అచ్చంపేట జనగర్జన సభలో కేటీఆర్: బీఆర్ఎస్ నెక్స్ట్ ప్లాన్ అదేనా..

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని అచ్చంపేటలో.. అచ్చంపేట జనగర్జన సభ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

పార్టీ వీడిన గువ్వల బాలరాజు

బీఆర్ఎస్ పార్టీకి చెందిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఈ జనగర్జన సభను నిర్వహించారు. నిజానికి గువ్వల బాలరాజు తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన నాయకుడు. దీంతో ఆయన శ్రమను, అంకితభావాన్ని గుర్తించిన కేసీఆర్ 2014లో పార్టీ టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా రెండు సార్లు అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీ కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఓటమిపాలైన తరువాత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనూ అంత చురుకుగా పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు. తరువాత గత నెల ఆగస్టు 02న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాకుండా ఆగస్టు 10న బీజేపీలోకి చేరిపోయారు. దీంతో అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు కరువయ్యారు.

బీఆర్ఎస్ గూటిని వదిలి..

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా అచ్చంపేట నియోజకవర్గ ప్రజల్లో తిరిగిన వ్యక్తి. ఎన్నో ఏళ్లుగా అక్కడ రాజకీయ సత్సంబంధాలు కలిగిన రాజకీయ దురంధరుడు. అదే విధంగా ఆ ప్రాంతం మెలుకువలు ఎత్తుగడలు తెలిసిన నాయకుడు. నేటికీ అచ్చంపేట ప్రజలలో అత్యంత ఆదరణ పొందుతున్న ప్రజాప్రతినిధి. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ గూటిని వదిలిపెట్టడం పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి.. మిగిలిన నాయకులను, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన, నిలుపుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

త్వరలో స్థానిక ఎన్నికలు

ఇకపోతే.. త్వరలోనే తెలంగాణ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం బీఆర్ఎస్ ముందు ఉన్న ఒక సవాలు. ఏ మాత్రం ఆలస్యం చేసిన కూడా ఉన్న క్యాడర్ చల్లాచెదురయ్యే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ.. తమ కార్యకర్తల్లో ఉత్సహం నింపడానికి, ఆత్మవిశ్వాశాన్ని పెంచడానికి ‘అచ్చంపేట జన గర్జన’ పేరుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చెయాల్సి వచ్చింది.

జన గర్జన సభలో కేటీఆర్

అచ్చంపేట జనగర్జన సభలో.. కేటీఆర్ తనదైన మాటలతో పార్టీ అభిమానులను ఊర్రుతలుగించారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురాగలిగారు. ప్రతిపక్ష పార్టీల తీరుపైన.. ఆ నాయకుల చేష్టలపైన రాజకీయ పరమైనా విమర్శలు గుప్పించారు. వచ్చే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను, కార్యకర్తలను కేటీఆర్ కోరారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాదిస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, ప్రజల కష్టాలను పార్టీ తప్పకుండా తీరుస్తుందని కేటీఆర్ బహిరంగ సభలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.