Young Man Who Earns in Kumbh Mela with A Girl Friend Idea: ఏదైనా ఓ బిజినెస్ చేయాలంటే.. తప్పకుండా పెట్టుబడి పెట్టాల్సిందే. ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయడం కొంత కష్టమే.. అయితే ప్రయత్నిస్తే అసాధ్యం మాత్రం కాదు. ఆలోచన ఉండాలేగానే.. ఎడారిలో ఇసుకను, హిమాలయాలలో మంచును అమ్మేయొచ్చని ఏదో ఓ సినిమాలో కూడా బహుశా వినే ఉంటారు. అలాంటి ఓ సరికొత్త ఆలోచనతోనే.. ఓ యువకుడు పెట్టుబడి లేకుండానే, డబ్బు సంపాదించేస్తున్నాడు. ఎందోమంది ఔరా అనిపించేస్తున్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరు? అతడు చేస్తున్న బిజినెస్ ఏమిటి అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో.. ఒక యువకుడు ఎలాంటి పెట్టుబడి లేకుండా, కేవలం వారం రోజుల్లో రూ. 40,000 సంపాదించాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇతడు చేసే బిజినెస్ ఏమనుకుంటున్నారా..? గ్రామీణ ప్రాంతాలలో బ్రెష్ చేసుకోవడానికి లేదా పళ్ళు తోముకోవడానికి ఉపయోగించే ‘పుల్లల’ విక్రయం.
పళ్ళు తోమే పుల్లలు అమ్ముతూనే.. ఆ యువకుడు డబ్బు సంపాదిస్తున్నాడు. అయితే ఆ ఆలోచన తనది కాదని, తన గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతోనే ఈ వ్యాపారం మొదలు పెట్టానని పేర్కొన్నాడు. దీనికి సంబందించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనించినట్లయితే.. బ్లూ కలర్ జాకెట్ వేసుకున్న యువకుడు, చేతిలో పుల్లలు పట్టుకుని కనిపించడం చూడవచ్చు. అంతే కాకుండా.. ఆ యువకుడు అడిగిన ప్రశ్నలకు కూడా చాలా ఓపిగ్గా జవాబులు ఇస్తున్నాడు. కొంత డబ్బు సంపాదించడానికి తాను కుంభమేళాకు వచ్చినట్లు చెబుతూ.. ఈ ఆలోచన ఎవరు ఇచ్చారని అడిగితే.. సంతోషం నిండిన ముఖంతో నా గర్ల్‌ఫ్రెండ్ ఐడియా ఇచ్చింది అని చెప్పాడు.
ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ పుల్లలు ఎలా విక్రయించవచ్చో.. చెబుతూ ఆమె వల్ల నేను చాలా సంపాదించాను అని పేర్కొంటూ.. ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు. అతని నిజాయితీకి, తన గర్ల్‌ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమకు, ఆమెకు క్రెడిట్ ఇవ్వడానికి వెనుకాడని మనస్తత్వానికి పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు.
ఇంతమంచి ఆలోచన ఇచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌ను ఎప్పుడూ వదులుకోవద్దు.. మోసం చేయవద్దు ఒకరు కామెంట్ చేశారు. చాలా అమాయకత్వంతో నిజం మాట్లాడుతున్నావు. నువ్వు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటావు అని మరొకరు అన్నారు. ప్రతి మగాడి విజయం వెనుక, తప్పకుండా.. ఒక ఆడది ఉంటుందనేది నిజమని ఇంకొకరు అన్నారు.
మహా కుంభమేళా 2025 (Maha Kumbh Mela 2025)
ఎంతోమంది ప్రజలు పరమ పవిత్రంగా భావించే మహా కుంభమేళా 2025 జనవరి 13న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26వరకు జరుగుతుంది. గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమ ప్రదేశం త్రివేణి సంగమంలో ఈ సారి ఏకంగా 40 కోట్లమంది పుణ్య స్నానాలు చేయనున్నట్లు సమాచారం. ఇక్కడికి కేవలం భారతదేశంలోని భక్తులు మాత్రమే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున విచ్చేస్తారు.
Also Read: మహా కుంభమేళా 2025: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 5 ఘటనలు ఇవే..
సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా.. ఎంతోమంది సాధువులు కూడా కుంభమేళాకు విచ్చేస్తారు. పాపాలు పోగొట్టుకుని, జన్మ తరింపజేసుకోవడానికి భక్తులు పవిత్ర స్నానాలు చేస్తుంటారు. మొత్తం మీద ఈ మహా కుంభమేళా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం లభించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ. 7000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కుంభమేళాకు మోదీ
నిరాఘాటంగా జరుగుతున్న మహా కుంభమేళాకు ఈ రోజు (బుధవారం) దేశ ప్రధానమంత్రి ‘నరేంద్ర మోదీ’ (Narendra Modi) వెళ్లనున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసిన తరువాత.. గంగాదేవికి ప్రార్థనలు చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడకు చేరుకున్నట్లు సమాచారం. పుణ్య స్నానాలు పూర్తయిన తరువాత మళ్ళీ ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతలను కూడా ఏర్పాటు చేశారు.
View this post on Instagram