హెల్మెట్ లేకుంటే.. పెట్రోల్ లేదు: కొత్త రూల్ వచ్చేసింది

భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ”నో హెల్మెట్.. నో ఫ్యూయెల్” పేరుతో ఓ కొత్త డ్రైవ్ ప్రారంభించింది. ఇకపై హెల్మెట్ లేకపోతే.. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయకూడదని.. పెట్రోల్ బంకు యజమాన్యాలను ఆదేశించింది. ఈ డ్రైవ్ ఎన్ని రోజులు ఉంటుంది?, ఇది ప్రారంభించడానికి కారణం ఏమిటి?, అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

నో హెల్మెట్.. నో ఫ్యూయెల్ డ్రైవ్

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెల రోజులు (2025 సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు) పాటు.. ఈ నో హెల్మెట్.. నో ఫ్యూయెల్ డ్రైవ్ నిర్వహించనుంది. రోడ్డు భద్రతను మెరుగు పరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోటార్‌సైకిల్ వినియోగదారులకు.. హెల్మెట్స్ అవసరం, భద్రత వంటి వాటిని గురించి ఈ డ్రైవ్ ద్వారా అవగాహన పెంచడం జరుగుతుంది. ఈ ప్రచారం కింద.. హెల్మెట్ ఉన్నవారికి మాత్రమే పెట్రోల్ అందిస్తారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు ఈ ప్రకటన చేశారు. రైడర్లలో సరైన రైడింగ్ క్రమశిక్షణ, భద్రతపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడం కూడా ప్రధాన ఉద్దేశ్యం అని ఆయన స్పష్టం చేశారు.

నో హెల్మెట్.. నో ఫ్యూయెల్ గురించి.. యూపీ డిప్యూటీ సీఎం & హెల్త్ మినిష్టర్ బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ, రైడర్లు వేగాన్ని నియంత్రించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. మీ భద్రత కోసం మాత్రమే కాకుండా.. మీ కుటుంబాల భద్రత కోసమే మా ఆందోళన. మీరు రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించేలా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం నిబద్దత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయాధికార్యులు, ఇతర అధికారుల మద్దతు కూడా ఉంది.

రహదారుల మంత్రిత్వ శాఖ నివేదిక

కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో 2023లో 44,534 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని తెలుస్తోంది. ఇది 2022తో పోలిస్తే (41,746 ప్రమాదాలు) కొంత ఎక్కువే అని స్పష్టమవుతోంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ప్రచారం ”నో హెల్మెట్.. నో ఫ్యూయెల్” ప్రారంభించింది. వాహన వినియోదాగారులు తప్పకుండా.. హెల్మెట్ వినియోగాన్ని గురించి.. దాన్ని వల్ల కలిగి ఉపయోగాల గురించి తెలుసుకోవాలి.

హెల్మెట్ ఎందుకంటే?

కొంతమంది బైకు మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించరు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. స్టైల్ కోసం లేదా.. జుట్టులో చెమట పడుతుందని.. ఇలా చాలానే ఉన్నాయి. కానీ హెల్మెట్ ప్రమాదంలో ప్రాణాలు కాపాడుతుంది. ఈ విషయాన్ని మాత్రం వాహన వినియోదాగారులు పెడచెవిన పెడుతున్నారు. హెల్మెట్ అనేది ప్రయాణం సమయంలో మీ తలకు కొంత భద్రతను ఇస్తుంది. కాబట్టి రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ వేసుకోవడం మర్చిపోకూడదు. మీరు మాత్రమే కాకుండా.. దీని గురించి మీ తోటివారికి కూడా అవగాహన కల్పించాలి. అప్పుడే ప్రభుత్వాల లక్ష్యాలు నెరవేరుతాయి. ప్రభుత్వ లక్ష్యాలు ఎలా ఉన్నాయా.. ప్రమాదాల భారీ నుంచి తప్పించుకోగలుగుతారు.

Leave a Comment