కాంతారా కోసం జూనియర్ ఎన్టీఆర్: అట్టహాసంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్

కాంతారా సీక్వెల్.. కాంతారా చాప్టర్-1 విడుదలకు సిద్ధమైంది. అంతకంటే ముందు సెప్టెంబర్ 28న .. అంటే రేపు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమాన్ని జూనియర్ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి అభిమానుల అంచనాలకు తగినట్టుగా హైద‌రాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకపై ఇప్పటికే అభిమానుల్లో కొత్త సందడి నెలకొని ఉంది.

కాంతారా మొదటి భాగం కర్ణాటక రాష్ట్రంలో.. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఎవరు ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికి హీరోగా మాత్రమే కాకూండా.. డైరెక్టర్‌గా కూడా పనిచేసిన రిషబ్ శెట్టి అదే ఉత్సాహంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. కాంతారా మొదటి వెర్షన్ ఇచ్చిన విజయం వల్ల ఇప్పుడు ఈ కాంతారా చాప్టర్ -1 పైన అంచనాలు పెరిగిపోయాయి.

చీఫ్ గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ విషయానికి వస్తే.. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. రిషబ్ శెట్టి.. జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కావడంతో ఈ ఈవెంట్‌కి ఎన్టీఆర్ విచ్చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు, ఏ కార్యక్రమానికి హాజరైనా కూడా అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతారు. దీన్నిబట్టి చూస్తే.. కాంతారా చాప్టర్-1 ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కూడా అభిమానుల హాజరు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. కాగా రేపు సాయంత్రం ఇద్దరినీ (రిషబ్ & ఎన్టీఆర్) ఒకే వేదికపై చూడటానికి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కాంతారా చాప్టర్-1 సినిమా గురించి

ఇక కాంతారా చాప్టర్-1 విషయానికి వస్తే.. ఈ సినిమా 2025 అక్టోబర్ 02న విజయ దశమి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాంతారా ఘనవిజయం సాధించిన తరువాత.. దాని సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అనుకున్న విధంగానే ఈ కాంతారా చాప్టర్-1.. కాంతారా విజయ పరంపరని కొనసాగిస్తుందా?, లేదా? అనేది రిలీజ్ తరువాత తెలుస్తుంది.

నిజానికి కన్నడ ప్రాంత సంస్కృతికి సంబంధించిన నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ఎంతోమందిని ఆకట్టుకుంది. రిషబ్ శెట్టికి కూడా ఈ సినిమా ద్వారా ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన కాంతారా చాప్టర్-1 టీజర్ అద్భుతంగా ఉందని అభిమానులే కాకుండా.. ఇతరులు కూడా చెబుతున్నారు. రాజులు, రాచరికాలు వంటి సన్నివేశాలు ఈ చాప్టర్-1 లో చూపించనున్నారు. మొత్తం మీద ఈ సినిమా సినిమా ప్రపంచంలో ఓ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తుందనే ఊహాగానాలు చాలామందిలో లేకపోలేదు. కాంతారా చాప్టర్-1 సినిమాలో రిషబ్ శెట్టి మాత్రమే కాకుండా.. రుక్మిణి వసంత్, జయరాం, గుల్సన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి మొదలైన వారు ఉన్నారు. ఈ సినిమా కోసం సుమారు రూ. 125 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.