నటి సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అనేక ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకునే ఈ అమ్మడు.. తాజాగా విద్యార్థులు ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాన్ని చెబుతూ.. తాను స్కూల్లో చదివేటప్పుడు నేర్చుకున్న విషయాలను కూడా వెల్లడించారు. అంతే కాకుండా.. ఒక సోషల్ మీడియా యూజర్ ఆరోగ్యంపై ఎలా దృష్టి పెట్టాలి?, విద్యార్థిగా ఉన్నప్పుడు సమయం దొరకడం చాలా కష్టం? వంటి ప్రశ్నలు అడిగారు.
విద్యార్థులు కష్టాలు వింటున్నా..
యూజర్ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానం ఇస్తూ.. నేను విద్యార్ధినిగా ఉన్న రోజులు గడిచిపోయాయి. అయితే ప్రస్తుతం విద్యార్థుల కష్టాలను వింటూనే ఉన్నాను. చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది చాలా ప్రమాదం. ఒత్తిడి వల్ల ఎంతోమంది చిన్న వయసులోనే అనంతలోకాలకు వెళ్లపోతున్నారు. ఇది చాలా బాధాకరం. చదువు అంటే గ్రేడ్లు మాత్రమే కాదని అర్థం చేసుకోవాలని, నేను కోరుకుంటున్నాను, అని సమంత పేర్కొన్నారు.
నేను విద్యార్ధినిగా ఉన్నప్పుడు.. నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు స్నేహితులను కలిగి ఉండటం, చుట్టూ ఉన్న వ్యక్తులకు గౌరవం ఇవ్వడం అని సమంత వెల్లడించారు. నా స్నేహితుల నుంచి నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం దయ అని ఆమె అన్నారు. దయ, సానుభూతి మాత్రమే కాకుండా.. మంచి మనిషిగా ఎలా ఉండాలో నేను నేర్చుకున్నాను. నిజాయితీ ఉండటం నేర్చుకున్నానని సమంత చెప్పుకొచ్చారు. నేను పాఠశాలలో చదువుకున్న విషయాలు గుర్తులేదు, కానీ నేర్చుకున్న విషయాలు మాత్రం నాతోనే ఉండిపోయాయి. అవే జీవితంలో చాలా ముఖ్యమైనవని ఆమె అన్నారు.
అది నన్ను చాలా బాధపెట్టింది
చదువు ఒత్తిడితోనే భారతదేశంలో లెక్కలేనంత మంది విద్యార్థులు కన్నుమూస్తున్నారని ఒక వార్త వెలువడింది. ఈ జాబితాలో మహారాష్ట్ర ముందు వరసలో ఉందని కూడా ఆ వార్తా కథనంలో వెల్లడించారు. ఇది తనను (సమంత) ఎంతగానో బాధపెట్టిందని పేర్కొంది. ఈ వార్త వెలువడిన సమయంలో సమంత హృదయ విదారక ఎమోజీని షేర్ చేసింది.
సమాజ సేవలో సమంత
నిజానికి సమంత చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తిగా.. ఆమె సన్నిహితులు చెబుతుంటారు. ఆ మాట నిజమే అని అప్పుడప్పుడు నిరూపిస్తూ ఉంటుంది. ప్రత్యూష సపోర్ట్ ఫౌండేషన్ పేరుతో ఒక సంత స్థాపించిన నటి సమంత.. ఎంతోమంది మహిళలకు, పిల్లలకు వైద్య సహాయం అందిస్తోంది. వారికి అవసరమైన చికిత్స చేయడానికి ఆర్ధిక సహాయం కూడా చేస్తోంది. మానసిక ఆరోగ్యం, ప్రశాంతత గురించి కూడా సమంత చాలా విషయాలు చెబుతూ ఉంటుంది. ఈమె చేసిన సమాజ సేవకుగాను తెలంగాణ ప్రభుత్వం ఛాంపియన్స్ చేంజ్ ఆఫ్ తెలంగాణ అనే అవార్డును అందించింది.
సమంత సినిమా ప్రపంచం
నటి సమంత ఏమాయ చేసావే సినిమాతో.. తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత దూకుడు, అత్తారింటికి దారేది, రభస వంటి సినిమాల్లో నటించి ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ సినిమా రంగంలో అగ్రగామి హీరోయిన్స్ జాబితాలో ఒకరుగా ఎదిగిన సమంత.. ప్రస్తుతం సినిమాలు తగ్గించి ఆరోగ్యం మీద ద్రుష్టి పెట్టి, ప్రశాంతంగా ఉంది.