2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350.. ఇప్పుడు సరికొత్త హంగులతో: ధరలు చూశారా?

2024 Royal Enfield Classic 350 Launched in India: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) తన ‘2024 క్లాసిక్ 350’ (2024 Classic 350) బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ అప్డేటెడ్ డిజైన్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ బైక్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇక్కడ మీ కోసం..

ధరలు & వేరియంట్స్

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ. 1,99,500 కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 2,30,000 (ఎక్స్ షోరూమ్). 2009లో మొదటిసారి పరిచయమైన క్లాసిక్ 350 ఆ తరువాత అనేక మార్పులకు లోనైంది. ఇంజిన్ మరియు ఛాసిస్ వంటి వాటిలో కూడా అప్డేట్స్ జరిగాయి.

హెరిటేజ్ (మద్రాస్ రెడ్, జోధ్‌పూర్ రెడ్): రూ. 1,99,500
హెరిటేజ్ ప్రీమియం (మెడలియన్ బ్రాంజ్): రూ. 2,04,000
సిగ్నల్స్ (కమాండో సాండ్): రూ. 2,16,000
డార్క్ (గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్): రూ. 2,25,000
క్రోమ్ (ఎమరాల్డ్): రూ. 2,30,000

డిజైన్

కొత్త 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ పొందుతుంది. అయితే ఇందులో గమనించదగ్గ పెద్ద మార్పులు అయితే లేదు. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ పైలెట్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మంచి దృశ్యమానతనయు అందిస్తాయి.

ఫీచర్స్

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో సెమి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, డిజిటల్ డిస్‌ప్లే, గేర్ పొజిషన్ ఇండికేటర్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటివి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఫీచర్స్ విషయంలో కూడా పెద్ద అప్డేట్స్ లేదని తెలుస్తోంది.

ఇంజిన్

2024 క్లాసిక్ 350 బైక్ అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ జె సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6100 rpm వద్ద 20.2 బ్రేక్ హార్స్ పవర్ (BHP), మరియు 4000 rpm వద్ద 27 న్యూటన్ మీటర్ (Nm) టార్క్ అందిస్తుంది. ఇంజిన్ అప్డేట్ కాలేదు కాబట్టి పనితీరులో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి రైడర్లు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అదే రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 2024 క్లాసిక్ 350 బైక్ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. అంతే కాకుండా బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి. ఈ బైకు ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ పోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ ఫ్రీలోడ్ అడ్జస్ట్ చేయగలవు. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.

అప్డేటెడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ధర మాత్రం దాని మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇది దేశీయ విఫణిలో హోండా సీబీ 350, హైనెస్ సీబీ 350, జావా 350 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వంటి వాటికి ప్రధాన పోటీదారుగా ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. అమ్మకాల పరంగా ఈ బైక్ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తోంది.

కంపెనీ ఈ బైకును ఎందుకు అప్డేట్ చేసింది?

నిజానికి ఏ కంపెనీ అయినా తన ఉనికిని నిరంతరం చాటుకోవడానికి మరియు కస్టమర్లను ఆకర్శించడానికి కొత్త బైకులు లేదా అప్డేటెడ్ బైకులు లాంచ్ చేయాల్సిందే. ఇందులో భాగంగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎప్పటికప్పుడు తన విభాగంలోని బైకులను ఆధునికంగా తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతోంది. 2024 క్లాసిక్ 350 బైక్ లాంచ్ చేయడంలో ప్రధాన ఉద్దేశ్యం కూడా ఇదే.

Don’t Miss: ఒలంపిక్‌ విజేతలకు ఎలక్ట్రిక్‌ కారు గిఫ్ట్‌.. ఎవరిచ్చారంటే?

కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ తప్పకుండా కస్టమర్లను ఆకర్షిస్తుందని, అత్యుత్తమ అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ ప్రియులు చాలామందే ఉన్నారు. వీరంతా ఎప్పుడెప్పుడు ఈ బైక్ ఆధునిక హంగులను పొందుతుందా అని వేచి చూస్తున్నారు. అలంటి వారికి 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఓ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.