లాటిన్ అమెరికా పోప్ అయిన ‘పోప్ ఫ్రాన్సిస్’ అనారోగ్య కారణాల వల్ల 88 సంవత్సరాల వయసులో సోమవారం కన్నుమూసారు. సంతాపదినాలు పూర్తయిన తరువాత.. ఆ స్థానంలోకి వచ్చే మరో పోప్ ఎవరనేది ప్రస్తుతం చాలామంది మనసులో మెదులుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. ఇంకా కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే పోప్‌ను ఎన్నుకోవడానికి సమావేశాలు జరగాలి, కార్డినల్స్ ఓటు నిర్వహిస్తారు. ఆ తరువాత ఎవరికైతే ఎక్కువ మెజారిటీ వస్తుందో.. వారు కాథలిక్ చర్చ్ పోప్ బాధ్యతలు తీసుకుంటారు.
పోప్ ఫ్రావిన్స్ తరువాత పోప్ అయ్యే అర్హతలు కొంతమందికి ఉన్నట్లు తెలుస్తోంది. వీరే తరువాత కాథలిక్ నాయకుడు అవుతారు. జాబితాలో ఎవరెవరున్నారో ఈ కథనంలో చూసేద్దాం..
కార్డినల్ పియట్రో పరోలిన్
పోప్ ఫ్రావిన్స్ వారసుడు కావడానికి లేదా పోటీలో ముందువరుసలో ఉన్న వ్యక్తుల పేర్లలో ‘కార్డినల్ పియట్రో పరోలిన్’ ఉన్నారు. వాటికన్ విదేశాంగ కార్యదర్శి అయిన ఈయన వయసు 70 సంవత్సరాలు. ఇటలీకి చెందిన పరోలిన్ చైనా మరియు మధ్యప్రాచ్య దేశాలతో సున్నితమైన చర్చలలో భాగంగా గొప్ప దౌత్య అనుభవాన్ని కలిగి ఉన్నారు. మితవాద వ్యక్తిగా కూడా ఎంతోమంది ఆదరణ పొందుతున్నారు.
కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే
ఫిలిప్పీన్స్‌కు చెందిన టాగ్లే.. ఆకర్శణీయమైన మరియు అందంగా ఉన్న వ్యక్తిగా యూఎస్ క్యాథలిక్కులు అభివర్ణించారు. టాగ్లే పోప్‌గా ఎన్నికైతే.. ఆసియా నుంచి ఎన్నికైన మొదటి పోప్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తారు. పోప్ ఫ్రాన్సిస్ మాదిరిగానే.. ఈయన కూడా ప్రగతిశీల భావాలను కలిగి ఉన్నారు. స్వలింగ సంపర్కులు, అవివాహిత తల్లులు, విడాకులు తీసుకున్న క్యాథలిక్కుల పట్ల కఠినంగా వ్యవహరించడాన్ని ఈయన పూర్తిగా వ్యతిరేకించారు.
కార్డినల్ పీటర్ ఎర్డో
హంగేరికి చెందిన 72 సంవత్సరాల కార్డినల్ ఎర్డో.. క్యాథలిక్ చర్చిలో సంప్రదాయబడ్డా అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందారు. ఈయన యూరప్ బిషప్‌ల సమావేశాల కౌన్సిల్ మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎర్డో.. ఒక మరియన్ భక్తుడు కూడా. తన ఆచారాలను యేసు తల్లి మేరీకి అంకితం చేసారు. విడాకులు తీసుకున్న లేదా తిరిగి వివాహం చేసుకున్న క్యాథలిక్కులు.. పవిత్ర కమ్యూనియన్ స్వీకరించడాన్ని ఈయన వ్యతిరేకించారు.
కార్డినల్ రేమండ్ లియో బర్క్
అమెరికాలోని విస్కాన్సిన్లో జన్మించిన కార్డినల్ రేమండ్ బర్క్.. బహిరంగంగా మాట్లాడే సంప్రదాయవాదిగా ప్రసిద్ధి చెందారు. ఈయన కూడా విడాకులు తీసుకున్న లేదా మళ్ళీ పెళ్లి చేసుకున్న జంటలు యూకారిస్ట్ను స్వీకరించడానికి అనుమతించడం వంటివాటిని వ్యతిరేకించారు. అంతే కాకుండా కృత్రిమ గర్భనిరోధకం, స్వలింగ సంపర్కులపై చర్చి కొత్త వైఖరిని కూడా ఈయన విమర్శించారు. జో బైడెన్ వంటి చట్టబద్దమైన గర్భస్రావాలకు మద్దతు పలికే క్యాథలిక్ రాజకీయ నాయకులు యూకారిస్ట్ను స్వీకరించకూడదని ఈయన గతంలోనే పేర్కొన్నారు.
కార్డినల్ రాబర్ట్ సారా
ఆఫ్రికాలోని గినియాకు చెందిన 76 ఏళ్ల కార్డినల్ రాబర్ట్ సారా.. క్యాథలిక్ చర్చిలో ప్రముఖ సంప్రదాయవాద వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. సాంప్రదాయ పద్ధతులు, నమ్మకాలను పాటించడం వంటి వాటిపై బలమైన అభిప్రాయాలను కలిగి ఉన్న వ్యక్తి రాబర్ట్ సారా. పోప్ ఫ్రాన్సిస్ యొక్క కొన్ని ఉదారవాద ఆలోచనలను (మళ్ళీ వివాహం, చర్చిలో మహిళల పాత్ర) ఈయన విమర్శించారు.
Also Read: ధీరూభాయ్ అంబానీ కారు వాడుతున్న స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
కార్డినల్ మాటియో జుప్సి
69 సంవత్సరాల కార్డినల్ మాటియో జుప్సి.. పోప్ ఫ్రాన్సిస్‌కు అత్యంత సన్నిహితుడు. ఈయన 2022లో ఇటలీ ఎపిస్కోపల్ కాన్ఫరెన్స్‌కు అధ్యక్షుడయ్యాడు. 2019లో మాటియో జుప్సి.. పోప్ ఫ్రాన్సిస్ చేతనే కార్డినల్ హోదా పొందారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించిన ఈయన.. ఉక్రెయిన్ శాంతి మిషన్‌లో కూడా పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని వంటి వారిని కూడా ఈయన కలిశారు.