14 ఏళ్ల తరువాత ఓజీ సినిమాకు.. అదే సర్టిఫికేట్: కారణాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ (దె కాల్ హిమ్ ఓజీ). ఈ సినిమాకు సంబంచించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవలే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. జోరువానలో కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా ఓజీ సినిమా గురించి చాలా విషయాలనే వెల్లడించారు. కాగా ఇప్పుడు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది.

14 ఏళ్ల తరువాత..

పవన్ కళ్యాణ్ నటించిన.. ఓజీ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. అంతకంటే ముందు ఈ మూవీ సెన్సార్ పార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ ఇచ్చింది. ఈ విషయాన్ని చిత్ర బృందం కూడా అధికారికంగా వెల్లడించింది. పంజా సినిమా తరువాత.. ఓజీ సినిమా ఏ సర్టిఫికేట్ పొందింది. దీన్ని బట్టి చూస్తే 14 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ సినిమా ఏ సర్టిఫికేట్ పొందినట్లు అర్థమవుతోంది.

సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్

ఓజీ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వస్తుందని నిర్మాణ సంస్థ ఊహించినప్పటికీ.. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలో హింసకు సంబంధించిన సన్నివేశాలు ఉండటం వల్ల సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు వెల్లడించింది. (18 సంవత్సరాలు పైబడిన వారు చూడదగిన చిత్రాలకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇస్తుంది).

ఓజీ సినిమాలోని నటీనటులు

సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ సినిమా.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కాకుండా.. ప్రియాంక మోహన్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. కాగా ఇమ్రాన్ హస్మి విలన్ పాత్ర పోషించారు. నవీన్ నూలి ఎడిటర్ కాగా.. సినిమాటోగ్రఫీ రవి కే చంద్రన్ , మనోజ్ పరమహంస నిర్వహించారు.

ఓజీ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి చిత్ర బృందం కావలసిన సన్నాహాలను సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించడం, టికెట్స్ రేట్లు పెంచడం వంటివి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబందించిన జీవో కూడా పాస్ చేసింది.

పవన్ కళ్యాణ్ ఓజీ

నటుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తరువాత తెరకెక్కనున్న సినిమా ఈ ఓజీ. యాక్షన్ సినిమాగా రిలీజ్ కానున్న ఈ మూవీ అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. అయితే ఎలాంటి కలెక్షన్ రాబడుతుందో అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమా కోసం నిర్మాతలు రూ. 250 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఓజీ సినిమా మంచి హిట్ సాధిస్తే.. చాన్నాళ్ల తరువాత పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్ యాడ్ అవుతుంది.

ఇకపోతే ఓజీ సినిమా తరువాత.. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కనిపించనున్నారు. ఈ మూవీ 2026లో రిలీజ్ అవుతుందని సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశీఖన్నా మొదలైనవారు నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. నవీన్ ఎర్నేని నిర్మాతగా వ్యవహరించారు.