల జాబితాలో మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఈయన 1962 నుంచి 1969 వరకు ఏకంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తరువాత పి చిదంబరం ‘తొమ్మిది సార్లు’, నిర్మలా సీతారామన్ ‘ఎనిమిది సార్లు’ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Also Read: సామాన్యులకు దూరమవుతున్న బంగారం!: భారీగా పెరిగిన గోల్డ్ రేటు
2025 బడ్జెట్ ప్రత్యేకం
ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లు ఎలా ఉన్నా.. ఈ రోజు (2025 పిబ్రవరి 1) ప్రవేశపెట్టనున్న బడ్జెట్, భారతదేశ అభివృద్ధిని లేదా వికసిత్ భారత్ లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టనున్నారు. 2030నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలనే ఉద్దేశ్యం ప్రధానం. కాబట్టి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాము.