నితిన్ గడ్కరీ కార్ కలెక్షన్.. ఇలాంటి కార్లు మరెవ్వరి దగ్గరా లేదు!

Nitin Gadkari Unique Car Collection: నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి అఖండ విజయంతో గెలుపొందిన ‘నితిన్ గడ్కరి’ (Nitin Gadkari) ఈ రోజు (జూన్ 9)న కేంద్ర మంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. భారతదేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో.. ఆటోమోటివ్ రంగాన్ని ప్రగతి మార్గంలో పయనించడానికి దోహదపడిన గడ్కరీ ఎలాంటి కార్లను ఉపయోగిస్తారు? వాటి ప్రత్యేకతలు ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. రండి.

1994 హిందూస్తాన్ అంబాసిడర్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉపయోగించే కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కారు 1994 హిందూస్తాన్ అంబాసిడర్. ఒకప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమలో సరికొత్త చరిత్రను సృష్టించిన ఈ కారును ఇప్పటికి కూడా కొంతమంది వాహన ప్రియులు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ వాహనంగా ప్రసిద్ధి చెందిన అంబాసిడర్ ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలువబడిన ఈ కారును చాలా సంవత్సరాలుగా గడ్కరీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

1994 హిందూస్తాన్ అంబాసిడర్ అందరికి నచ్చే డిజైన్ కలిగి, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు రోజు వారీ వినియోగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కారును ఉపయోగించడానికి అమితాసక్తిని చూపిస్తున్నారు.

2016 హోండా సీఆర్-వీ

నితిన్ గడ్కరీ అంబాసిడర్ కారు తరువాత ఉపయోగించిన కారు హోండా సీఆర్-వీ. తన ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా.. గడ్కరీ ఈ కారును ప్రస్తావించారు. ఈ కారు దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ కారు 185 Bhp పవర్ ప్రొడ్యూస్ చేసే 2.4 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ పొందింది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు.. ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో మల్టి యాంగిల్ రియర్ వ్యూ కెమరా, హోండా సెన్సింగ్ సేఫ్టీ సూట్ వంటి ఇతర ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం.

ఇసుజు డీ-మ్యాక్స్

అంబాసిడర్, హోండా సీఆర్-వీ కార్లను మాత్రమే కాకుండా ఇసుజు డీ-మ్యాక్స్ కూడా కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కారులో ఎప్పుడూ గడ్కరీ కనిపించలేదు. అయినప్పటికీ ఈ కారు తన గ్యారేజిలో ఉన్నట్లు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కారును ఎక్కువగా ఆఫ్-రోడింగ్ చేసేవారు కూడా ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ కారు 1.9 లీటర్ మరియు 3.0 లీటర్ అనే రెండు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. దీనిని చాలామంది కేవలం వ్యక్తిగత వినియోగానికి మాత్రమే కాకుండా.. వాణిజ్య పరమైన ఉపయోగానికి కూడా ఉపయోగిస్తారు.

టయోటా మిరాయ్

నితిన్ గడ్కరీ గ్యారేజిలోని ప్రత్యేకమైన కార్లలో టయోటా కంపెనీకి చెందిన ‘మిరాయ్’ ఒకటి. ఈ సెడాన్ దేశంలోనే మొట్ట మొదటి హైడ్రోజన్‌ బేస్డ్ మోడల్. గ్రీన్ ఎనర్జీ పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమే ఈ టయోటా మిరాయ్ కారు. దీనికి కంపెనీ టీఎన్జీఏ ప్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. దీనిని కంపెనీ 2021లో ప్రవేశపెట్టింది.

మిరాయ్ 4జేఎమ్ ఎలక్ట్రిక్ మోటారును శక్తిని ఇచ్చే హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ సిస్టం కలిగి ఉంటుంది. ఇది 182 Bhp పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మిరాయ్ సెడాన్ ఒక ఫుల్ ట్యాంక్ హైడ్రోజన్‌తో ఏకంగా 647 కిమీ పరిధిని అందిస్తుంది. భవిష్యత్తులో ఈ కార్ల వినియోగం ఎక్కువగా జరగాలని.. దేశంలో మరింత మంది ఈ కారు ఉపయోగించాలని ఆశిస్తున్నారు.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్

హైడ్రోజన్ బేస్డ్ మిరాయ్ మాత్రమే కాకుండా నితిన్ గడ్కరీ టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారును కూడా ఉపయోగిస్తున్నారు. ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాలను ప్రోత్సహించడానికి గడ్కరీకి కంపెనీ ఈ ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును అందించింది. ఈ హైబ్రిడ్ కారు 100 శాతం పెట్రోల్ లేదా 100 శాతం ఇథనాల్‌తో పనిచేయగలదు. పెట్రోల్ ఖర్చుకంటే ఇథనాల్ ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా కొంత పర్యావరణ హితం కూడా. ఖర్చులను తగ్గించుకోవడానికి మోడల్ కార్లు చాలా ఉపయోగపడతాయి.

Don’t Miss: 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సెలబ్రిటీలు.. వీరే – ఇక్కడ చూడండి

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ చూడటానికి.. సాధారణ హైక్రాస్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో సరికొత్త టెక్నలజీని నిక్షిప్తం చేశారు. ఇలాంటి కారు ప్రస్తుతానికి కేవలం నితిన్ గడ్కరీ దగ్గర మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ ఇలాంటి కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.