ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా రెడీ: జట్టులో శ్రేయస్ అయ్యర్.. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

ఈ నెల అక్టోబర్ 19వ తేదీన ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డే సిరీస్ మ్యాచ్‌కు మరియు అక్టోబర్ 29న ప్రారంభం కానున్న ఐదు టీ20 సిరీస్ మ్యాచ్‌లకు భారత క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీసీఐ) చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ టీమ్ సభ్యులు.. రెండు టీమ్స్ ప్రకటించారు. వన్డే కెప్టెన్ పగ్గాలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది. చాలాకాలం తరువాత టీమ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు కల్పించి అతడికి వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇచ్చారు. ఇప్పటి వరకు వన్డే కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ కేవలం బ్యాట్స్‌మన్‌గా మాత్రమే జట్టులో కొనసాగనున్నాడు. కాగా శుభ్‌మన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌సీతో పాటు ఇప్పటి నుంచి వన్డే సారథిగా కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నాడు.

కొందరికి దక్కని చోటు

ఇక జట్టు విషయానికి వస్తే సంజూ సాంసన్, మహమ్మద్ షమీ, జడేజాలకు వన్డే మ్యాచ్‌లో చోటు దక్కలేదు. ఇది వారి అభిమానులకు కొంత నిరాశను కలిగించే వార్త. బౌలింగ్ విభాగంలో బుమ్రాకి బదులు ప్రసిద్ కృష్ణకి అవకాశం ఇచ్చారు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్య స్థానంలో మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. ఈ మార్పులతో బిసీసీఐ వన్డే జట్టుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో పెర్త్, సిడ్నీ అడిలేడ్ నగరాల్లో ఈ మ్యాచ్‌లు ఆడనున్నారు

వన్డే టీమ్

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, దృవ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.

టీ20 సిరీర్ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనున్నాడు. ఇందులో పెద్దగా మార్పులు ఏమి లేనట్టుగానే కనిపిస్తోంది. కేవలం కొన్ని గాయాల కారణంగా హార్దిక్ పాండ్య స్థానంలో నితీష్ వచ్చాడు. అదనంగా వాషింగ్టన్ సుందర్ వచ్చి చేరాడు. ఆసియా కప్ గెలిచిన ఆనందంతో ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న తేడాలతో అదే జట్టుతో ఇండియా ఆస్ట్రేలియతో బరిలో దిగనుంది. 2025 అక్టోబర్ 29, 31.. నవంబర్ 2, 6, 8 తేదిలలో వరుసగా ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.

టీ20 టీమ్

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్ ), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్ ), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ సాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.

ఇప్పటి వరకు దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ అత్యుత్తమ ప్రతిభ చూపిన టీమిండియా.. ఆస్ట్రేలియాలో జరగనున్న మ్యాచ్‌లో కూడా మంచి పర్ఫామెన్స్ చూపిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇక త్వరలో జరగనున్న మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ సారి గెలుపు ఎవరిదో తెలుసుకోవడానికి ఇంకొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. అయితే ఇందులో కూడా టీమిండియా గెలుపొందాలని ఆశిద్దాం.