ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసుకోవడానికి 2025 జులై 30 నుంచి సెప్టెంబర్ 15 వరకు గడువు పెంచిన విషయం అందరికీ తెలిసింది. కాగా ఇప్పుడు ఈ గడువు కాస్త ఈ రోజు వరకు (సెప్టెంబర్ 16) పొడిగిస్తూ ఆదాయ పన్ను శాఖ అధికారికంగా స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఐటీఆర్ ఫైల్ చేయనివారు ఈ రోజు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే జరిమానాతో ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఒక్కరోజు..
ఐటీఆర్ ఫైల్ చేయడానికి.. ఆదాయ పన్ను శాఖ పోర్టల్‌లో కొన్ని సమస్యలు ఉన్నట్లు, ఫిర్యాదులు తలెత్తడంతో ఆదాయపన్ను శాఖ గడువును ఒకరోజు పెంచుతున్నట్లు తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది. యుటిలిటీలలో మార్పులను ప్రారభించడానికి ఈ-ఫైలింగ్ పోర్టల్ మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 2:30 గంటల వరకు మెయింటెనెన్స్ మోడ్‌లో ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.
7.3 కోట్లమంది
సోమవారం వరకు 7.3 కోట్ల కంటే ఎక్కువ ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు అయినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. గత ఏడాది ఈ సంఖ్య 7.28 కోట్లు. దీన్నిబట్టి చూస్తే.. మునుపటి సంవత్సరం కంటే కూడా ఈసారి ఐటీఆర్ ఫైల్ చేసుకున్నవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. సకాలంలో పన్ను చెల్లింపుదారులు, నిపుణులు ఐటీఆర్ ఫైల్ చేసుకున్నందుకు కృతఙ్ఞతలు తెలుపుతున్నట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.
ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయండిలా
ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బంది ఉందా?, కొన్నిసార్లు.. మీరు ఉపయోగిస్తున్న సిస్టం బ్రౌజర్ సెట్టింగ్స్ కారణంగా.. ట్యాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్ యాక్సెస్ చేయడంలో కొంత సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీ సిస్టంలోని అనవసర ఫైల్స్ డిలీట్ చేయడం, కుకీస్ క్లియర్ చేయడం, ఇతర బ్రౌజర్స్ ఉపయోగించడం లేదా బ్రౌజర్ అప్డేట్ చేయడం వంటివి చేయడంతో సమస్య తీరుతుందని కూడా ఆదాయపన్ను శాఖ తన ఎక్స్ ఖాతాలో స్పష్టం చేసింది.
జరిమానాతో ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి లాస్ట్ డేట్
ఐటీఆర్ దాఖలు చేయడానికి.. ఆదాయపన్ను శాఖ ఇచ్చిన గడువు దాటితే జరిమానా చెల్లించి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు గడువు లోపలే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం మంచిది. ఆలస్య రుసుముతో ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2025 డిసెంబర్ 31 చివరి రోజు అని తెలుస్తోంది. ఐటీఆర్ ఫైల్ చేసేవారి నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే వారి రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నికర విలువ రూ. 5 లక్షల కంటే తక్కువ ఉంటే.. అలాంటి వారు రూ. 1000 వరకు జరిమానా చెలించాల్సి ఉంటుంది. అయితే మీ ఆదాయం పన్ను పరిథిలోకి రాని సందర్భంలో ఎలాంటి ఫైన్ లేదా జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆలస్యమైతే ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు
ఐటీఆర్ ఫైలింగ్ చేయడంలో ఆలస్యమైతే.. ప్రాసెస్ కూడా ఆలస్యమవుతుంది. అలాంటి సమయంలో రీఫండ్స్ కూడా ఆలస్యమవుతాయి. అంతే కాకుండా కొన్నిసార్లు మీ ఆలస్యమే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఆదాయపన్ను శాఖ నుంచి కొన్ని సార్లు నోటీసులు అందే అవకాశం ఉంటుంది. సంబంధిత శాఖ మీ లావాదేవాలను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఆలస్యానికి కారణాలను వెల్లడించాల్సిందిగా నోటీసులు వస్తాయి. ఇలాంటివన్నీ వద్దు అనుకుంటే.. ఐటీఆర్ ఫైలింగ్ అనేది గడువులోపల పూర్తవ్వాలి.