ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను విక్రయించే.. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లను ఎవరు మాత్రం కొనాలని అనుకోరు. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామంది.. ఈ కార్లను కొనుగోలు చేయడానికి సిద్దపడరు. అయితే కేవలం 33 ఏళ్ల వయసులోనే.. ఏకంగా రూ. 12 కోట్ల ఖరీదైన కారును కొనుగోలు చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఇంతకీ అయన ఎవరు? అయన కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ మోడల్ ఏది?, అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చూసేద్దాం.
రూ.12.25 కోట్ల కారు
బీసీసీ గ్రూప్ ఇంటర్నేషనల్ కంపెనీ సీఈఓ అమ్జద్ సితార.. ”రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ II బ్లాక్ బ్యాడ్జ్” కొనుగోలు చేసిన అతి చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ కారు ధర రూ. 12.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారును వీరు దుబాయ్‌లో డెలివరీ తీసుకున్నారు. ఈ కారుని డెలివరీ తీసుకున్న వీడియో.. ఫోటోలను అమ్జద్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.
అమ్జద్ సితార.. రోల్స్ రాయిస్ కల్లినన్ కారును డెలివరీ తీసుకోవడానికి తన భార్య, కూతురితో కలిసి.. మెర్సిడెస్ బెంజ్ జీ వ్యాగన్, వీ క్లాస్, రోల్స్ రాయిస్ కార్ల కాన్వాయ్‌లో వెళ్లారు. కారును డెలివరీ తీసుకోవడానికి ముందు.. డాక్యుమెంట్ వర్క్స్ అన్నీ పూర్తి చేసి, కారును డెలివరీ తీసుకున్నారు. ఆ తరువాత ఆ కారులోనే కూర్చుని వెళ్ళిపోతారు.
పూర్తి నలుపు రంగులో ఉన్న రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్.. ఆరంజ్ కలర్ ఇంటీరియర్ పొందుతుంది. కంపెనీ కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా కస్టమైజ్ కూడా చేసి ఇస్తుంది. అయితే దీనికోసం మరింత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. బహుశా అమ్జద్ కూడా కస్టమైజ్ చేయించుకున్నాడేమో అనిపిస్తుంది. ఈ కారణంగానే దీని ధర రూ. 12 కోట్ల కంటే ఎక్కువైందని తెలుస్తోంది. సాధారణ రోల్స్ రాయిస్ కార్లతో పోలిస్తే.. బ్లాక్ బ్యాడ్జ్ ధర సుమారు రూ. 2.5 కోట్లు ఎక్కువ.
రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్.. రెగ్యులర్ కల్లినన్ కంటే శక్తివంతమైనది. ఇందులో 6.75 లీటర్స్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 600 పీఎస్ పవర్, 900 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్, టార్క్ అనేవి.. రెగ్యులర్ వెర్షన్ కంటే కొంత ఎక్కువే. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది.
భార్య కోసం మరో రోల్స్ రాయిస్
కొత్త రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ అనేది అమ్జద్ సితార మొదటి రోల్స్ రాయిస్ కారు కాదు. ఎందుకంటే ఈయన బ్లాక్ బ్యాడ్ కారును డెలివరీ చేసుకోవడానికి కూడా.. ఓ రోల్స్ రాయిస్ వ్రైత్ కారులో వచ్చాడు. దీనిని ఇతడు తన భార్య (మార్జానా అమ్జద్) పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈమె అమ్జద కంపెనీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. కాగా వీరికి ఒక పాప కూడా ఉంది.
అమ్జద్ సితార కార్లు
బిజినెస్ మ్యాన్ అమ్జద్ సితారా.. వద్ద రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్, రోల్స్ రాయిస్ వ్రైత్ కార్లు మాత్రమే కాకుండా, రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్, మేబ్యాచ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, డాడ్జ్ చార్టర్ వంటి కార్లు ఉన్నాయి. సుజుకి హయబుసా బైక్ కూడా వీరి వద్ద ఉన్నట్లు సమాచారం.