నటి సమంత గత కొంతకాలంగా.. సినిమాలు చేయడం బాగా తగ్గించింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తరువాత.. తెలుగు సినిమాల్లో ప్రత్యేకించి హీరోయిన్ పాత్రలో కనిపించలేదు. అయితే ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో మళ్ళీ టాలీవుడ్‌లో కనిపించడానికి సిద్దమైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. లెట్స్ టాక్ అనే ఒక ఇంటరాక్టివ్ సెషన్‌లో సమంత ఈ విషయాన్ని వెల్లడించింది.
‘మా ఇంటి బంగారం’తో సమంత
లెట్స్ టాక్ సెషన్‌లో.. సమంత రాబోయే తెలుగు సినిమా గురించి అడిగినప్పుడు.. దానికి సమాధానం ఇస్తూ, మా ఇంటి బంగారం సినిమాతో వస్తున్నట్లు, ఆ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈ వార్త అభిమానుల్లో మంచి జోష్ నింపింది. ఎప్పుడెప్పుడు సినిమాలో సమంత కనిపిస్తుందా అని ఎదురుచూసేవారికి ఇది ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి.
సమంత.. చివరిసారి ప్రవీణ్ కందెగుల దర్శకత్వం వహించిన హారర్ కామెడీ చిత్రం శుభంలో అతిధి పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సమంత నిర్మాతగా వ్యవహరించింది. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో కనిపించనుంది. ఇప్పటికి విడుదలైన పోస్టర్ ప్రకారం.. సమంత ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సమంత.. రక్త్ బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్‌డమ్
ప్రస్తుతం సమంత.. ‘రక్త్ బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్‌డమ్‘ అనే సినిమాలో నటిస్తోంది. దీనిని రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటి సమంత మాత్రమే కాకుండా.. ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, జైదీప్ ఆహ్లావత్, వామికా గబ్బి మొదలైన వారు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఒక ప్రణాళికాబద్ధంగా.. వివిధ దశల్లో జరుగుతోంది. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.
ఈ సినిమా షూటింగ్ జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన దశల్లో జరుగుతుందని సమాచారం, అయితే అధికారిక విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. కాగా సమంత ఇప్పటికే హిందీ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హానీ బన్నీ‘ నటించింది. అయితే ఇది అనుకున్నంత ఆదరణ పొందలేదని చెప్పాలి. ఇక మొత్తం ఆశలు.. మా ఇంటి బంగారంపైనే అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఎందుకంటే?
చాలా రోజులుగా సమంత సినిమాల్లో కనిపించకపోవడానికి ప్రధాన కారణం.. ఆరోగ్యంపై దృష్టి సారించడమే అని తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని సజావుగా సాగుతున్నట్లు, దీంతో తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సమంత ఎప్పటికప్పుడు ఈషా ఫౌండేషన్ సందర్శిస్తూ.. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటోంది. ఈషా ఫౌండేషన్ నా రెండో ఇల్లు అని ఆమె స్వయంగా వెల్లడించింది. దీంతో పాటు.. తాను విద్యార్థిని ఉన్నప్పుడు ఏం నేర్చుకుందో.. ప్రస్తుతం ఉన్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడులను ఎదుర్కొంటున్నారని విషయాన్ని కూడా తాజాగా వెల్లడించింది. ఒత్తిడి చాలా ప్రమాదం అని కూడా సమంత పేర్కొంది.