పండుగ స్పెషల్: ఒకేరోజు మూడు బైకులు లాంచ్!

దసరా, దీపావళి దగ్గర పడుతున్న సమయంలో పలు వాహన తయారీ సంస్థలు దేశీయ విఫణిలో కొత్త బైకులు లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే హోండా మోటార్‌సైకిల్ సీబీ350సీ స్పెషల్ ఎడిషన్, సుజుకి మోటార్‌సైకిల్ కొత్త కలర్ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్, బీఎండబ్ల్యూ మోటోరాడ్ జీ 310 ఆర్ఆర్ బైకులను లాంచ్ చేశాయి. ఈ లేటెస్ట్ బైకుల గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

హోండా సీబీ350సీ స్పెషల్ ఎడిషన్

ఇండియన్ మార్కెట్లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. సరికొత్త సీబీ350సీ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.01 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 అక్టోబర్ మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఈ కొత్త సీబీ350సీ స్పెషల్ ఎడిషన్.. సీబీ350 రీబ్రాండెడ్ వెర్షన్. ఇది లేటెస్ట్ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇది రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ అనే రంగులలో లభిస్తుంది. ఈ బైకులోని 348.36 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్.. 5500 ఆర్‌పీఎమ్ వద్ద 20 హార్స్ పవర్, 3000 ఆర్‌పీఎమ్ వద్ద 29.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్

వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. ఈ పండుగ సీజన్ కోసం కొత్త కలర్ వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ బైక్ లాంచ్ చేసింది. కొత్త రంగు (పసుపు, నలుపు) మాత్రమే కాకుండా.. ఇది కొత్త డెకాల్స్ కూడా పొందుతుంది. దీని ప్రారంభ ధర రూ. 1.98 లక్షలు (ఎక్స్ షోరూమ్).

మంచి డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ బైక్ యాంత్రికంగా ఎలాంటి అప్డేట్స్ పొందలేదు. కాబట్టి అదే 249 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 26.5 బీహెచ్‌పీ పవర్, 22.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి పనితీరు పరంగా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

బీఎండబ్ల్యు జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన మరో బైక్.. బీఎండబ్ల్యు కంపెనీకి చెందిన జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్. దీని ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). భారతదేశంలో జీ 310 ఆర్ఆర్ బైక్ 1000 యూనిట్ల అమ్మకానికి నిదర్శనంగా దీనిని లాంచ్ చేశారు. కంపెనీ దీనిని 310 మందికి మాత్రమే విక్రయించనుంది. అంటే.. ఇది 310 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారన్నమాట.

కొత్త బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్.. 312.2 సీసీ ఇంజిన్ ద్వారా 34 బీహెచ్‌పీ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి ఇది చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఫీచర్స్ మాత్రం స్టాండర్డ్ బైకులో ఉండే విధంగా ఉంటాయి. ఎక్కువగా కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. మొత్తం మీద ఈ బైక్ స్టాండర్డ్ బైక్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.