Upcoming Car Launches in India 2025 April: మార్చి 2025 ముగిసింది. ఏప్రిల్ నెల కూడా ప్రారంభమైంది. నెలలు మారుతుంటే.. ఆటోమొబైల్ రంగంలో కూడా వేగంగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ నెలలో కూడా మార్కెట్లో అడుగుపెట్టడానికి కొన్ని కొత్త కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ విఫణిలోకి ఏ కార్లు లాంచ్ కాబోతున్నాయి?, వాటి వివరాలు ఎలా ఉన్నాయి అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్ (Volkswagen Tiguan R Line)
భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన ఫోక్స్‌వ్యాగన్.. దేశీయ విఫణిలో అత్యంత ఖరీదైన కారు ‘టిగువాన్ ఆర్ లైన్’ కారును ఈ నెల 14 (ఏప్రిల్ 14)న అధికారికంగా ఆవిష్కారించనుంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆధునిక హంగులను పొందుతుంది. 30 మిమీ ఎక్కువ పొడవైన ఈ కారు అప్డేటెడ్ హెడ్‌లైట్స్, స్పోర్టియర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ముందు మరియు వెనుక భాగం మొత్తం వెడల్పు అంతటా.. ఎల్ఈడీ ఫ్రంట్ అండ్ రియల్ లైట్ స్ట్రిప్‌లు, స్పాయిలర్ వంటివి ఉన్నాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఈ కారు 10.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రై-జోన్ యాంబియంట్ లైటింగ్, 12.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది. ఈ సరికొత్త కారు భారతీయ తీరాలకు సీబీయూ మార్గం ద్వారా రానుంది. కాబట్టి దీని ధర రూ. 50 లక్షల వరకు ఉంటుందని అంచనా.
కొత్త ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆర్ లైన్.. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 204 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 7.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 229 కిమీ.
ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster)
ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్.. మార్కెట్లో లాంచ్ చేస్తున్న మోట్ మొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఈ ‘సైబర్‌స్టర్’. ఈ కారు వచ్చే నెలలో దేశీయ విఫణిలోకి విక్రయానికి రానుంది. అయితే ఈ కారు కేవలం సెలక్టివ్ ప్రీమియం షోరూమ్‌ల ద్వారా మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం.
ఎంజీ సైబర్‌స్టర్ అనేది.. బ్రాండ్ యొక్క ఇతర అన్ని కారకు భిన్నంగా ఉంటుంది. లంబోర్ఘిని స్టైల్ డోర్స్ కలిగిన ఈ కారు పొడవైన బోనెట్, 20 ఇంచెస్ వీల్స్, బాణం ఆకారంలో ఉండే టెయిల్ ల్యాంప్‌లు, పైకి కదిలే ఫాసియా మొదలైనవన్నీ పొందుతుంది. 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 360 డిగ్రీ కెమెరా మరియు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టం, లేన్ కీప్ అసిస్ట్ మొదలైన ఏడీఏఎస్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.
సైబర్‌స్టర్ యొక్క టాప్ స్పెక్ వేరియంట్ మరియు 77 కిలోవాట్ బ్యాటరీ కలిగిన కారు మాత్రమే ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇది 510 హార్స్ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 3.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఈ నెలలో సైబర్‌స్టర్ అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.. కానీ ఎప్పటి నుంచి అనే విషయాన్ని వెల్లడించలేదు.
కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ (Kia Carens Facelift)
ఇప్పటికే అధిక అమ్మకాలు పొందిన కియా కారెన్స్.. త్వరలోనే ఫేస్‌లిఫ్ట్ రూపంలో అమ్మకానికి రానుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కారును టెస్ట్ చేస్తోంది. ఇది ఈ నెలలో మార్కెట్లో అడుగుపెట్టే అధికారికంగా అవకాశం ఉంది. ఈ కారు దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. అయితే ఇది ఎల్ఈడీ లైట్ బార్, 16 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, డ్యాష్‌బోర్డ్‌లో కొత్త బటన్స్, అప్డేటెడ్ స్విచ్‌గేర్. లెవెల్ 2 ఏడీఏఎస్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటివి పొందుతుందని సమాచారం.
కొత్త కియా కారెన్స్ ఫేస్‌లిఫ్ట్ మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. అవి 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. ఇవి మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. వీటికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
స్కోడా కొడియాక్ (Skoda Kodiaq)
ఈ నెలలో మార్కెట్లో లాంచ్ అయ్యే కార్ల జాబితాలో స్కోడా కంపెనీకి చెందిన కొడియాక్ కూడా ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్ మాదిరిగా ఉంటుంది. ఇందులో కొత్త గ్రిల్, అప్డేట్ చేయబడిన బంపర్, డోర్ మౌంటెడ్ వింగ్ మిర్రర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్ ల్యాంప్ ఉంటాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. స్కోడా కొడియాక్ కారులో 13 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనున్నాయి. ఇంజిన్ మాత్రం సాధారణ కొడియాక్ కారులోని అదే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ జరుగుతుంది.
టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ (Tata Curvv Dark Edition)
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కూడా తన కర్వ్ కారును డార్క్ ఎడిషన్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది కూడా ఈ నెలలోనే మార్కెట్లో అడుగు పెట్టనుంది. ఇది కూడా ఇప్పటికే అమ్మకానికి ఉన్న కంపెనీ యొక్క డార్క్ ఎడిషన్స్ మాదిరిగానే.. ఉండనుంది. కాబట్టి ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మొత్తం బ్లాక్ కలర్ ట్రీట్‌మెంట్ పొందుతుంది.
టాటా కర్వ్ డార్క్ ఎడిషన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ రెండూ.. 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్స్ ఎంపికలతో వస్తాయి. ఈ కారు ధరలు స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 40000 ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
సిట్రోయెన్ బసాల్ట్ డార్క్ ఎడిషన్ (Citroen Basalt Dark Edition)
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ కూడా తన బసాల్ట్ కారును డార్క్ ఎడిషన్ రూపంలో లాంచ్ చేయనుంది. కంపెనీ దీనికి సంబంధించిన టీజర్ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ కారు స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా.. నలుపు రంగులో ఉంటుంది. ఫ్రంట్, స్కిడ్ ప్లేట్స్, బెస్పోక్ బ్యాడ్జింగ్, అల్లాయ్ వీల్స్ అన్నీ కూడా డార్క్ క్రోమ్ పొందుతుంది.
Also Read: 2025లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 కార్లు ఇవే!.. రూ.10 లక్షల కంటే తక్కువే
బసాల్ట్ డార్క్ ఎడిషన్.. 110 హార్స్ పవర్ మరియు 205 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ టార్క్ కన్వర్టర్ ద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. అయితే ఈ కారు యొక్క ధరలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.