మూడు ఇంజిన్ ఆప్షన్స్ & గొప్ప మైలేజ్ అందించే విక్టోరిస్ ఇదే: దీని గురించి తెలుసా?

మారుతి సుజుకి.. భారతదేశంలో తన రెండో మిడ్ సైజ్ ఎస్‌యూవీ, అరీనా పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ‘విక్టోరిస్‘ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారు లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి.. కావలసిన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ సరికొత్త కారు ధర, బుకింగ్, ఇంజిన్ వివరాల వంటి సమాచారం ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

ధర & బుకింగ్స్

మారుతి సుజుకి విక్టోరిస్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ధరలు రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. కంపెనీ ఈ కారు కోసం సెప్టెంబర్ 03 నుంచే రూ. 11,000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

డిజైన్ & కలర్ ఆప్షన్స్

చూడటానికి కొంత గ్రాండ్ విటారా మాదిరిగా ఉండే విక్టోరిస్.. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, రూఫ్ రెయిల్, యారో కట్ అల్లాయ్ వీల్స్, డార్క్ క్రోమ్ యాక్సెంట్స్, స్కిడ్ ప్లేట్స్, డ్యూయెల్ టోన్ సీట్ కవర్లు, ఇల్యూమినేటెడ్ సిల్ గార్డ్స్ మొదలైనవి ఉన్నాయి. 4360 మిమీ పొడవున్న ఈ కారు వెడల్పు 1795 మిమీ, ఎత్తు 1655 మిమీ కాగా.. వీల్‌బేస్ 2600 మిమీ. ఇది 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

మొత్తం 10 రంగులలో (ఏడు మోనోటోన్ కలర్స్ & మూడు డ్యూయెల్ టోన్ కలర్) లభించే ఈ కారు క్యాబిన్ సాఫ్ట్ టచ్ ఎలిమెంట్స్ పొందుతుంది. పియానో బ్లాక్ ఇన్సర్ట్స్. పనోరమిక్ సన్‌రూఫ్‌తో బ్లాక్ అండ్ ఐవరీ థీమ్ పొందుతుంది. మొత్తం మీద ఇది చూడటానికి అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

ఫీచర్స్

మారుతి విక్టోరిస్ 10.25 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో / ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.01 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ పొందుతుంది. ఇవి కాకుండా 8 స్పీకర్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు, యాక్టివ్ కూలింగ్‌తో వైర్‌లెస్ ఛార్జింగ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 60 కంటే ఎక్కువ కార్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కారు నడిపేవారికి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

పవర్‌ట్రెయిన్స్

సరికొత్త మారుతి విక్టోరిస్ మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతాయి. అవి 1.5 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ (103 బీహెచ్‌పీ పవర్, 139 న్యూటన్ మీటర్ టార్క్), 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-సీవీటీ (116 బీహెచ్‌పీ పవర్), 1.5 లీటర్ సీఎన్‌జీ (87 బీహెచ్‌పీ, 121 ఎన్ఎమ్ టార్క్). పెట్రోల్ ఇంజిన్ 21.18 కిమీ మైలేజ్ అందిస్తే.. హైబ్రిడ్ వెర్షన్ 28.65 కిమీ మైలేజ్ అందిస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ 27.02 కిమీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.

సేఫ్టీ ఫీచర్స్

ఇటీవల కాలంలో లాంచ్ అవుతున్న దాదాపు అన్ని కార్లు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. విక్టోరిస్ కూడా మంచి భద్రతను అందిస్తుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్నాయి. అంతే కాకుండా.. ఈ కారు కొనుగోలపై కస్టమర్లు మూడు సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ పొందవచ్చు.

Leave a Comment