ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ క్రికెటర్ తిలక్ వర్మ.. తన తండ్రికి మహీంద్రా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇండియా క్రికెట్ టీమ్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడే క్రికెటర్ తిలక్ వర్మ ఇటీవల.. తన తండ్రికి మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారును డెలివరీ తీసుకోవడానికి ఇతడు.. తన తల్లి, తండ్రి, అన్నయ్యతో కలిసి వచ్చాడు. వీరు స్టెల్త్ బ్లాక్ క్లాసీ షేడ్ కలర్ కారును కొనుగోలు చేశారు. అంతే కాకుండా ఇది 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఎంచుకున్నట్లు సమాచారం.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ
దేశీయ వాహన తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కారు ఈ ”ఎక్స్ఈవీ 9ఈ”. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 31.25 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ కారు 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అప్షన్లలో లభిస్తుంది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ ఛార్జితో 542 కిమీ (59 కిలోవాట్ బ్యాటరీ), 565 కిమీ (79 కిలోవాట్ బ్యాటరీ) రేంజ్ అందిస్తుంది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచ పరిస్థితుల మధ్య మారే అవకాశం ఉంటుంది. 59 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 228 బీహెచ్‌పీ పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాగా 79 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వేరియంట్ 282 బీహెచ్‌పీ పవర్, 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ మూడు పెద్ద 12.30 ఇంచెస్ స్క్రీన్‌లను పొందుతుంది. దీనిని మహీంద్రా సినిమాస్కోప్ కాక్‌పిట్ అని పిలుస్తుంది. అంతే కాకుండా వెనుక సీటులో ఉండే ప్రయాణికుల కోసం రెండు స్క్రీన్స్ ఉన్నాయి. ఈ కారులో ఏడు ఎయిర్‌బ్యాగులు, లెవెల్ 3 ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కలిగిన సెలబ్రిటీలు
నిజానికి మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ.. కొనుగోలు చేసిన సెలబ్రిటీ తిలక్ వర్మ కాదు. ఇప్పటికే ఏఆర్ రెహమాన్ కూడా ఈ కారును కొనుగోలు చేశారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నటి కుబ్రా సైట్, బాలీవుడ్ నటుడు జావేద్ జాఫేరి, టెలివిజన్ నటి ఆకాంక్ష సింగ్, బిలినీయర్ & పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ మొదలైనవారు కూడా ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతూ ఉంది. ప్రస్తుతం సాధారణ పౌరులు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో దాదాపు చాలా కంపెనీలు దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. మౌలిక సదుపాయాలను కూడా అందుబాటులోకి తెస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెప్పేస్తున్నాయి.