2025 Honda Activa 125 Launched: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఎట్టకేలకు ‘2025 యాక్టివా 125’ (2025 Activa 125)ను లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అప్డేట్స్ పొందింది. దీని గురించి పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ధర మరియు వేరియంట్స్
హోండా మోటార్‌సైకిల్ కంపెనీ లాంచ్ చేసిన అప్డేటెడ్ యాక్టివా స్కూటర్ 125 ప్రారంభ ధర రూ. 94,422. ఇది చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని చిన్న చిన్న అప్డేట్స్ గమనించవచ్చు. ఈ స్కూటర్ ఆధునిక ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందింది. అప్డేటెడ్ యాక్టివా 125 డీఎల్ఎక్స్ మరియు హెచ్-స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 94,442 మరియు రూ. 97,146 (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).
ఇంజిన్
2025 హోండా యాక్టివా 125 స్కూటర్ 123.92 సీసీ సింగిల్ సిలిండర్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8.40 పీఎస్ పవర్, 10.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ ఐడెల్ స్టార్ట్ / స్టాప్ సిస్టం కలిగి ఉండటం వల్ల మైలేజ్ కూడా కొంత పెరుగుతుంది. కాబట్టి రైడర్లు ఉత్తమ పనితీరును పొందవచ్చని తెలుస్తోంది.
అప్డేటెడ్ హోండా యాక్టివా 125 స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, సింగిల్ సైడ్ షాక్ అబ్జార్బర్ పొందుతుంది. బ్రేకింగ్స్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ వంటివి ఉన్నాయి.
డిజైన్ మరియు ఫీచర్స్
2025 హోండా యాక్టివా 125 స్కూటర్ దాని మునుపటి మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే 4.2 ఇంచెస్ TFT డిస్‌ప్లే వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఉండటం చూడవచ్చు. ఇది హోండా రోడ్‌సింక్ యాప్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైడర్ న్యావిగేట్, కాల్ / మెసేజ్ అలర్ట్స్ వంటి వాటిని యాక్సెస్ చేయవచ్చు.
అంతే కాకుండా కనెక్టెడ్ ఫంక్షన్‌లకు అనుమతిస్తుంది. USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ ఇందులో ఉండటం వల్ల ప్రయాణించే సమయంలో రైడర్ మొబైల్ వంటి వాటికి ఛార్జ్ చేసుకోవచ్చు. అప్డేటెడ్ యాక్టివా 125 బ్రాండ్ యొక్క సిగ్నేచర్ సిల్హౌట్ పొందుతుంది. అయితే కొత్తగా కాంట్రాస్టింగ్ బ్రౌన్ సీట్లు, ప్యానల్స్ వంటివి లభిస్తాయి.
కలర్ ఆప్షన్స్
2025 హోండా యాక్టివా 125 స్కూటర్ మొత్తం 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ సైరన్ బ్లూ, రెబల్ రెడ్ మెటాలిక్ మరియు పెర్ల్ ప్రేషియస్ వైట్ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. యాక్టివా 125 మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించడం వల్ల కస్టమర్లు కూడా తమకు నచ్చిన కలర్ స్కూటర్ కొనుగోలు చేయవచ్చు.
ప్రత్యర్థులు
భారతీయ విఫణిలో అడుగు పెట్టిన సరికొత్త యాక్టివా 125 స్కూటర్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న టీవీఎస్ జుపీటర్ 125 మరియు సుజుకి యాక్సిస్ 125 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా బహుశా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.
ప్రస్తుతం మార్కెట్లోని హోండా స్కూటర్లు
భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే స్కూటర్లలో హోండా స్కూటర్స్ చెప్పుకోదగ్గవి. కంపెనీ ప్రస్తుతం డియో, యాక్టివా మరియు గ్రాజియా స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ మూడూ కూడా మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందాయి. హోండా యాక్టివాను ఏకంగా 3 కోట్ల మంది కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే యాక్టివాకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: బజాజ్ చేతక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ధర తెలిస్తే ఇప్పుడో కొనేస్తారు!
ఇక హోండా డియో (Honda Dio) విషయానికి వస్తే.. ఈ స్కూటర్ 30 లక్షల సేల్స్ సాధించింది. కాగా గ్రాజియా (Honda Grazia) స్కూటర్ సేల్స్ 2 లక్షలు మాత్రమే. మొత్తం మీద మార్కెట్లో హోండా స్కూటర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది అని చెప్పడానికి వీటి అమ్మకాలే నిదర్శనం అని స్పష్టంగా తెలుస్తోంది.