బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షిరామ్ వర్ధంతి సందర్బంగా బీఎస్పీ లక్నోలోని కాన్షిరామ్ స్మారక స్థలంలో భారీ ర్యాలీని నిర్వహించింది. భారతదేశ నలుమూలల నుంచి ఈ మీటింగ్‌కు కొన్ని లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు హాజరయ్యారు. నీలి కండువాలు, జెండాలు, బ్యానర్‌లు, కటౌట్స్, నీలి దుస్తులతో సభా ప్రాంగణంతో పాటు లక్నో మొత్తాన్ని నీలి సంద్రంలా మార్చివేశారు.
మాయావతి కీలక వ్యాఖ్యలు
ఈ ర్యాలీలో ‘బెహెంజి మాయావతి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి.. మాకు అధికారం కావాలి’, ఉచితాలు కాదు (రేషన్ కాదు) లాంటి కొత్త నినాదాలతో పాటు బహుజన హితయా బహుజన సుకాయా అనే కాన్షిరామ్ గారి వ్యాఖ్యలను కూడా పెద్ద ఎత్తున నినదించారు. జై భీమ్ జై భారత్.. అంటూ మారుమోగించారు. ఈ ఉత్సహం చూస్తుంటే వచ్చిన జనసందోహానికి కచ్చితంగా ఈసారి అధికారం చెపడతామనే నమ్మకం కలిగినట్టుగా కొంతమంది కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన బహుజన సమూహన్ని ఉద్దేశించి.. బిఎస్పీ రాజకీయ భవిష్యత్తు గురించి పార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే 2027 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మాయావతి మాట్లాడుతూ.. ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికి.. అవి ఆయా పార్టీలకు మేలుజరిగింది గానీ.. బీఎస్పీకి ఏ ప్రయోజనం కూడా చేకూరలేదు అని అన్నారు. ప్రతిసారి మా ఓట్లు పొత్తులో ఉన్న వాళ్లకి బదిలీ అవుతున్నాయి తప్పా మిగిలిన వారి ఓట్లు ఒక్కటి కూడా ఇటు రావడం లేదని వాపోయారు. అందుకే ఈసారి ఒంటరిగా పోటీచేస్తామని స్పష్టంచేశారు.
ప్రత్యర్థులపై విమర్శల వర్షం
తమ ప్రత్యర్థి పార్టీలపైన ఆమె విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, సమాజ్ వాదీ రెండు పార్టీలు దళిత సమాజాన్ని మోసానికి, అన్యాయానికి గురిచేస్తున్నాయని.. అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదని, కాన్షిరామ్ మృతిపట్ల సంతాపం తెలుపకపోవడం కాంగ్రెస్ ఆలోచనలకు నిదర్శనం అన్నారు. ఇప్పుడు రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని, అదొక డ్రామా పార్టీ అని అన్నారు.
పవర్‌లో ఉన్నప్పుడు దళితులు, మిగిలిన ఇతర అణచివేయబడిన కులాలను పట్టించుకోరు. తరువాత మాత్రమే వాళ్లు గుర్తుకు వస్తారని, అదొక అవకాశవాద, రెండు దోరణులు కలిగిన పార్టీగా మాయావతి అభివర్ణించారు. కాన్షిరామ్ పట్ల గౌరవం లేదని, జిల్లాలకు కాన్షిరామ్ పేర్లు మార్చడం, స్మారక స్థలానికి నిధులు ఆపివేయడం వంటివాటిని మాయావతి గుర్తు చేశారు.
బీజేపీ ప్రభుత్వం సిబీఐ, ఈడీ లాంటి సంస్థలతో నన్ను, మన నాయకులను, కుటుంబాన్ని అనవసరమైన కేసుల్లో ఇరికించి దళితుల అభివృద్ధిని, పార్టీని ఇబ్బంది పెట్టిందని – కాంగ్రెస్, సమాజ్ వాది, బీజేపీ మనల్ని ఆపడానికి ఉన్నాయని కానీ బీఎస్పీ మాత్రం ఎక్కడ విశ్రమించకుండా వాటిని ఎదురక్కొని పనిచేస్తుంది అని అన్నారు. బీఎస్పీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితాలపై ఆధారపడకుండా ప్రజలు సొంతంగా ఏదిగేలా అభివృద్ధి చేశామని ఆమె అన్నారు. 2027లో మళ్ళీ అధికారం చేపడుతామని కార్యకర్తల్లో విశ్వాశాన్ని నింపారు.
రాజకీయ వారసుని గురించి
తన మేనల్లుడు బీఎస్పీ జాతీయ కన్వీనర్ ఆకాష్ ఆనంద్ గురించి చెబుతూ.. కాన్షిరాం కాలంలో ఆయనకు తరువాత నాకు ఇంతకాలం అన్ని కష్ట సమయాల్లో ఏ విధంగా అయితే అండగా నిలబడ్డారో ఇప్పుడు ఆకాష్ ఆనంద్ కూడా అదే విధంగా మద్దతుగా ఉండాలని, నా మార్గదర్శకత్వంలో తను నడుస్తాడని ఆమె తన రాజకీయ వారసుని గురించి చెప్పుకొచ్చారు.