2024 TVS Apache RTR 160 2V Racing Edition: టూ వీలర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్ (TVS Motor) ఎట్టకేలకు.. దేశీయ విఫణిలో ‘2024 అపాచీ ఆర్‌టీఆర్ 160 2వీ రేసింగ్ ఎడిషన్’ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ ధర ఎంత? బుకింగ్స్ ప్రారంభమయ్యాయా? డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ధర & బుకింగ్స్
టీవీఎస్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త 2024 అపాచీ ఆర్‌టీఆర్ 160 2వీ రేసింగ్ ఎడిషన్ (2024 Apche RTR 160 2V Racing Edition) ధర రూ. 1.28 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కేవలం ఒకే వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. దీని కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇప్పుడు ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీఎస్ అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. డెలివరీలు ఏ సమయంలో అయినా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
డిజైన్ మరియు ఫీచర్స్
2024 అపాచీ ఆర్‌టీఆర్ 160 2వీ రేసింగ్ ఎడిషన్ అనేది ట్రాక్ టు రోడ్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి ఇది కార్బన్ ఫైబర్ రేస్ వంటి గ్రాఫిక్స్, కాంట్రాస్టింగ్ రెడ్ అల్లాయ్ వీల్స్ మరియు ఫ్యూయెల్ ట్యాంక్ మీద స్పెషల్ రేసింగ్ ఎడిషన్ బ్యాడ్జ్ వంటి వాటిని పొందుతుంది. ఈ బైక్ స్మార్ట్ కనెక్ట్ బ్లూటూత్ ఫంక్షన్‌తో కూడిన ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా పొందుతుంది.
ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ లైట్ కలిగిన ఈ లేటెస్ట్ అపాచీ ఆర్‌టీఆర్ 160 2వీ రేసింగ్ ఎడిషన్ కంపెనీ యొక్క గ్లైడ్ త్రూ టెక్నాలజీ పొందుతుంది. ఇప్పటికే దేశీయ విఫణిలో అధిక ప్రజాదరణ పొందిన అపాచీ మరో కొత్త ఎడిషన్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇది తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.
ఇంజిన్
సరికొత్త అపాచీ ఆర్‌టీఆర్ 160 2వీ రేసింగ్ ఎడిషన్ 160 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8750 ఆర్‌పీఎమ్ వద్ద 15.82 బీహెచ్‌పీ పవర్ మరియు 7000 ఆర్‌పీఎమ్ వద్ద 13.85 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు. ఈ బైక్ మూడు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. అవి స్పోర్ట్స్, అర్బన్ మరియు రెయిన్ మోడ్స్.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 2వీ రేసింగ్ ఎడిషన్ 137 కేజీల బరువు ఉంటుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ గంటకు 107 కిమీ కావడం విశేషం. ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ, సీటు ఎత్తు 790 మిమీ. కాబట్టి ఇది అన్ని విధాలుగా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.
కంపెనీ ఈ రేసింగ్ ఎడిషన్ లాంచ్ చేసిన సందర్భంగా సంస్థ బిజినెస్ హెడ్ ‘విమల్ సుంబ్లీ’ మాట్లాడుతూ.. టీవీఎస్ యొక్క అపాచీ సిరీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఔత్సాహికుల ఆసక్తిని గుర్తించి సంస్థ ఇలాంటి బైకులను లాంచ్ చేస్తోందని అన్నారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 50 లక్షల కంటే ఎక్కువమంది టీవీఎస్ అపాచీ రైడర్లు ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. కాబట్టి ఇప్పుడు సరికొత్త హంగులతో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన అపాచీ 160 2వీ రేసింగ్ ఎడిషన్ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Don’t Miss: భారతీయుడు 2: కమల్ హాసన్ కార్లు చూశారా? లోకనాయకుడంటే ఆ మాత్రం ఉంటది!
నిజానికి భారతీయ మార్కెట్లో చాలా వాహన తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను లేదా అప్డేటెడ్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వాహన వినియోగదారులు కొత్త లేదా అప్డేట్ వాహనాలను ఉపయోగించడానికి ఆసక్తి చూపడమే అని తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీవీఎస్ ఇప్పుడు అపాచీ 160 2వీ రేసింగ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ బైక్ మంచి అమ్మకాలను పొందుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.