నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. చలో సినిమాతో మొదలుపెట్టి పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఈమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుంది?, వాటి ధరలు ఎలా ఉన్నాయి?, అనే విషయాలు చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఆ విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
నటి రష్మిక మందన్న ఉపయోగించే కార్ల జాబితాలో ఆడి కంపెనీకి చెందిన క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్, టయోటా ఇన్నోవా క్రిష్టా, హ్యుందాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. ఈ కార్ల ధరలు.. ఇతర విషయాల విషయానికి వస్తే..
ఆడి క్యూ3
రష్మిక మందన్న మొదటి కారు ఈ ఆడి క్యూ3 అని తెలుస్తోంది. దీనిని రష్మిక 2018లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారు ధర రూ. 55 లక్షలు. మొదటి కారు కావడంతో.. దీనిని రష్మిక ఎక్కువగా ఉపయోగించేవారని తెలుస్తోంది. నిజానికి ఆడి కంపెనీకి చెందిన ఈ కారును గతంలో చాలామంది సెలబ్రిటీలు కొనుగోలు చేసి.. ఇష్టంగా ఉపయోగిస్తున్నారు. ఇది మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని. ఈ కారణంగానే దీనిని ఎక్కువమంది ఇష్టపడుతున్నట్లు సమాచారం.
రేంజ్ రోవర్ స్పోర్ట్
రష్మిక మందన్న ఉపయోగించే కార్లలో మరో బ్రాండ్ కారు.. రేంజ్ రోవర్ స్పోర్ట్. సుమారు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు.. నలుపు రంగులో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇది 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 300 పీఎస్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఈ కారు ఉంటుంది.
మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్
రష్మిక మందన్న ఉపయోగించే కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన సీ-క్లాస్ కూడా ఉంది. దీని ధర రూ. 66 లక్షల కంటే ఎక్కువ అని సమాచారం. ఇది అత్యాధునిక డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. తెలుపు రంగులో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్ కారును రష్మిక కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో 2022లో లాంచ్ అయింది. ఇది మొత్తం మూడు ఇంజిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.
టయోటా ఇన్నోవా క్రిష్టా
భారతదేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసి, ఉపయోగిస్తున్న కార్ల జాబితాలో టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా క్రిష్టా కూడా ఒకటి. ఈ కారు రష్మిక మందన్న గ్యారేజిలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇండియన్ మార్కెట్లో దీని ధర రూ. 18 లక్షలు అని తెలుస్తోంది. రోజువారీ ప్రయాణానికి, ఎక్కువమంది ప్రయాణించడానికి ఈ కారు అనుకూలంగా ఉండటం వల్ల.. ఎక్కువ మంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.
హ్యుందాయ్ క్రెటా
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా కారు కూడా రష్మిక మందన్న గ్యారేజిలో ఉంది. రూ. 10.72 లక్షల ఖరీదైన ఈ కారు.. భారతదేశంలో 12 లక్షల అమ్మకాలను పొందింది. దీన్నిబట్టి చూస్తే.. ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కారును సాధారణ ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నప్పటికీ.. సెలబ్రిటీలు కూడా ఈ కారును ఇష్టపడుతున్నారు.