నోబెల్ ప్రైజ్ 2025: ట్రంప్ కోరిక తీరేనా.. జాబితాలో నిలిచేనా?

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠతక అవార్డైన నోబెల్ ప్రైజ్ 2025ను.. ఇప్పటికే మెడిసిన్, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు సాహిత్య రంగాలకు ప్రకటించారు. ఈ రోజు (శుక్రవారం) శాంతికి గానూ ఈ అవార్డును ప్రకటించనున్నారు. ఆర్ధిక శాస్త్రానికి కూడా త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే శాంతికిగానూ ప్రకటించే నోబెల్ ప్రైజ్ నాదే అని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు.

ఏడు శాంతి ఒప్పందాలు

భారత్ – పాకిస్తాన్ మధ్య జరిపిన ఒప్పందం సహా.. మొత్తం ఏడు శాంతి ఒప్పందాలు తాను చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ చెబుతోనే ఉన్నారు. అయితే ఈ వాదనను కొన్ని దేశాలు ఖండిస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్, కంబోడియా, పాకిస్తాన్ వంటి దేశాలు సమర్దిస్తున్నాయి. అంతే కాకుండా అమెరికా వైట్ హౌస్ దేశ అధ్యక్షునికి ది పీస్ ప్రెసిడెంట్ అనే బిరుదుకు కూడా ఇచ్చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెట్టింట్లో కొందరు నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

నిజానికి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో రెండు సార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. అయితే ఈ సారిమాత్రం ట్రంప్‌నకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, కంబోడియా మంత్రి హున్ మానెట్, పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు.. అమెరికా చట్టసభలోని సభ్యులు కూడా మద్దతు ప్రకటిస్తూ.. నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. అయితే ఈ రోజు ప్రకటించే నోబెల్ ప్రైజ్ జాబితాలో ట్రంప్ పేరు ఉంటుందా? లేదా అనేది తెలియాల్సిన విషయం.

2025 నోబెల్ ప్రైజ్ విజేతలు

మెడిసిన్: మేరీ ఈ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచి
భౌతిక శాస్త్రం: జాన్ క్లార్క్, మిచెల్ హెచ్, డెవోరేట్, జాన్ ఎమ్. మార్టినిస్
రసాయన శాస్త్రం: సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎమ్. యాగీ
సాహిత్యం: హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై

నోబెల్ ప్రైజ్ పొందిన అమెరికా అధ్యక్షులు

ఇప్పటివరకు నలుగురు అమెరికా అధ్యక్షులు, ఒక అమెరికా ఉపాధ్యక్షుడు మాత్రమే అత్యంత ప్రతిష్టాత్మక శాంతి బహుమతి నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. ఇందులో థియోడర్ రూజ్‌వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామా, అల్ గోర్ ఉన్నారు.

థియోడర్ రూజ్‌వెల్ట్

నోబెల్ ప్రైజ్ అందుకున్న మొదటి అమెరికా అధ్యక్షుడిగా థియోడర్ రూజ్‌వెల్ట్ చరిత్ర సృష్టించారు. పోర్ట్స్‌మౌత్ ఒప్పందం ద్వారా.. రష్యా – జపనీస్ యుద్దానికి మధ్యవర్తిత్వం వహించినందుకు ఈ నోబెల్ శాంతి బహుమతి పొందారు. ఇప్పటికే ఈ అవార్డు వైట్ హౌస్ వెస్ట్ వింగ్‌లోని రూజ్‌వెల్ట్ గదిలో ఉందని సమాచారం. 1906లో ఈ బహుమతి పొందారు.

వుడ్రో విల్సన్

అమెరికా 28వ అధ్యక్షుడు విల్సన్.. మొదటి ప్రపంచ యుద్ధం ముగించడంలో కీలక పాత్రను పోషించారు. శాంతిని కాపాడే లక్ష్యంతో ప్రపంచంలోని మొట్టమొదటి అంటారు ప్రభుత్వ సంస్థ అయిన లీగ్ ఆఫ్ నేషన్స్‌ను ఏర్పాటు చేయడంలో భాగమయ్యారు. దీనికిగానూ 1919లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.

జిమ్మీ కార్టర్

అమెరికా 39వ అధ్యక్షుడైన జిమ్మీ కార్టర్.. పదవీ విరమణ చేసిన 21 సంవత్సరాల తరువాత 2002లో నోబెల్ బహుమతి అందుకున్నారు. అంతర్జాతీయ శాంతి, ప్రజాస్వామ్యం & మానవహక్కులను ముందుకు తీసుకెళ్లడంలో ఈయన చేసిన సుదీర్ఘ కృషికి.. ఆర్ధిక మరియు సామజిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో దశబ్దాలుగా చేసిన అవిశ్రాంత కృషికి.. జిమ్మీ కార్టర్ నోబెల్ ప్రైజ్ అందుకున్నారు.

బరాక్ ఒబామా

44వ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బరాక్ ఒబామా 2009లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. దేశాలమధ్య సత్సంబంధాలను మెరుగుపరిచినందుకుగానూ.. ఈ బహుమతి లభించింది. అంతర్జాతీయ దేశాల మధ్య దౌత్యం, ప్రజల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంలో ఈయన సుదీర్ఘ కృషి చేశారు.