ప్రముఖ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. జే-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన తన మొట్టమొదటి బైక్ ‘మీటియోర్ 350‘ను ఎట్టకేలకు ఆధునిక హంగులతో.. దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఆకర్షణీయంగా ఉండటం గమనించవచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 2020లో తన మీటియోర్ 350 బైకును లాంచ్ చేసింది. ఇది అప్పట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగిన థండర్‌బర్డ్‌కు వారసత్వంగా దేశీయ విఫణిలో లాంచ్ అయింది. కంపెనీ ఈ బైకును లాంచ్ చేసిన తరువాత.. ఆధునిక ప్యాకేజీతో, కొత్త పెయింట్ స్కీమ్‌లతో, అదనపు ఫీచర్స్ కూడా జోడించడానికి సిద్ధమైంది. అందులో నుంచి పుట్టుకొచ్చినదే.. ఈ 2025 మీటియోర్ 350.
వేరియంట్స్ & ధరలు
సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధరలు రూ. 1.96 లక్షల నుంచి రూ. 2.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. నిజానికి దీని ధరలు రూ. 2.08 లక్షల నుంచి రూ. 2.32 లక్షల మధ్య ఉండేది. కానీ జీఎస్టీ సవరణల కారణంగా ధరలు తగ్గాయి.
➜ఫైర్‌బాల్ (ఫైర్‌బాల్ ఆరంజ్ & ఫైర్‌బాల్ గ్రే): రూ. 1,95,762
➜స్టెల్లార్ (స్టెల్లార్ మ్యాట్ & స్టెల్లార్ మెరైన్ బ్లూ): రూ. 2,03,419
➜అరోరా (అరోరా రెట్రో గ్రీన్ & అరోరా రెడ్) : 2,06,290
➜సూపర్నోవా (సూపర్నోవా బ్లాక్): రూ. 2,15,883
డిజైన్ & ఫీచర్స్
2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైకులో చెప్పుకోదగ్గ అప్డేట్ ఏమిటంటే.. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ ఇండికేటర్స్. అయితే ఫైర్‌బాల్, స్టెల్లార్ వేరియంట్లలో ఇవి హాలోజన్ యూనిట్లుగా ఉన్నాయి. స్లిప్పర్ క్లచ్ లభిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ మొదట.. క్లాసిక్ 350లో, ఆ తరువాత హంటర్ 350లో జరిగింది. ఇప్పుడు మీటియోర్ 350లో కనిపించింది. యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇందులో చూడవచ్చు. కాగా సూపర్నోవా, అరోరా వేరియంట్లలో అడ్జస్టబుల్ లివర్స్ కూడా ఉన్నాయి.
ఇంజిన్ వివరాలు
సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైకులోని ఇంజిన్ ఎటువంటి అప్డేట్స్ పొందలేదని తెలుస్తోంది. కాబట్టి ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అయితే ఛాసిస్, సస్పెన్షన్, బ్రేకింగ్ వంటి వాటిలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి పనితీరుపరంగా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకున్న డిమాండ్
దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే జీఎస్టీ ప్రతిపాదనలకు ముందు ధరలు పెరుగుతాయని వార్తలు వినిపించాయి. కానీ 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల ధరలు మాత్రమే పెరుగుతాయని జీఎస్టీ ప్రతిపాదనలు స్పష్టం చేశాయి. దీంతో ఇప్పుడు లాంచ్ అయిన కొత్త మీటియోర్ 350 ధరలు మాత్రమే కాకుండా.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న క్లాసిక్ 350, హంటర్ 350 బైకుల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో కంపెనీ అమ్మకాలు.. పండుగల సమయంలో మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని, ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా కంపెనీ భావిస్తోంది.