స్టైలిష్ బైక్ లాంచ్ చేసిన కవాసకి: రేటెంతో తెలుసా?

ప్రముఖ బైక్ తయారీ సంస్థ కవాసకి.. ఇండియన్ మార్కెట్లో 2026 జెడ్900 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పుడున్న బ్రాండ్ యొక్క ఇతర బైకుల కంటే హుందాగా.. చూడగానే రైడ్ చేయాలనిపించేలా ఉంది. ఇంతకీ ఈ మోటార్ సైకిల్ రేటు ఎంత? ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రారంభ ధర & కలర్ ఆప్షన్స్

కవాసకి లాంచ్ చేసిన కొత్త జెడ్900 బైక్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు రెండు డ్యూయెల్ టోన్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంది. అవి ఒకటి కాండీ లైమ్ గ్రీన్ / మెటాలిక్ కార్బన్ గ్రే.. మరొకటి మెటాలిక్ మాట్టే గ్రాఫెనెస్టీల్ / మెటాలిక్ ప్లాట్ స్పార్క్ బ్లాక్.

ఆకట్టుకునే డిజైన్ & ఫీచర్స్

జపనీస్ బ్రాండ్ అయిన కవాసకి.. లాంచ్ చేసిన 2026 జెడ్900 బైక్, చూడటానికి చాలా వరకు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ.. టెక్నికల్ అప్డేట్స్ గమనించవచ్చు. కాంపాక్ట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సుగోమీ డిజైన్ ఫిలాసఫీ బాడీ చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త కవాసకి జెడ్900 బైక్ కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, పవర్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ థ్రాటిల్ వాల్వ్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్, ఎకనామికల్ రైడింగ్ ఇండికేటర్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ వంటివన్నీ ఉన్నాయి. అంతే కాకుండా.. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 5 ఇంచెస్ టీఎఫ్‌టీ కలర్ డిస్‌ప్లే ఇందులో చూడవచ్చు. రైడాలజీ యాప్ ద్వారా.. రైడర్లు కాల్స్, మెసేజస్, ఈమెయిల్స్, వెహికల్ డేటా, రైడింగ్ లాగ్‌లకు కావాల్సిన యాక్సెస్ పొందవచ్చు. టర్న్ బై టర్న్ న్యావిగేషన్ కూడా సాధ్యమవుతుంది.

ఇంజిన్ వివరాలు

కొత్త కవాసకి జెడ్900 బైకులో కాస్మొటిక్ అప్డేట్స్.. టెక్నికల్ ఫీచర్స్ గమనించవచ్చు. కానీ.. యాంత్రికంగా ఎలాంటి అప్డేట్స్ పొందలేదు. ఇందులో అదే 948 సీసీ ఇన్‌లైన్ 4 సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 125 హార్స్ పవర్, 98.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా 1 హార్స్ పవర్, 1.2 న్యూటన్ మీటర్ టార్క్ ఎక్కువ కావడం గమనార్హం. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.

2026 కవాసకి జెడ్900 లాంచ్‌పై మా అభిప్రాయం

నిజానికి ఇండియన్ మార్కెట్లో కవాసకి బైకులకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కంపెనీ లాంచ్ చేసిన ఈ జెడ్900 బైకుకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాము. అయితే ధర కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ.. ధరకు తగిన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. మొత్తం మీద ఇది పండుగ సమయంలో మార్కెట్లో లాంచ్ కావడం వల్ల.. మంది అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. కాగా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో.. సుమారు 34 మోడల్ కవాసకి బైకులు ఉన్నట్లు సమాచారం. భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకు (నింజా హెచ్2ఆర్: రూ. 79.90 లక్షలు) కూడా ఈ కంపెనీకి చెందినదే కావడం గమనించదగ్గ విషయం.