మహీంద్రా 2025 బొలెరోస్ వచ్చేశాయ్.. ధరల జాబితా చూశారా?

భారతదేశంలో ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందిన బొలెరో, బొలెరో నియో కార్ల అప్డేటెడ్ వెర్షన్లను మహీంద్రా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన 2025 బొలెరో ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్ షోరూమ్), 2025 బొలెరో నియో ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ లేటెస్ట్ కార్ల డిజైన్, ఫీచర్స్, ఇతర వివరాల కోసం ఈ కథనం..

మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన 2025 బొలెరో మోడల్.. డిజైన్ పరంగా అప్డేట్స్ పొందినప్పటికీ, యాంత్రికంగా ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. కాబట్టి పనితీరు స్టాండర్డ్ బొలెరో కార్ల మాదిరిగానే ఉంటుందని సమాచారం. ఇండియన్ మార్కెట్లో సుమారు 16 లక్షల కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడైన బొలెరో.. ఇప్పుడు సరికొత్త హంగులతో మార్కెట్లో అడుగుపెట్టింది.

2025 మహీంద్రా బొలెరో

సరికొత్త మహీంద్రా బొలెరో కారు 1.5 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ ద్వారా 75 బీహెచ్‌పీ పవర్, 210 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మొత్తం నాలువు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి బీ4 (రూ.7.99 లక్షలు), బీ6 (రూ.8.69 లక్షలు), బీ6-ఓ (రూ.9.09 లక్షలు), బీ8 (రూ.9.69 లక్షలు) ఇక్కడ పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్ షోరూమ్.

డిజైన్ & ఫీచర్స్

చూడటానికి స్టాండర్డ్ మహీంద్రా బొలెరో మాదిరిగా అనిపించినప్పటికీ.. ఇది ఐదు స్లాట్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఇప్పుడు గమనించదగ్గ అతిపెద్ద అప్డేట్ కొత్త కలర్ ఆప్షన్. ఇది స్టీల్త్ బ్లాక్ రంగులో చాలా దూకుడుగా కనిపిస్తుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. కొత్త బొలెరో లెథరెట్ అపోల్స్త్రేతో కూడిన రిఫ్రెష్డ్ క్యాబిన్ పొందుతుంది. గాలి ప్రవాహానికి అనుకూలంగా ఉండేందుకు సీట్లపై మెష్ డిజైన్ కనిపిస్తుంది. ఇందులో 17.8 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంటుంది. ఇందులోని స్టీరింగ్ వీల్.. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా పొందుతుంది.

2025 మహీంద్రా బొలెరో నియో

ఇక కొత్త మహీంద్రా బొలెరో నియో విషయానికి వస్తే.. ఇది కూడా నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎన్4 (రూ.8.49 లక్షలు), ఎన్8 (రూ.9.29 లక్షలు), ఎన్10 (రూ.9.79 లక్షలు), ఎన్11 (రూ.9.99 లక్షలు) ఇక్కడ పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్ షోరూమ్. ఈ కారు 1.5 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ ద్వారా.. 100 బీహెచ్‌పీ పవర్, 260 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది మాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

డిజైన్.. ఫీచర్స్

2025 మహీంద్రా బొలెరో నియో చూడటానికి పాత మోడల్ మాదిరిగా ఉంటుంది. కానీ ఇది వర్టికల్ స్లాట్‌లతో కూడిన కొత్త గ్రిల్, ఆర్16 అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ కారు జీన్స్ బ్లూ అనే కొత్త రంగులో అందుబాటులో ఉంది.

ఈ కారు లోపలి భాగం కొత్తగా కనిపిస్తుంది. టాప్ ఎండ్ వేడియంట్ ప్రత్యేకంగా లూనార్ గ్రే కలర్ పొందుతుంది. దానికింద ఉన్న వేరియంట్స్ అన్నీ బ్రౌన్ కలర్ థీమ్ పొందుతాయి. కాబట్టి లోపలి భాగం చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ కొత్త మోడల్ రియర్ కెమెరాతో.. 22.9 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ పొందుతుంది. మొత్తం మీద ఈ రెండు కార్లు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉన్నాయని అర్థమవుతోంది.