Woman Arrives in Luxury Car and Buys BMW R 1300 GS Bike: వంటింటికి మాత్రమే ఆడవాళ్లు పరిమితం అనే రోజులు పోయాయి. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆధునిక కాలంలో వాహనాలను నడిపే మహిళల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో చాలామంది ఖరీదైన కార్లను, బైకులను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇటీవల ఓ మహిళ ఖరీదయిన బీఎండబ్ల్యూ కారులో వచ్చి.. ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో గమనిస్తే.. ఒక మహిళ బీఎండబ్ల్యూ 3 సిరీస్ కారులో రావడం చూడవచ్చు. ఆమె బీఎండబ్ల్యూ మోటోరాడ్ షోరూంలో ‘బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్’ అడ్వెంచర్ బైక్ కొనుగోలు చేసింది. బైక్ కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసిన తరువాత.. బైక్ పక్కన నిలబడి పోజులిస్తుంది. ఆ తరువాత బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది.
బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్
భారతదేశంలోని అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో ‘బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్’ (BMW R 1300 GS) కూడా ఒకటి. ఈ బైక్ ధర రూ. 21.20 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ గత ఏడాదే మార్కెట్లో లాంచ్ అయింది. ఇది లైట్ వైట్, ట్రిపుల్ బ్లాక్, జీఎస్ ట్రోఫీ మరియు ఆప్షన్ 719 ట్రముంటానా అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అయితే.. ఆ మహిళ కొనుగోలు చేసిన బైక్ ట్రిపుల్ బ్లాక్ వేరియంట్ అని తెలుస్తోంది.
చూడటానికి అత్యద్భుతంగా ఉన్న.. బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైక్, ముందు నుంచి భారీగా కనిపిస్తుంది. స్పోక్డ్ ట్యూబ్‌లెస్ టైర్లను కలిగిన ఈ బైక్ ఎలక్ట్రానిక్ విండ్ స్క్రీన్, బైడైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, సెంటర్ స్టాండ్ మరియు ప్రో రైడింగ్ మోడ్స్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.
బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బేస్ వేరియంట్ లేదా లైట్ వైట్ వేరియంట్ మినహా.. అన్ని ఇతర వేరియంట్లు టూరింగ్ ప్యాకేజ్ పొందుతాయి. ఈ ప్యాకేజీలో పన్నీర్ మౌంట్స్, క్రోమ్డ్ ఎగ్జాస్ట్ హెడర్ పైపులు, అడాప్టివ్ హెడ్‌లైట్, నకిల్ గార్డ్ ఎక్స్‌టెండర్‌లు మరియు జీపీఎస్ కోసం మౌంట్ వంటివి ఉన్నాయి. అయితే ట్రిపుల్ బ్లాక్ వేరియంట్ మాత్రమే.. అడాప్టివ్ రైడ్ హైట్ ఫీచర్‌ను ఆప్షన్‌గా పొందుతుంది. టాప్ ఎండ్ 719 ట్రాముంటానా వేరియంట్ యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఫ్రంట్ కొలిషన్ వార్ణింగ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఖరీదైన బీఎండబ్ల్యూ ఆర్ 1300 జీఎస్ బైకులో 1300 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 145 Bhp పవర్ మరియు 149 Nm టార్క్ అందిస్తుంది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. సుమారు 237 కేజీల బరువున్న ఈ బైక్ 19 లీటర్ల కెపాసిటీ కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. కాబట్టి లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
బీఎండబ్ల్యూ బైక్స్ కలిగిన సెలబ్రిటీలు
నిజానికి బీఎండబ్ల్యూ బైకులు అడ్వెంచర్ చేసేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అడ్వెంచర్ అంటే.. ముందుగా గుర్తొచ్చేది తమిళ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar). ఇతని వద్ద ‘బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్’ (BMW R 1250 GS) బైక్ ఉంది. గతంలో చాలా సార్లు అజిత్ కుమార్ ఈ బైక్ రైడ్ చేస్తూ కనిపించారు.
Also Read: ఈ కార్లనే ఎగబడి కొనేస్తున్నారు.. కొత్త ఏడాదిలో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే!
నటుడు అజిత్ కుమార్ మాత్రమే కాకుండా.. మలయాళ నటి ‘మంజు వారియర్’ (Manju Warrier) కూడా ‘బీఎండబ్ల్యూ ఆర్ 1250 జీఎస్’ బైక్ కలిగి ఉంది. ఓ సందర్భంలో ఈ బైకుపై ఆమె ఆఫ్ రోడింగ్ కూడా చేశారు. ఈ బైక్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 18.8 లక్షలు (ఎక్స్ షోరూమ్).
అజిత్ కుమార్, మంజు వారియర్ వద్ద మాత్రమే కాకుండా షాహిద్ కపూర్, జాన్ అబ్రహం, అర్షద్ వర్షి, విజయ్ సేతుపతి, నాగ చైతన్య, ఆర్ మాధవన్ మరియు కునాల్ కెమ్ము వంటి ప్రముఖ సినీతారల వద్ద కూడా ఈ బీఎండబ్ల్యూ బ్రాండ్ బైక్ ఉంది. దీన్ని బట్టి చూస్తే.. బీఎండబ్ల్యూ బైకులకు ఎక్కువమంది సెలబ్రిటీ అభిమానులనే చెప్పాలి.
View this post on Instagram