సినిమా రంగంలో రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుకుంటే.. ఎక్కువగా హీరోలకే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో హీరోయిన్లకు కూడా కొంత ఎక్కువ రెమ్యునరేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది సందర్భాన్ని బట్టి ఉంటుంది. అయితే ఓ హీరోయిన్ మాత్రం.. ఏకంగా రూ. 530 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడానికి సిద్ధమైపోయింది. ఇంతకీ ఆమె ఎవరు?, ఏ సినిమాకు ఇంత పారితోషికం ఇస్తున్నారనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.
2026 ప్రారంభంలో షూటింగ్!
పాపులర్ హాలీవుడ్ హీరోయిన్ ‘సిడ్నీ స్వీని‘ బాలీవుడ్ మేకర్స్ ఏకంగా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అఫర్ చేసినట్లు తెలుస్తోంది. ది వైట్ లోటస్, యుఫోరియా వంటి సినిమాలతో ఫేమస్ అయిన స్వీని త్వరలోనే బాలీవుడ్ సినిమాలో కనిపించనుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఇదే నిజమైతే సినిమా షూటింగ్ 2026 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం.
సిడ్నీ స్వీని రూ.530 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే మాట నిజమే అయితే.. ఇప్పటి సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా సరికొత్త రికార్డ్ కైవసం చేసుకోనుంది. ఒక్క హీరోయిన్ రెమ్యునరేషన్.. ఇంత మొత్తంలో ఉంటే.. సినిమా కోసం ఇంకెంత ఖర్చుపెడతారు?, బడ్జెట్ ఎంత ఉంటుందని పలువురు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
యువ అమెరికన్ స్టార్‌గా!
నటి సిడ్నీ స్వీని.. భారీ మొత్తం రెమ్యునరేషన్ పొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఒక యువ అమెరికన్ స్టార్‌గా.. ఇండియన్ సెలబ్రిటీతో ప్రేమలో పడే పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ 2026 ప్రారంభంలో న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ వంటి ప్రదేశాల్లో జరగనుంది. నిజానికి ఈ ఆఫర్ రావడంతో.. మొదట్లో సిడ్నీ స్వీని కూడా కొంత ఆశ్చర్యానికి లోనైనట్లు సమాచారం.
ఇకపోతే.. సిడ్నీ స్వీని ప్రస్తుతం క్రిస్టీలో కనిపించనుంది. ఈమె స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ కవర్‌పై కనిపించిన మొదటి మహిళా బాక్సర్ అయిన యూఎస్ ప్రో ఫైటర్ క్రిస్టీ మార్టిన్ పాత్రను పోషించింది. బెన్ ఫోస్టర్, మెరిట్ వెవర్ కలిసి నటించిన ఈ సినిమా 2025 నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఎవరీ సిడ్నీ స్వీని?
సిడ్నీ స్వీని గురించి తెలుగు ప్రేక్షకులకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈమె అమెరికన్ నటి. 1997 సెప్టెంబర్ 12న జన్మించిన ఈమె 2009లో హీరోస్ సిరీస్ ఎపిసోడ్‌లో ఒక చిన్న పాత్రతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. అయితే 2010లో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆమె నటిగా మాత్రమే కాకుండా.. అర్మానీ బ్యూటీ, లనీజ్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేసింది. ఇవి కాకుండా మియు మియు, శామ్‌సంగ్, ఫోర్డ్, బాస్కిన్ రాబిన్స్, కాటన్ ఆన్, గెస్ వంటి వాటితో ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుంది. సోషల్ మీడియాలో కూడా లెక్కకు మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
స్వీని ఒక ఆటోమొబైల్ ఔత్సాహికురాలు కూడా.. ఈమె 1969 ఫోర్డ్ బ్రోంకో, 1965 ఫోర్ట్ మస్టాంగ్ వంటి వాటితో పాటు.. తాత ఇచ్చిన 1956 ఫోర్డ్ ఎఫ్100 వంటి కార్లను కలిగి ఉంది. ఈమె ఫోర్డ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కారణంగా.. కస్టమైజ్డ్ 2024 మస్టాంగ్ కూడా సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోబోతున్న నటిగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.