యాపిల్ కంపెనీ ఇటీవలే ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇవి ఐఫోన్ 17, ఎయిర్, ప్రో, ప్రో మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ. 82,900 నుంచి ప్రారంభమై రూ. 2,29,900 వరకు ఉన్నాయి. ఈ మొబైల్ కొనుగోలు చాలామంది ఆసక్తిగానే ఉండొచ్చు. కానీ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనడానికి పెట్టే డబ్బుతో.. ఏకంగా ఓ మంచి బైక్ కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ఎలాంటి బైక్స్ కొనుగోలు చేయవచ్చో ఇక్కడ చూసేద్దాం.. పదండి.
యాపిల్ ఐఫోన్ 17 ధరలు – మోడల్స్ వారీగా
➢ఐఫోన్ 17 (256 జీబీ): రూ. 82,900
➢ఐఫోన్ 17 (512 జీబీ): రూ. 1,02,900
➢ఐఫోన్ 17 ఎయిర్ (256 జీబీ): రూ. 1,19,900
➢ఐఫోన్ 17 ఎయిర్ (512 జీబీ): రూ. 1,39,900
➢ఐఫోన్ 17 ఎయిర్ (1 టీబీ): రూ. 1,59,900
➢ఐఫోన్ 17 ప్రో (256 జీబీ): రూ. 1,34,900
➢ఐఫోన్ 17 ప్రో (512 జీబీ): రూ. 1,54,900
➢ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (256 జీబీ): రూ. 1,49,900
➢ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (512 జీబీ): రూ. 1,69,900
➢ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (1 టీబీ): రూ. 1,89,900
➢ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (2 టీబీ): రూ. 2,29,900
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350
ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన క్లాసిక్ 350 ఒకటి. ఇది 349 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ద్వారా 20.2 బీహెచ్‌పీ పవర్.. 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ ధరలు రూ. 1.97 లక్షల నుంచి రూ. 2.35 లక్షలు (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.
కవాసకి కేఎల్ఎక్స్ 230
జాబితాలో కవాసకి కంపెనీకి చెందిన కేఎల్ఎక్స్ 230 కూడా ఉంది. దీని ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 233 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 ఆర్‌పీఎమ్ వద్ద 18.1 హార్స్ పవర్, 6400 ఆర్పీఎమ్ వద్ద 18.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. మంచి పనితీరును అందిస్తుంది. ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
యమహా ఆర్15 వీ4
ఎక్కువమంది యువ రైడర్లకు ఇష్టమైన బైకుల జాబితాలో యమహా ఆర్15 వీ4 ఒకటి. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 10000 ఆర్పీఎమ్ వద్ద 18 హార్స్ పవర్, 7500 ఆర్పీఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ బైకును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్
పల్సర్ ఎన్ఎస్400జెడ్.. బజాజ్ కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైక్. రూ. 1.92 లక్షల ప్రారంభ ధర వద్ద లభించే ఈ బైక్.. 373 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది ఆకట్టుకునే డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. ఉత్తమ పనితీరును అందిస్తుంది. మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందిన బైకుల జాబితాలో ఇది ఒకటి కావడం గమనార్హం.
సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్
మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో బైక్.. సుజుకి వీ-స్ట్రోమ్ ఎస్ఎక్స్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 2.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇందులో 249 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ 26 హార్స్ పవర్, 22.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉండే ఈ బైక్.. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది.