హీరో ధనుష్ తమిళంలో మాత్రమే కాకుండా.. తెలుగులో కూడా మంచి ఆదరణ పొందిన హీరో. విభిన్న పాత్రలలో నటించిన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు ‘ఇడ్లీ కడై‘ చిత్రంలో నటిస్తున్నారు. ఇది అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో తెరకెక్కనుంది. అంతంకంటే ముందు సెప్టెంబర్ 14న (ఆదివారం) చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ధనుష్ ఇడ్లీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఇడ్లీ అంటే ఇష్టం
ఆడియో లాంచ్ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. కానీ ఇడ్లి తినడానికి డబ్బులు ఉండేవి కాదు. ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి.. పువ్వులు కోయడానికి వెళ్ళేవాడిని. రెండు గంటలు పనిచేస్తే.. రెండు రూపాయలు ఇచ్చేవారు. పని ముగించుకుని రోడ్డు పక్కనే ఉన్న చేతిపంపు దగ్గర స్నానం చేసుకునేవాడిని. తరువాత ఇడ్లి కొట్టుకు వెళ్లి, రెండు రూపాయాలు ఇస్తే నాలుగు లేదా ఐదు ఇడ్లీలు పెట్టేవారు. మనం కష్టపడి సంపాదించిన దాంతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టేస్ట్ ఏ ఫైవ్ స్టార్ హోటళ్లలో కూడా లభించదని అన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ధనుష్
చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమానికి ధనుష్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలో ధనుష్ తెల్లని షర్ట్, పంచె కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమాకు సంబంధించిన కథకు తన బాల్యమే ప్రేరణ అని ధనుష్ పేర్కొన్నాడు. ఇలాంటి కథను ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడానికే ఈ సినిమా తెరకెక్కించినట్లు ధనుష్ వెల్లడించాడు.
ధనుష్ వ్యాఖ్యలపై విమర్శలు
నటుడు ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇడ్లి తినడానికి కూడా డబ్బులు లెవా అని కొందరు కామెంట్ చేస్తే?, ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం అని ఇంకొందరు అంటున్నారు. ఇలాంటి కథలు చెబితే.. ఫ్యాన్స్ కలిరిపోతారనే ఉద్దేశ్యంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మరికొందరు అంటున్నారు.
ఇడ్లి కడై చిత్రం గురించి
కుబేర సినిమా తరువాత నటుడు ధనుష్ నటిస్తున్న సినిమా ఈ ‘ఇడ్లి కడై‘. ఇది తమిళంలో మాత్రమే కాకుండా.. పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోగా ధనుష్ నటిస్తుండగా.. షాలినీ పాండే, నిత్యా మీనన్, సత్యరాజ్, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ మొదలైనవారు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా కోసం రూ. 100 కోట్లు కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
నటుడు ధనుష్ గురించి
నిజానికి ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు. ప్రొడ్యూసర్, గీత రచయిత, ప్లేబ్యాక్ సింగర్ కూడా. ఇప్పటికి 50 కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన ధనుష్ నాలుగు జాతీయ చలన చిత్ర అవార్డులను, 14 సైమా అవార్డులను, 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల జాబితాలో ఒకరుగా ఉన్నారు.