Bajaj Freedom 125 CNG Launched in India: ఇప్పటివరకు మీరు పెట్రోల్ బైకులను చూసారు, ఎలక్ట్రిక్ బైకులను చూసారు. కానీ ఎప్పుడైనా సీఎన్‌జీ చూశారా?. చూసి ఉండరు, చూసే ప్రసక్తే లేదు. ఎందుకంటే సీఎన్‌జీ బైక్ లాంచ్ అయిందే ఈ రోజు (జులై 05). కాబట్టి ఇంతకీ సీఎన్‌జీ బైక్ ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? దీని ధర ఎంత? బుకింగ్స్ ప్రారంభమయ్యాయి? డెలివరీలు ఎప్పుడు అనే వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.
సీఎన్‌జీ బైక్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto).. ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ సీఎన్‌జీ బైక్ పేరు ‘ఫ్రీడమ్ 125’ (Freedom 125). చూడటానికి సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది.
వేరియంట్స్, ధరలు, బుకింగ్స్ మరియు డెలివరీలు
దేశీయ విఫణిలో అడుగుపెట్టిన బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. డ్రమ్, డ్రమ్ ఎల్ఈడీ మరియు డిస్క్ ఎల్ఈడీ. వీటి ధరలు వరుసగా రూ. 95000, రూ. 1.05 లక్షలు మరియు రూ. 1.10 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మొదట మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రారంభమవుతాయి. ఆ తరువాత దేశం మొత్తం మీద ప్రారంభమవుతాయి.
కలర్ ఆప్షన్స్
కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి కరీబియన్ బ్లూ, సైబర్ వైట్, రేసింగ్ రెడ్, ఎబోనీ బ్లాక్ మరియు ప్యూటర్ గ్రే కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారు తనకు నచ్చిన కలర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ & మైలేజ్
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ట్యాంకులను పొందుతుంది. సీఎన్‌జీ ట్యాంక్ కెపాసిటీ 2 కేజీలు, పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కూడా రెండు లీటర్లు. సీఎన్‌జీ ట్యాంక్ అనేది సీటు కింద అమర్చబడి ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ సీఎన్‌జీ ట్యాంకుకు ముందు భాగంలో ఉంటుంది.
పెట్రోల్ ద్వారా సీఎన్‌జీ బైక్ 102 కిమీ మైలేజ్.. సీఎన్‌జీ ద్వారా 200 కిమీ మైలేజ్ అందిస్తుందని సమాచారం. మొత్తం మీద ఇది ఒక ఫుల్ ట్యాంకుతో ఏకంగా 300 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. కంపెనీ ఈ బైకును ఏకంగా 11 సార్లు టెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ 125 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 9.4 Bhp పవర్ మరియు 9.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ సీఎన్‌జీ నడుస్తున్నప్పుడు గంటకు 90.5 కిమీ, అదే పెట్రోల్ ద్వారా నడుస్తున్నప్పుడు ఈ బైక్ టాప్ స్పీడ్ 93.4 కిమీ వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఫీచర్స్
కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ చూడటానికి సింపుల్ డిజైన్ పొందినప్పటికీ.. అధునాతన ఫీచర్స్ ఇందులో ఉంటాయని తెలుస్తోంది. ఇందులో టెలిస్కోపిక్ పోర్క్, లింక్డ్ టైప్ మోనో రియర్ షాక్ ఉంటాయి. ఈ బైక్ 785 మిమీ పొడవు ఉంటుంది. కాబట్టి ఇది రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన నెగిటివ్ ఎల్‌సీడీ క్లస్టర్ పొందుతుంది. ఇవన్నీ బైక్ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయి.
Don’t Miss: ఇంత ఖరీదైన స్కూటర్లను ఎప్పుడైనా చూశారా? ధర తెలిస్తే తప్పకుండా షాకవుతారు!
ప్రత్యర్థులు
భారతీయ మార్కెట్లో అనేకసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకుకు ప్రధాన ప్రత్యర్థులు లేదు. ఎందుకంటే ఇప్పటివరకు సీఎన్‌జీ విభాగంలో బైకులే లేదు. అయితే 125 సీసీ విభాగంలో టీవీఎస్ రైడర్ 125, హోండా ఎస్పీ 125 మరియు హీరో గ్లామర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా బజాజ్ సీఎన్‌జీ బైక్ కొంత పొతే ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.