ఈవీ పాలసీ 2.0 వస్తోందా?.. సబ్సిడీల విడుదలకు సిద్దమైన ఢిల్లీ ప్రభుత్వం!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల తరువాత ఈ సబ్సిడీలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పటికే చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి. వీటిని చెల్లించడానికి ఢిల్లీ ప్రభుత్వం సన్నద్ధమైంది.

ఢిల్లీ హైకోర్టు ఆదేశం

పెండింగ్‌లో ఉన్న (సుమారు రూ. 140 కోట్లు) ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ బకాయిలను చెల్లించడం త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా పేరుకుపోయిన అన్ని బకాయిలను పరిష్కరించడానికి.. వాటికి సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలిస్తోందని రవాణా మంత్రి పంకజ్ సింగ్ తెలిపారు. పెండింగ్ బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులకు.. హామీ ఇచ్చిన విధంగా సబ్సిడీలను చెల్లించాలని ఢిల్లీ హైకోర్టు అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీలైనంత తొందరగా చెల్లింపులు చేయాలనీ, ఆలస్యం చేయడానికి విధానపరమైన అడ్డంకులను చూపించకూడదని ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తుషార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

పెండింగ్ సబ్సిడీల చెల్లింపుకు కసరత్తు

ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా అర్హత కలిగిన లబ్దిదారులను గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. సబ్సిడీలు ఆలస్యం కావడానికి.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఒక కారణమని అధికారులు తెలిపారు. ఆయన లేకపోవడంతో కేబినెట్ సమావేశం జరగలేదు, దీంతో ఈవీ పాలసీల చెల్లింపు ఆగిపోయింది. అర్హులకు తొందరగా సబ్సిడీలను అందిస్తామని సంబంధిత శాఖ చెప్పింది.

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం.. 2020 ఆగస్టులో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ ప్రారంభించింది. అప్పటి నుంచి 2.19 లక్షల కంటే ఎక్కువ వాహనాలు పన్ను మినహాయింపులను పొందాయి. ఇందులో 1.09 లక్షల టూ వీలర్స్, 83724 త్రీ వీలర్స్ ఉన్నాయి. 2023 వరకు ప్రభుత్వం రూ. 1.77 కోట్ల ప్రోత్సహకాలను పంపిణీ చేసింది. కాగా ఇప్పుడున్న ప్రభుత్వం.. ఇదివరకు పెండింగ్ ఉన్న సబ్సిడీలను చెల్లించనుంది.

ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0 రానుందా?

కొత్త పాలసీ ముసాయిదా.. ప్రజా సంప్రదింపులకు లోనవుతోంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం.. ప్రస్తుత ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని 2026 మార్చి 31 వరకు పొడిగించింది. నిజానికి ఈ పాలసీ గడువు 2023 ఆగస్టులోనే ముగిసింది. అప్పటి నుంచి అనేకమార్లు పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోమారు పొడిగించడమే కాకుండా.. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0 రూపకల్పనకు.. మంత్రి ఆశిష్ సూద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కారణం

ఢిల్లీ వంటి అభివృద్ధి చెందిన నగరాల్లో వాహనాల సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతోంది. దీంతో కాలుష్యం తీవ్రత కూడా పెరిగిపోతోంది. కాలుష్యాన్ని తగ్గించడానికి ఉన్న మార్గం.. ఫ్యూయెల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించడమే. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని.. తద్వారా భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. ఈ కారణంగానే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది.

Leave a Comment