కారు కొనాలంటే కనీసం ఐదు లక్షలైనా ఉండాల్సిందే!.. కానీ ప్రతి కుటుంబానికి ఒక చిన్న కారు ఉండాలని, అది కూడా తక్కువ ధరలోనే అందించాలనే గొప్ప సంకల్పంతో.. దివంగత పారిశ్రామికవేత్త ‘రతన్ టాటా‘.. టాటా నానో కారుకు ఆజ్యం పోశారు. అనుకున్న విధంగా కారును మార్కెట్లో లాంచ్ చేశారు. కానీ కాలక్రమేనా.. కాలగర్భంలోనే కలిసిపోయింది. ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.
టాటా నానో పుట్టుకకు కారణం
వర్షంలో స్కూటర్లపై ప్రయాణించే కుటుంబాలను చూసిన రతన్ టాటాకు.. నానో కారును లాంచ్ చేయాలనే ఆలోచన వచ్చింది. దీనిని కేవలం ఒక లక్ష రూపాయలకు అందించడం మొదలుపెట్టారు. ప్రారంభంలో.. అమ్మకాల్లో సంచలనం సృష్టించిన ఈ కారు ఎంతోమందిని ఆకట్టుకుంది. అప్పట్లో రోడ్డు మీద విరివిగా కనిపించేవి. మధ్యతరగతి కుటుంబాల కారు కొనాలనే కలను రతన్ టాటా నిజం చేశారు.
టాటా నానో కారు గురించి
నానో అనగానే చిన్న కారు అని అర్థమైపోతుంది. ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ 624 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 37 బీహెచ్‌పీ పవర్, 51 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇది ఫోర్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి మంచి పనితీరును అందించింది. ఆ తరువాత కాలంలో వచ్చిన నానో అప్డేటెడ్ మోడల్ 5 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది.
టాటా నానో 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉండటం వల్ల.. కొంత గతుకుల రోడ్డుపై కూడా సజావుగా వెళ్ళడానికి అనుమతిచ్చింది. బేర్ బోన్‌లు, ఎయిర్ కండిషనింగ్, పవర్ స్టీరింగ్ మరియు ఎయిర్‌బ్యాగ్‌లు బేస్ వేరియంట్లలో ఉండేవి కాదు. ఇవన్నీ టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి.
గేమ్ ఛేంజర్‌గా నానోకు ప్రశంసలు
2008లో న్యూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో.. టాటా నానో అందరి దృష్టిని ఆకర్శించింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో ఇది గేమ్ ఛేంజర్‌గా ప్రశంసలు అందుకుంది. ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లోని సింగూర్‌లో ఒక ప్లాంట్‌లో మాత్రమే నానో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తరువాత.. గుజరాత్‌లోని సనంద్‌కు మకాం మార్చాల్సి వచ్చింది. ఇక్కడే 2019లో ఏడాదికి 2,50,000 యూనిట్ల ఉత్పత్తి జరిగింది. తరువాత ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గిపోయింది. 2018 నాటికి నానో ఉత్పత్తి కేవలం ఒక యూనిట్‌కు తగ్గిపోయింది. దశాబ్దం తరువాత నానో పరుగు ముగిసింది.
టాటా నానో సక్సెస్ కాకపోవడానికి కారణం
నానో కారు మార్కెట్లో సక్సెస్ కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత చౌకన కారుగా ఎంతో ఆదరణ పొందిన ఈ కారులో భద్రతా లోపాలు తలెత్తాయి. నానోను కేవలం పేదవాడి కారుగా భావించి.. కొందరు దీనిని కొనుగోలు చేయడానికి ఇష్టపడలేదు. ఉత్పత్తిలో కూడా ఆలస్యం ఏర్పడింది. మారుతి 800 కారు గట్టి పోటీ ఇచ్చింది. పెరుగుతున్న ఖర్చుల కారణంగా నానో కారు ధరను 2017లో రెండు లక్షలకు పెంచారు. ఇది నానో అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారణమైంది. ఏది ఏమైనప్పటికీ.. ఇప్పటికి కూడా అక్కడక్కడా రోడ్డుమీద నానో కార్లు కనిపిస్తూనే ఉన్నాయి. నానో కారును ఎలక్ట్రిక్ రూపంలో తీసుకురావడం రతన్ టాటా కల. నానో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అవుతుందా? లేక రతన్ టాటా కల కలగానే మిగిలిపోతుందా అనేది తెలియాల్సి ఉంది.