సీబీఎస్ఈ ఇటీవలే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పుడు తాజగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (బీఐఈఏపీ) ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
పరీక్షల షెడ్యూల్ & సమయం
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్షలు 2026 ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై 2026 మార్చి 24 వరకు జరుగుతాయి. అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫిబ్రవరి 23న ప్రారంభమవుతుంది. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మొదలవుతాయి. అన్నీ పరీక్షలు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (మూడు గంటలు) జరుగుతాయి.
ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష పేపర్ 1తో (తెలుగు, హిందీ, సంస్కృతం మొదలైన లాంగ్వేజెస్) మొదలవుతుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష లాంగ్వేజ్ పేపర్ IIతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకానమీ, హిస్టరీ, కామర్స్, సివిక్స్ పరీక్షలు జరుగుతాయి. చివరి పరీక్ష 2026 మార్చి 24న జరుగుతుందని తెలుస్తోంది.
2025లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థులు సంఖ్య 10,17,102. అయితే ఈసారి 2026లో ఇంతకంటే ఎక్కువమంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు.. పరీక్షలు నిర్వహించడానికి కావలసిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఇంకో మూడు నెలల సమయం మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
ఏపీ ఇంటర్మీడియార్ ప్రాక్టికల్ పరీక్షల విషయానికి వస్తే.. జనరల్ కోర్సులకు ప్రాక్టికల్స్ 2026 ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు (మొత్తం పది రోజులు) రెండు సెషన్లలో జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్ష ఫస్ట్ సెషన్ ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల మధ్య జరుగుతుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల మధ్య జరుగుతుంది. ఆదివారాల్లో కూడా ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని సమాచారం.
ఒకేషనల్ కోర్సు ప్రాక్టికల్ పరీక్షలు 2026 జనవరి 27 నుంచి 2026 ఫిబ్రవరి 10 వరకు జరుగుతాయి. ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం విడుదలైన ఇంటెర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ తాత్కాలికమైనది మాత్రమే అని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి డాక్టర్ నారాయణ్ భరత్ గుప్తా వెల్లడించారు. 2026లో ప్రభుత్వ సెలవులు.. హొలీ, ఉగాది, రంజాన్ పండుగలను బట్టి ఈ తేదీలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. పరీక్షల షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు జరిగితే అధికారికంగా వెల్లడిస్తారు.
పరీక్షలు ఎప్పుడు జరిగినా.. రాయడానికి విద్యార్థులు సిద్ధం కావలి. ఇక కేవలం కొన్ని రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఒక టైమ్ టేబుల్ సిద్ధం చేసుకుని చదివితే.. పరీక్షల్లో పాస్ అవ్వడం సమస్యే కాదు. ఏదైనా సబ్జెక్టులో డౌట్స్ ఉంటే.. లెక్చరర్స్ ద్వారా నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతే కాకుండా అవసరమైన విషయాలను తెలుసుకోవడానికి మీ సీనియర్లను కూడా సంప్రదించి తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఇంటర్మీడియట్ పరీక్షలు ఉత్తీర్ణత కావడానికి ప్రయత్నించండి. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయవద్దు.