2024 Nissan Magnite Facelift Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్’ (Nissa Magnite Facelift) దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దసరా, దీపావళి సందర్భంగా తక్కువ ధరలో కొత్త కారు కొనుగోలు చేయాలని ఎదురు చూసేవారికి ఇది అత్యుత్తమ ఆప్షన్ అని తెలుస్తోంది. నాలు సంవత్సరాల తరువాత భారతదేశంలో అడుగుపెట్టిన ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో.. మీ కోసం.
మొదటి 10వేల మందికే ఎక్స్ షోరూమ్ ధరలు
నిస్సాన్ ఇండియా లాంచ్ చేసిన కొత్త ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్ కారు ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ ధరలు మొదట బుక్ చేసుకున్న 10000 మందికి మాత్రమే వర్తిస్తాయి. అంటే ముందుగా బుక్ చేసుకున్న 10000 మంది కస్టమర్లకు రూ. 5.99 లక్షల ఎక్స్ షోరూమ్ ధరలే వర్తిస్తాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఎంత పెరుగుతాయనే వివరాలు ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడికాలేదు.
వేరియంట్స్ వారీగా ధరలు
▸విసియా: రూ. 5.99 లక్షలు
▸విసియా ఏఎంటీ: రూ. 6.60 లక్షలు
▸విసియా ప్లస్: రూ. 6.49 లక్షలు
▸ఎసెంటా: రూ. 7.14 లక్షలు
▸ఎసెంటా ఏఎంటీ: రూ. 7.64 లక్షలు
▸ఎన్-కనెక్టా: రూ. 7.86 లక్షలు
▸ఎన్-కనెక్టా ఏఎంటీ: రూ. 8.36 లక్షలు
▸టెక్నా: రూ. 8.75 లక్షలు
▸టెక్నా ఏఎంటీ: రూ. 9.25 లక్షలు
▸టెక్నా ప్లస్: రూ. 9.10 లక్షలు
▸టెక్నా ప్లస్ ఏఎంటీ: రూ. 9.60 లక్షలు
▸ఎసెంట్ టర్బో సీవీటీ: రూ. రూ. 9.79 లక్షలు
▸ఎన్-కనెక్టా టర్బో: రూ. 9.19 లక్షలు
▸ఎన్-కనెక్టా టర్బో సీవీటీ: రూ. 10.34 లక్షలు
▸టెక్నా టర్బో: రూ. 9.99 లక్షలు
▸టెక్నా టర్బో సీవీటీ: రూ. 11.14 లక్షలు
▸టెక్నా ప్లస్ టర్బో: రూ. 10.35 లక్షలు
▸టెక్నా ప్లస్ టర్బో సీవీటీ: రూ. 11.50 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఇండియా)
డిజైన్
కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్డ్ ఇప్పుడు కొత్త గ్రిల్ పొందుతుంది. ఇది ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, డీఆర్ఎల్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, రీస్టైల్ ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. రియర్ ప్రొఫైల్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంది. ఇక్కడ ఎటువంటి అప్డేట్ కనిపించదు.
ఇంటీరియర్ ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్
2024 నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ సన్‌రైజ్ ఆరెంజ్ కాపర్ అనే కొత్త కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇంటీరియర్ డ్యూయెల్ టోన్ కలర్ స్కీమ్ పొందుతుంది. కొత్త ఫీచర్లలో ఫ్రేమ్‌లెస్ ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఫోర్ కలర్ యాంబియంట్ లైటింగ్, వెనుకవైపు టైప్-సీ యాఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ వెంట్స్ వంటివన్నీ ఇందులో ఉన్నాయి.
8 ఇంచెస్ టచ్‌స్క్రీన్, రియర్ ఏసీ వెంట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్, 7.0 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రిమోట్ స్టార్ట్‌తో కీ, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎమ్ వంటి వాటితో పాటు.. ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్‌బెల్ట్ మరియు అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్ వంటివన్నీ ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్
2024 నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్.. స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే 1.0 లీటర్ త్రీ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 71 Bhp పవర్ మరియు 96 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. అయితే టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 99 Bhp మరియు 160 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. అయితే రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతాయి.
Don’t Miss: Kia EV9 ఎలక్ట్రిక్ కారు: సరికొత్త డిజైన్.. ఫిదా చేసే ఫీచర్స్ – రేంజ్ ఎంతో తెలుసా?
ప్రత్యర్థులు
నిస్సాన్ లాంచ్ చేసిన కొత్త మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే నిస్సాన్ తన మాగ్నైట్ కారును భారతదేశంలో లాంచ్ చేసినప్పటి నుంచి సుమారు 1.5 లక్షల సేల్స్ సాధించింది. కాబట్టి ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ కావడంతో ఈ అమ్మకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము.