చూడగానే ఆకట్టుకునే కారు.. అమ్మకాల్లో బలే జోరు!

ఎంజీ మోటార్ కంపెనీ భారతీయ మార్కెట్లో తన సైబర్‌స్టర్ కారును 2025 జులైలో లాంచ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ధర.. ఇతర కార్ల కంటే కూడా కొంత ఎక్కువే!. అయినప్పటికీ ఇది మంచి అమ్మకాలు పొందిందని సంస్థ వెల్లడించింది.

అమ్మకాలు ఇలా..

జులై 2025లో లాంచ్ అయిన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు.. 250 యూనిట్ల అమ్మకాలు పొందింది. దీని ప్రారంభ ధర రూ. 74.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన సమయంలో రూ. 72.49 లక్షల (ఎక్స్ షోరూమ్) వద్ద లాంచ్ చేసిన. అయితే ఇప్పుడు రూ. 2.5 లక్షలు ధర పెరిగిందని స్పష్టమైంది. ఇది ఎంజీ మోటార్ కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ కూపే. చూడటానికి అద్భుతంగా.. లంబోర్ఘిని లాంటి బటర్ ఫ్లై డోర్స్ కలిగి ఉంది. అంతే కాకుండా.. ఇది మల్టిపుల్ కలర్ ఎంపికలలో అందుబాటులో ఉండటం వల్ల కూడా.. ఇది కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది.

ధర ఎక్కువైనా.. తగ్గని డిమాండ్

2025 సెప్టెంబర్ చివరి నాటికి ఎంజీ మోటార్ కంపెనీ తన సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును 256 యూనిట్లను విక్రయించినట్లు వెల్లడించింది. కాగా.. ఈ మోడల్ కోడం 4 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు కూడా వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే.. ధర ఎక్కువైనా, డిమాండ్ ఓ మోస్తరులో ఉందని స్పష్టమవుతోంది.

మొదట గ్లోబల్ మార్కెట్లో..

నిజానికి ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారును.. ఎంజీ మోటార్ కంపెనీ ఏప్రిల్ 2023లో షాంఘైలో జరిగిన ఆటోషోలో అరంగేట్రం చేసింది. ఆ తరువాత గ్లోబల్ మార్కెట్లో విక్రయించడం మొదలుపెట్టింది. ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంజీ సైబర్‌స్టర్ రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ అనే రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. అయితే భారతదేశంలో అమ్మకానికి ఉన్న కారు ఒకే వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

బ్యాటరీ & రేంజ్ వివరాలు

ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు యొక్క ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్.. రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా 528 బీహెచ్‌పీ పవర్, 725 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులోని 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జితో గరిష్టంగా 580 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 0 నుంచి 100 కిమీ యాక్సలరేట్ అవ్వడానికి పట్టే సమయం 3.2 సెకన్లు మాత్రమే. దీని టాప్ స్పీడ్ గంటకు 200 కిమీ.

ఫీచర్స్.. డిజైన్ వివరాలు

ఎంజీ సైబర్‌స్టర్.. డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క చూపుతోనే ఆకట్టుకునే డిజైన్ దీని సొంతం అని ఎవరైనా చెప్పాల్సిందే. ఇందులో మొత్తం మూడు స్క్రీన్‌లు ఉంటాయి. రెండు 7.0 ఇంచెస్ డిస్‌ప్లేలు, మరొకటి 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఇందులోని ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్.. కంట్రోల్స్ కూడా పొందుతుంది. బోస్ ఆడియో సిస్టం, ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీదే ఇది ఫ్రీమియం లుక్.. అప్డేటెడ్ ఫీచర్స్ అన్నీ కలిగి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు.. కొన్ని ప్రత్యేకమైన డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే అమ్ముడవుతోంది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో 14 సెలక్టివ్ డీలర్‌షిప్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో డిమాండును బట్టి డీలర్‌షిప్‌ల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుందని సమాచారం.