Volvo C40 Recharge Discount: స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో (Volvo) భారతీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. ఇప్పటికే పలు కార్లను లాంచ్ చేసి మంచి అమ్మకాలు పొందుతూ.. దూసుకెళ్తున్న కంపెనీ ఇప్పుడు తన ‘సీ40 రీఛార్జ్’ (C40 Recharge) ఎలక్ట్రిక్ కారు కొనుగోలు మీద కస్టమర్లకు ఏకంగా రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
డిస్కౌంట్స్
వోల్వో కంపెనీ యొక్క సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ధర రూ. 62.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఇప్పుడు అందిస్తున్న ఈ డిస్కౌంట్ కారణంగా ఈ కారును రూ. 60.95 లక్షలకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ వోల్వో సీ40 రీఛార్జ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లభిస్తుంది. 2024 ఫిబ్రవరిలో కూడా కంపెనీ ఈ కారు కొనుగోలు మీద రూ. 1 లక్ష తగ్గింపును అందించింది.
నిజానికి వోల్వో కంపెనీ తన సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారును రూ. 61.25 లక్షల ప్రారంభ ధరలో లాంచ్ చేసింది. ఆ తరువాత అక్టోబర్ 2023లో ఈ ధర రూ. 62.95 లక్షలు చేరింది. ప్రస్తుతం కంపెనీ రూ. 2 లక్షలు డిస్కౌంట్ అందిస్తుండంతో.. ధర రూ. 60.95 లక్షల వద్ద నిలిచింది.
డిజైన్
వోల్వో సీ40 రీఛార్జ్ చూడటానికి దాని మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. రూఫ్‌లైన్ కూపే లాంటి ముగింపును పొందుతుంది. రీడిజైన్ చేయబడిన టెయిల్‌గేట్, సన్నని టెయిల్ లాంప్, ఎల్ఈడీ లైట్ ఎలిమెంట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇది డ్యూయెల్ టోన్ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక వైపు విండో లైన్ కూపే లుక్ పొందుతుంది.
ఫీచర్స్
కంపెనీ తన వోల్వో సీ40 రీఛార్జ్ ధరలను తగ్గించడంతో.. ఫీచర్స్ ఏమైనా తగ్గాయా అనే అపోహపడాల్సిన అవసరం లేదు. ఈ కారులో ఉన్న అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది 9.0 ఇంచెస్ ఆండ్రాయిడ్ బేస్డ్ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం పొందుతుంది. అంతే కాకుండా ఇందులో హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టం, వైర్డ్ ఆపిల్ కార్‌ప్లే మరియు డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారులో ఉన్నాయి.
వోల్వో సీ40 రీఛార్జ్ ఈవీలో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది. ఇది వాహనం గురించి కావాల్సిన సమాచారాన్ని వినియోగదారునికి అందిస్తుంది. ట్రాఫిక్ పరిస్థితులను సైతం అంచనా వేయడానికి కావలసిన ఆటో వన్ పెడల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడిన లెవెల్ 3 అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) కూడా ఇందులో లభిస్తుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
బ్యాటరీ & రేంజ్
ఇక బ్యాటరీ విషయానికి వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారులో 78 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 530 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 403 Bhp పవర్ మరియు 660 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో వస్తుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమ వాడుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 180 కిమీ కావడం గమనార్హం.
Don’t Miss: అమ్మకాల్లో అదరగొట్టిన Nissan Magnite.. గ్లోబల్ మార్కెట్లో కూడా తగ్గని హవా!
అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ మంచి రేంజ్ కూడా అందిస్తుంది. ఛార్జింగ్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 150 కిలోవాట్ ఛార్జర్ ద్వారా 37 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. కాబట్టి ఛార్జింగ్ విషయంలో కూడా వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు.
ప్రత్యర్థులు
భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న కియా ఈవీ6, హ్యుందాయ్ ఐయోనిక్ 5 వంటి ఎలక్ట్రిక్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ఇది దాని XC40 రీఛార్జ్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధరల పరంగా దాని కంటే కొంత ఎక్కువని స్పష్టంగా తెలుస్తోంది.