జరిగిపోయిన.. ఒకప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. ఇది సాధారణ ప్రజలకైనా.. సెలబ్రిటీలకైనా ఒకటే. దీని కోసమే 80’s స్టార్స్ రీయూనియన్ పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించారు. సినిమా నటులు అందరు సరదాగా ఒక చోట కలుసుకుని ఆనందంగా గడపడం మరియు వారి మధ్య ఉన్న స్నేహపూర్వకమైన అనుబంధాన్ని మరింత బలపరుచుకోడానికి చేసే కార్యక్రమం ఇది. ఇందులో ఆనాటి సినిమాల మధుర జ్ఞాపకాలను, అనుభవాలను తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం లాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలాంటివి మనం స్కూల్‌లో.. కాలేజీలలో ఇతర అనేక డిపార్ట్‌మెంట్లలో సర్వసాధారణంగా ఏర్పాటు చేసుకునేవే.
2010లో మొదలైన రీయూనియన్
1980 నుంచి 1989 మధ్య కాలంలో సినిమాల్లో నటీనటులుగా ప్రవేశించిన వారందరూ కలసి ఏర్పాటు చేసుకునేదే ఈ రీయూనియన్ ప్రోగ్రాం. ఈ కార్యక్రమాన్ని 2010 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జరుపుకుంటూ వస్తున్నారు. దీనిని ఖుష్బు సుందర్, సుహాసిని మణిరత్నం, లిజీ ప్రియదర్శిన్, పూర్ణిమ భాగ్యరాజ్ మొదట్లో ప్రారంభించారు. సాధారణంగా ఒక్కోసారి ఒక్కొక్కరు ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తూ వస్తున్నారు. ఫస్ట్ టైం చెన్నైలో లిస్సీ ప్రియదర్శన్ తమ ఇంటిలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇది ఆనవాయితీగా వస్తూనే ఉంది.
తాజాగా చెన్నైలో..
ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ ఈవెంట్ నిన్న అక్టోబర్ 4వ తేదీన చెన్నైలో రీయూనియన్ ప్రోగ్రాంను నిర్వహించుకోవడం జరిగింది. క్లాస్ ఆఫ్ 80’s పేరుతో యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిన శ్రీప్రియా & రాజకుమార్ సేతుపతి హోస్ట్ చేశారు. సుహాసిని మణిరత్నం, కుశ్బు సుందర్, లిస్సీ లక్ష్మి, పూర్ణిమ భాగ్యరాజ్ దీనిని ఆర్గనైజ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. ఇందుకు వీరు ఇద్దరు కలిసి చార్టర్ ఫ్లైట్‌లో చెన్నైకి వెళ్లారు. చిరు, వెంకీ కలిసి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. వీరు మాత్రమే కాకుండా.. భాను చందర్, విక్రమ్ ప్రభూ, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, నరేష్, సురేష్ కృష్ణ, రెహ్మాన్, జయరామ్ లాంటి హీరోస్ అందరూ ఇందులో పాల్గొన్నారు.
రీయూనియన్ కార్యక్రమంలో హీరోయిన్స్
హీరోయిన్స్ విషయానికి వస్తే.. రమ్యకృష్ణ, రేవతి, సుమలత, శోభన, రాధిక శరత్ కుమార్, సుహాసిని మణిరత్నం, లిస్సీ, నదీయా, మేనక, పార్వతి జయరాం, ఖుష్భు, పూర్ణిమ భాగ్యరాజ్, అంబికా, శరణ్య పోవన్నన్, జయమాల, మధూ మొదలైనవారు ఈ రీ-యూనియన్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
2024 సంవత్సరంలో వచ్చిన వరదల కారణంగా అప్పుడు రీయూనియన్ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. అయితే నిన్న జరిగినటువంటి ఈవెంట్ ఫోటోలని మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పరమైన కలయిక సినిమా ఇండస్ట్రీలో అయినా.. సమాజంలో అయినా మంచి పరిణామానికి సూచికగా చెప్పొచ్చు. మానవ సంబంధాలు చాలాకాలం పాటు బలంగా నిలబడటానికి ఇలాంటివి దోహదపడుతాయి. ఇలాంటి కార్యక్రమాలను సెలబ్రిటీలు మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా అప్పుడప్పుడు నిరవహించుకుంటే బంధాలు బలపడతాయి.