Upcoming Electric Cars in India 2025: 2024లో చాలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టాయి. ఇక ఈ ఏడాది ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఎదురు చూసేవారు.. మరికొన్ని రోజులు ఎదురుచూస్తే.. 2025లో ఏకంగా 15 ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ అవుతున్నాయి. వాటిలో మీకు నచ్చిన కారును కొనుగోలు చేయవచ్చు. వచ్చే ఏడాది (2025) మార్కెట్లో లాంచ్ అయ్యే సరికొత్త ఎలక్ట్రిక్ కార్ల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. వచ్చేయండి.
హ్యుందాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV)
వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ కానున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి.. హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా ఈవీ. ఈ కారు 2025లో జరగనున్న భారత్ ఆటొమొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో కనిపించనుంది. ఫ్యూయెల్ కారుగా దేశీయ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందిన ఈ కారు త్వరలోనే ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానుంది. ఇది 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందనున్నట్లు సమాచారం. కాబట్టి క్రెటా ఈవీ ఒక సింగిల్ ఛార్జితో 450 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటారు 138 బీహెచ్‌పీ పవర్, 255 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 22 లక్షలు ఉంటుందని సమాచారం.
మారుతి సుజుకి ఈ విటారా (Maruti Suzuki E Vitara)
2025లో మారుతి సుజుకి కూడా తన గ్రాండ్ విటారా కారును ఎలక్ట్రిక్ రూపంలో ‘ఈ విటారా’ పేరుతో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా 2025 భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ కారు ఇటలీలోని మిలాన్‌లో కనిపించింది. కాబట్టి ఈ గ్రాండ్ విటారా 49 కిలోవాట్ మరియు 61 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందనున్నట్లు సమాచారం. ఇది ఒక ఫుల్ ఛార్జితో 450 నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంటుందని సమాచారం.
టయోటా అర్బన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Toyota Urban Electric SUV)
వచ్చే సంవత్సరం మార్కెట్లో లాంచ్ కానున్న మరో ఎలక్ట్రిక్ కారు.. టయోటా కంపెనీకి చెందిన అర్బన్ ఎలక్ట్రిక్ అని తెలుస్తోంది. ఇది ఈ విటారా కంటే కొంత భిన్నంగా ఉంటుంది. అయితే ఇంటీరియర్ ఈ విటారా మాదిరిగానే ఉంటుంది. యాంత్రికంగా కూడా అర్బన్ ఎలక్ట్రిక్.. మారుతి ఈ గ్రాండ్ విటారాకు సమానంగా ఉంటుంది.
మహీంద్రా బీఈ 6 & ఎక్స్ఈవీ 9ఈ (Mahindra BE 6 & XEV 9E)
2025లో మహీంద్రా కంపెనీ కూడా బీఈ 6 మరియు ఎక్స్ఈవీ 9ఈ పేరుతో రెండు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సిద్దమైంది. ఇప్పటికే సంస్థ ఈ కార్లను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు 59 కిలోవాట్ మరియు 79 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతాయి. కాబట్టి వీటి రేంజ్ అనేది 500 కిమీ నుంచి 650 కిమీ వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధరలు రూ. 20 లక్షల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా ఎస్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ (Mahindra SUV 3XO EV)
ఇప్పటికే ఫ్యూయెల్ కారుగా మార్కెట్లో అమ్ముడవుతున్న మహీంద్రా ఎస్‌యూవీ 3ఎక్స్ఓ.. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది మార్కెట్లో లాంచ్ కానున్న ఎస్‌యూవీ 400 ఈవీ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అని తెలుస్తోంది. ఎస్‌యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ కారు 34.5 కిలోవాట్ మరియు 39.5 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. ఈ కారు చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే అక్కడక్కగా కొన్ని మార్పులు లేదా చేంజెస్ స్పష్టంగా కనిపిస్తాయి.
టాటా ఎలక్ట్రిక్ కార్లు (Tata Electric Cars)
దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2025లో లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కార్లలో హారియార్ ఈవీ (Haarier EV), సఫారీ ఈవీ (Safari EV) మరియు సియెర్రా ఈవీ (Sierra EV) వంటివి ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి కొంతవరకు స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా అనిపించినప్పటికీ.. ఎలక్ట్రిక్ కార్లు కాబట్టి కొన్ని ఆధునిక మార్పులను గమనించవచ్చు. కంపెనీ ఈ కార్ల ధరలు మరియు రేంజ్ వంటయి వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఎంజీ విండ్సర్ ఈవీ 50 కిలోవాట్ (MG Windsor EV 50 kWh)
ఇటీవలే భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ.. వచ్చే ఏడాది 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కలిగిన కారుగా దేశీయ విఫణిలో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్న 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 331 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ కానున్న 50 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కారు 450 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.
ఎంజీ సైబర్‌స్టర్ (MG Cyberster)
2025 జనవరిలో ఎంజీ మోటార్ కంపెనీ మార్కెట్లో మొదటిసారి తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు సైబర్‌స్టర్‌ను ఆవిషకరించనుంది. సరికొత్త డిజైన్ కలిగిన ఈ కారు కూపే మాదిరిగా ఉంటుంది. దీని ధర రూ. 80 లక్షల నుంచి రూ. 85 లక్షల మధ్య ఉంది. ఈ కారు ఒక సింగిల్ చార్జితో 560 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
Also Read: కొత్త పెళ్లి కూతురు ‘కీర్తి సురేష్’ ఇష్టపడి కొన్న కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?
కియా సైరస్ ఈవీ (Kia Syros EV)
ఇప్పటికే ఉత్తమ కార్లను మార్కెట్లో లాంచ్ చేసి గొప్ప అమ్మకాలు పొందుతున్న కియా మోటార్స్ త్వరలోనే ‘సైరస్ ఈవీ’ పేరుతో మరో కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే దీనిని కంపెనీ ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని.. స్పష్టంగా వెల్లడించలేదు. అయితే 2025 ద్వితీయార్థంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇది 35 కిలోవాట్ లేదా 40 కిలోవాట్ బ్యాటరీని పొందుతుందని, ఇది 400 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం.
స్కోడా ఎన్యాక్ IV (Skoda Enyaq IV)
చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా కూడా వచ్చే ఏడాది భారతీయ మార్కెట్లో ఎన్యాక్ IV ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 50 లక్షల నుంచి రూ. 55 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారులో 77 కిలోవాట్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది 513 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ కారు డ్యూయెల్ మోటార్ సెటప్ పొందుతుందని సమాచారం.
Also Read: లక్కీ భాస్కర్‌లో ‘దుల్కర్ సల్మాన్’ వాడిన విలాసవంతమైన కారు ఇదే!
స్కోడా ఎల్రోక్ (Skoda Elroq)
ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా లాంచ్ చేయనున్న మరో ఎలక్ట్రిక్ కారు ఎల్రోక్. ఇది 50, 60, 85 మరియు 85ఎక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుందని సమాచారం. ఇది 55 కిలోవాట్, 63 కిలోవాట్, 82 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు గరిష్టంగా 560 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారుకు సంబంధించిన ధరలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.4 (Volkswagen ID.4)
కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనున్న కంపెనీల జాబితాలో ఫోక్స్‌వ్యాగన్ కూడా ఉంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ కారు పేరు ఐడీ.4. ఈ కారు ధర రూ. 65 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇది 55 కిలోవాట్ మరియు 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు గరిష్టంగా 500 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ కారు కూడా 2025లోనే లాంచ్ అవుతుందని సమాచారం.