జీఎస్టీ ప్రభావం.. పండుగ ఆఫర్స్: భారీగా తగ్గిన మారుతి ఎస్-ప్రెస్సో ధర!

2025 సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఆ రోజు నుంచే మారుతి సుజుకి.. తన ఉత్పత్తుల (కార్లు) ధరలను తగ్గింపు ధరతో విక్రయించడం ప్రారంభించింది. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపులకు.. ఫెస్టివల్ డిస్కౌంట్స్, ఆఫర్స్ తోడయ్యాయి. దీంతో బ్రాండ్ యొక్క వాహనాల ధరలు మరింత తగ్గాయి. ఈ కథనంలో మారుతి ఎస్-ప్రెస్సో ధర గురించి తెలుసుకుందాం.

భారతదేశంలో ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి-ఎస్ ప్రెస్సో ఒకటి. ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు దీనిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొత్త జీఎస్టీ, దీపావళి పండుగ ఆఫర్ కింద వేరియంట్‌ను బట్టి.. రూ. 70000 నుంచి రూ. 1.30 లక్షలు తగ్గుతుంది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ వెర్షన్స్ ఉన్నాయి.

వేరియంట్ వారీగా ఏసీ షోరూమ్ ధరలు

  • ఎస్టీడీ (ఓ): రూ. 3.50 లక్షలు (రూ.77000 తగ్గింది)
  • ఎల్ఎక్స్ఐ: రూ. 3.80 లక్షలు (రూ. 1.2 లక్షలు తగ్గింది)
  • వీఎక్స్ఐ (ఓ): రూ. 4.30 లక్షలు (రూ. 91000 తగ్గింది)
  • ఎల్ఎక్స్ఐ (ఓ) సీఎన్‌జీ: రూ. 4.62 లక్షలు (రూ. 1.3 లక్షలు తగ్గింది)
  • వీఎక్స్ఐ (ఓ) ఆటోమాటిక్: రూ. 4.75 లక్షలు (రూ. 97000 తగ్గింది)
  • వీఎక్స్ఐ ప్లస్ (ఓ): రూ. 4.80 లక్షలు (రూ. 71000 తగ్గింది)
  • వీఎక్స్ఐ (ఓ) సీఎన్‌జీ: రూ. 5.12 లక్షలు (రూ. 1 లక్ష తగ్గింది)
  • వీఎక్స్ఐ ప్లస్ (ఓ) ఆటోమాటిక్: రూ. 5.25 లక్షలు (రూ. 76000 తగ్గింది)

మారుతి ఎస్-ప్రెస్సో

ధరల తగ్గుదల తరువాత దేశీయ విఫణిలో మారుతి ఎస్-ప్రెస్సో ప్రారంభ ధర రూ.3.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర సెప్టెంబర్ 22కు మించి రూ. 4.27 లక్షలు (ఎక్స్-షోరూమ్). సింపుల్ డిజైన్ కలిగిన ఈ కారు.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ రూపాల్లో మార్కెట్లో అమ్మకానికి ఉంది.

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబటులో ఉండే.. మారుతి ఎస్-ప్రెస్సో అమ్మకాల పరంగా ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. దేశీయ విఫణిలో క్రాస్ఓవర్లు, పెద్ద కార్ల సంఖ్య పెరుగుతున్న సమయంలో హ్యాచ్‌బ్యాక్‌ల మార్కెట్ వాటా క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ.. ఎస్-ప్రెస్సో మాత్రం ఈ విభాగంలో ఇప్పటికీ అధిక ప్రజాదరణ పొందుతూనే ఉంది.

ప్రస్తుతం కంపెనీ ఈ ఎస్-ప్రెస్సో ధరను బాగా తగ్గించింది. దీంతో ఈ కారు మంచి అమ్మకాలు పొందుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తక్కువ ధరలో ఓ మంచి కారు కోసం చూస్తున్న ప్రజలకు లేదా పండుగ సమయంలో తక్కువ ధరలో కారు కొనాలనుకునే వారికి మారుతి ఎస్-ప్రెస్సో సరైన ఎంపిక అనే చెప్పాలి.

సెప్టెంబర్ నెలలో పెరిగిన మారుతి సుజుకి సేల్స్

మారుతి సుజుకి ప్రస్తుతం ఎస్-ప్రెస్సో ధరలను మాత్రమే కాకుండా.. ఇతర వేరియంట్ల ధరలను కూడా బాగా తగ్గించింది. ఈ కారణంగానే గత నెలలో (2025 సెప్టెంబర్) కంపెనీ 1.32 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ కార్లను విక్రయించగలిగి.. మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది. ఇందులో ఎస్-ప్రెస్సో సేల్స్ 1774 యూనిట్లు అని సమాచారం. ప్రస్తుతం ఈ కారు (ఎస్-ప్రెస్సో) ధరలు తగ్గడం చేత.. అక్టోబర్ 2025లో మరింత ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యే అవకాశం ఉందని సమాచారం.