విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు రూమర్లకు చెక్ పెట్టేశారు. అందరూ ఊహించినట్లుగానే నిశ్చితార్థం చేసుకుని పెళ్ళికి సిద్ధమైపోయారు. సినిమా అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఈ జంట 2026 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. సినిమా రంగంలో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వీరి ఆస్తులు ఎంత ఉన్నాయి?, వీరు లగ్జరీ కార్లు ఏవి? అనే విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.
విజయ్ దేవరకొండ
నటుడు విజయ్ దేవర కొండ.. అటు సినిమాలోనూ, ఇటు కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తూ డబ్బు బాగా సంపాదిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాకు రూ. 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్ దేవరకొండ.. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కింగ్‌డమ్ సినిమాకు రూ. 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అంచనా. అయితే విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. అయితే కొన్ని నివేదికలు ప్రకారం ఈయన మొత్తం సంపద రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా.
విజయ్ దేవరకొండ హైదరాబాద్ నగరంలో సుమారు 15 కోట్ల విలువైన భవనంలో నివసిస్తున్నారు. అంతే కాకుండా ఫోర్డ్ మస్టాంగ్ (రూ.75 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ (రూ.60 లక్షల కంటే ఎక్కువ), వోల్వో ఎక్స్‌సీ 60 (రూ.90 లక్షల కంటే ఎక్కువ), రేంజ్ రోవర్ (రూ.60 లక్షల కంటే ఎక్కువ), బీఎండబ్ల్యూ 5 సిరీస్ (రూ. 63 లక్షల కంటే ఎక్కువ) వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.
రష్మిక మందన్న
చలో సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. మొదటి సినిమాకు లక్షల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ అమ్మడు.. పుష్ప 2 సినిమాకు ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. కాగా చావా సినిమాకు రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా.. కొన్ని ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది. దీని ద్వారా కూడా భారీ మొత్తంలో ఆర్జిస్తోంది. మొత్తం మీద రష్మిక మొత్తం ఆస్తి రూ. 60 కోట్ల కంటే ఎక్కువ అని అంచనా.
ఇక రష్మిక మందన్న ఉపయోగించే కార్ల విషయానికి వస్తే.. ఈమె మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్, రేంజ్ రోవర్ స్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ మొదలైన కార్లను ఉపయోగిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈమె ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతోందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
విజయ్ దేవరకొండ & రష్మిక ఆస్తులు కలిస్తే
నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకు పెళ్లి జరిగితే.. వీరి ఇరువురి ఆస్తి రూ. 110 కోట్ల కంటే ఎక్కువ అవుతుంది. కాగా ఇద్దరూ సెలబ్రిటీలే.. కాబట్టి సినిమాలు చేస్తూ మరింత సంపాదించే అవకాశం ఉంది. అయితే పెళ్లి తరువాత రష్మిక మందన్న సినిమాలు చేస్తుందా?, లేదా? అనేది తెలియాల్సిన విషయం. దీనికి సమాధానం కావాలంటే రష్మిక మందన్న చెప్పాల్సిందే.