లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసిన ఏప్రిలియా: ధర ఎంతో తెలుసా?

ప్రముఖ వాహన తయారీ సంస్థ ఏప్రిలియా ఎప్పటికప్పుడు ఇండియన్ మార్కెట్లో సరికొత్త బైక్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ఓ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని పేరు ఏప్రిలియా ఎస్ఆర్-జీపీ రెప్లికా 175. ఇది వరల్డ్ ఛాంపియన్ జార్జ్ మార్టిన్ & మార్కో బెజ్జెచ్చి నడిపిన 2025 ఆర్ఎస్-జీపీ మోటోజీపీ నుంచి ప్రేరణ పొందింది.

ధర & బుకింగ్స్

ఏప్రిలియా లాంచ్ చేసిన కొత్త ఎస్ఆర్-జీపీ రెప్లికా 175 స్కూటర్ ధర రూ. 1,22,521 (ఎక్స్ షోరూమ్). దీనిని కంపెనీ డీలర్ నెట్‌వర్క్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టెస్ట్ రైడ్ చేయడానికి కూడా బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది మంచి పనితీరును అందిస్తుందని సమాచారం. ఇప్పటికే ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఏప్రిలియా అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

డిజైన్

కొత్త ఎస్ఆర్-జీపీ రెప్లికా 175.. చూడటానికి 2025 ఆర్ఎస్-జీపీ బైక్‌ల మాదిరిగానే రెడ్, పర్పుల్ గ్రాఫిక్‌లతో నలుపు రంగులో ఉంది. బ్రాండ్ లోగో సైడ్ ప్యానెల్ నుంచి సెంట్రల్ టన్నెల్ ద్వారా.. ఫుట్‌బోర్డ్ వరకు ఉంది. గ్రాబ్ రైల్ మ్యాట్ బ్లాక్‌లో ఉండటం చూడవచ్చు. రిమ్స్ నలుపురంగులో ఉన్నాయి. కాగా ఫ్రంట్ వీల్ ఛానెల్‌పై కాంట్రాస్టింగ్ రెడ్ యాక్సెంట్స్ చూడవచ్చు. అంతే కాకుండా ఆ స్కూటర్ ఏప్రిలియా రేసింగ్ స్పాన్సర్స్ లోగోలతో పాటు.. జార్జ్ మార్టిన్ & మార్కో బెజ్జెచి రేస్ నంబర్స్ కూడా కలిగి ఉంది. మొత్తం మీద దీని కాస్మొటిక్ డిజైన్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఇంజిన్

ఏప్రిలియా ఎస్ఆర్-జీపీ రెప్లికా 175 స్కూటర్ 175 హెచ్‌పీ-ఈ ఇంజిన్ (175 సీసీ ఇంజిన్) పొందుతుంది. ఇది ఈ20 ఇంధనానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంజిన్ 13.08 బీహెచ్‌పీ, 14.14 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 175 సీసీ విభాగంలో అత్యధికం అని తెలుస్తోంది. పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.

ఈ కొత్త స్కూటర్ ఏప్రిలియా యాక్టివ్ రైడింగ్ పొజిషన్.. మంచి నియంత్రణ కోసం వెడల్పు హ్యాండిల్ బార్, హై-గ్రిప్ టైర్స్, 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇవన్నీ మంచి రైడింగ్ అనుభూతిని అందించడానికి దోహదపడుతుంది.

ఫీచర్స్

ఏప్రిలియా లాంచ్ చేసిన కొత్త లిమిటెడ్ ఎడిషన్ 5.5 ఇంచెస్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే పొందుతుంది. ఈ స్క్రీన్ బ్లూటూత్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. ఎల్ఈడీ లైటింగ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా లభిస్తాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ మోనోషాక్ కలిగిన ఈ స్కూటర్.. 220 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. అదనపు భద్రత కోసం సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా లభిస్తుంది.

ఇండియన్ మార్కెట్లో ఏప్రిలియా బైకులు

దేశీయ మార్కెట్లో ఏప్రిలియా స్కూటర్లను మాత్రమే కాకుండా.. ఖరీదైన బైకులను కూడా లాంచ్ చేసింది. ఈ జాబితాలో ఏప్రిలియా ఆర్ఎస్ 457, ఏప్రిలియా టునో 457, ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 1100 ఫ్యాక్టరీ, ఏప్రిలియా ఆర్ఎస్ 660, ఏప్రిలియా టునో 660, ఏప్రిలియా టువరెగ్ 660 ఉన్నాయి. స్కూటర్ల జాబితాలో.. ఏప్రిలియా ఎస్ఆర్ 175, ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125, ఎస్ఎక్స్ఆర్ 160, స్మార్ట్ 125, ఎస్ఎక్స్ఆర్ 125 మొదలైనవి ఉన్నాయి.