లాంచ్‌కు సిద్దమవుతున్న సీఎన్‌జీ కార్లు ఇవే!.. ఎక్కువ మైలేజ్ కోసం బెస్ట్ ఆప్షన్

Upcoming CNG Car Launches in India: భారతదేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో చాలా మంది ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ వాహనాల కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ సంస్థలు తమ కార్లను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే త్వరలో లాంచ్ కానున్న సీఎన్‌జీ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ, మీరుతి స్విఫ్ట్ ఐ-సీఎన్‌జీ, మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎస్-సీఎన్‌జీ మరియు హ్యుందాయ్ హై-సీఎన్‌జీ డ్యూయో రేంజ్ ఉన్నాయి. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయింది. కాగా ఇప్పుడు సీఎన్‌జీ రూపంలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ఈ కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో లేదు.

టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ అనేది టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన భారతదేశపు మొదటి సీఎన్‌జీ మోడల్ కానుంది. ఇది చూడటానికి దాదాపు దాని పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ లేదా సీఎన్‌జీ బ్యాడ్జెస్ ఉండటం చూడవచ్చు. కంపెనీ ఇందులో ఉపయోగించనున్న ఇంజిన్ గురించి అధికారికంగా వెల్లడించనప్పటికీ.. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

మారుతి స్విఫ్ట్ ఎస్-సీఎన్‌జీ

ఇటీవలే 30 లక్షల యూనిట్లు విక్రయించబడి అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న మారుతి స్విఫ్ట్ త్వరలోనే ఎస్-సీఎన్‌జీ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ సీఎన్‌జీ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

మే 2024లో మారుతి సుజుకి తన కొత్త జనరేషన్ స్విఫ్ట్ కారును అధికారికంగా లాంచ్ చేసింది. కాగా ఇప్పుడు కంపెనీ సీఎన్‌జీ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో 1197 సీసీ త్రీ సిలిండర్ ఇంజిన్ ఉండనున్నట్లు సమాచారం. ఇది 80.4 Bhp పవర్, 111.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుందని భావిస్తున్నారు. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే అవకాశం ఉంటుంది. సంస్థ ఇండియన్ మార్కెట్లో స్విఫ్ట్ సీఎన్‌జీ లాంచ్ చేసిన తరువాత మరిన్ని గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎస్-సీఎన్‌జీ

స్విఫ్ట్ కారును మాత్రమే కాకుండా మారుతి సుజుకి తన డిజైన్ కారును కూడా సీఎన్‌జీ రూపంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ స్విఫ్ట్ డిజైన్ యొక్క నాల్గవ తరం కారును ఇంకా లాంచ్ చేయలేదు. కానీ అంతకంటే ముందు ఇది సీఎన్‌జీ రూపంలో లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు లాంచ్ ఈ ఏడాది చివరి లోపల ఉంటుందని సమాచారం.

హ్యుందాయ్ హై-సీఎన్‌జీ & డ్యూయో రేంజ్

టాటా మోటార్స్ మరియు మారుతి సుజుకి మాత్రమే కాకుండా.. హ్యుందాయ్ కంపెనీ కూడా హై-సీఎన్‌జీ మరియు హై-సీఎన్‌జీ డ్యూయో పేరుతో సీఎన్‌జీ మోడల్స్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ వీటి కోసం ఇప్పటికే ట్రేడ్‌మార్క్ కోసం అప్లై చేసినట్లు సమాచారం. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. హ్యుందాయ్ కంపెనీ సీఎన్‌జీ విభాగంలో కూడా గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Don’t Miss: కార్లు వాలీబాల్ ఆడటం ఎప్పుడైనా చూశారా? వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

సీఎన్‌జీ కార్లకు డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే?

నిజానికి మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడో సెంచరీ దాటేశాయి. అంతే కాకుండా.. ప్రస్తుతం మార్కెట్లో లాంచ్ అవుతున్న కార్లు కూడా ఎక్కువ మైలేజ్ అందించలేకపోతున్నాయి. సీఎన్‌జీ వెహికల్స్ పెట్రోల్ కార్ల కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త కార్లను కొనుగోలు చేసే వారు సీఎన్‌జీ వాహనాల మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బైక్ విభాగంలో.. మొదటిసారి బజాజ్ ఆటో తన బైకుని సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది వచ్చే నెలలో అధికారికంగా లాంచ్ అవుతుంది.