Maruti Dzire Launch Today in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) రేపు (నవంబర్ 11) భారతీయ మార్కెట్లో తన అత్యంత సురక్షితమైన కారు అప్డేటెడ్ ‘డిజైర్’ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇప్పటికే కంపెనీ ఈ సబ్‌కాంపాక్ట్ సెడాన్ కోసం రూ.11,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.
రేపు మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త మారుతి డిజైర్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఈ సెడాన్‌లో వాహన వినియోగదారులకు కావలసిన దాదాపు అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ ఇంజిన్ ఉండనుంది. కాబట్టి మారుతి స్విఫ్ట్ మాదిరిగానే ఉత్తమ పనితీరును అందిస్తుంది.
డిజైన్
కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే దీని ధర రూ. 7 లక్షల నుంచి రూ. 12 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని అంచనా. 2024 డిజైర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లతో అప్డేట్ చేయబడిన గ్రిల్ వంటి వాటిని పొందుతుంది. 15 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ కారు బూట్ లిప్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి వాటితో పాటు ఎల్ఈడీ టెయిల్ లైట్ కూడా పొందుతుంది.
ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్
ఎక్స్‌టీరియర్ డిజైన్ మాత్రమే కాకుండా.. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లైట్ బ్లాక్ మరియు లేత గోధుమ రంగులో ఇంటీరియర్ చూడచక్కగా ఉంటుంది. అక్కడక్కడా సిల్వర్ యాక్సెంట్స్ కనిపిస్తాయి. ఇందులో క్లైమేట్ కంట్రోల్స్ అనేవి రౌండ్ డయల్స్ స్థానంలో టోగుల్ స్విచ్‌లను పొందుతుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. సింగిల్ పేన్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా సిస్టం కూడా ఇప్పుడు మారుతి డిజైర్ కారులో చూడవచ్చు. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేసే 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి వాటితో పాటు రియర్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.
ఇంజిన్ వివరాలు
2024 మారుతి సుజుకి డిజైర్ కొత్త జెడ్ సిరీస్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 82 పీఎస్ పవర్, 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ కారు బహుశా CNG రూపంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.
5 స్టార్ సేఫ్టీ రేటింగ్
సేఫ్టీ విషయానికి వస్తే.. మారుతి కొత్త డిజైర్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటివి పొందుతుంది. ఈ కారు ఇటీవలే గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (GNCAP) క్రాష్ టెస్టులో ఏకంగా 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ సెడాన్ పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 39.20 పాయింట్లు స్కోర్ సాధించింది. అడల్ట్ సేఫ్టీలో లేదా పెద్ద సేఫ్టీలో 34 పాయింట్లకు 31.24 పాయింట్లు స్కోర్ చేసింది. కాగా మొత్తం మీద ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇప్పటి వరకు మారుతి సుజుకి బ్రాండ్ యొక్క ఏ కారు 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకోలేదు. అయితే ఇప్పుడు మొదటిసారి డిజైర్ కారు 5 స్టార్ రేటింగ్ సాధించింది.
Don’t Miss: సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.. కారుకు ఘనంగా అంత్యక్రియలు (వీడియో)
ప్రత్యర్థులు
భారతీయ మార్కెట్లో మారుతి డిజైర్.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఇతర కార్ల ధరలతో పోలిస్తే.. 2024 డిజైర్ ధర కొంత తక్కువగా ఉండటం వల్ల మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.