భారతదేశం విభిన్న మతాలకు, జాతులకు నిలయం. కాబట్టి ఇక్కడ.. ప్రతి మతానికి/జాతికి ఒక దైవం ఉంటుంది. ఈ దైవాన్నే వారు పరమ పవిత్రంగా పూజిస్తారు. చాలామంది గ్రామీణ దేవతలైన గంగమ్మ, మారెమ్మ, పోలేరమ్మ, మైసమ్మ మొదలైన పేర్లను ఎదో ఒక సందర్భంలో వినే ఉంటారు. అయితే కాంతారా సినిమా రిలీజ్ అయిన తరువాత.. గుళిగ, పంజుర్లి అనే దైవాల పేర్లు వినిపించాయి. బహుశా ఈ పేర్లు.. కాంతారా సినిమా వచ్చేవరకు కూడా బహుశా చాలామందికి తెలియదు. రిషబ్ శెట్టి ఈ పాత్రలలో కనిపించేసరికి.. ఎవరీ దేవతలు అని చాలామంది నెట్టింట్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఈ కథనంలో ఆ వివరాలను చూసేద్దాం..
నిజానికి కాంతారా సినిమా అనే ఒక ప్రాంతానికి చెందిన.. సంస్కృతి, సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. ఈ సినిమాలో కనిపించే గుళిగ, పంజుర్లి దైవాలను.. దక్షిణ కన్నడ ప్రాంతమైన మంగళూరు, ఉడుపి తీర ప్రాంతాలలోని జిల్లాలలో అమితమైన భయం, భక్తితో పూజిస్తారు. ఈ దేవతలు లేదా దేవాలయాలు కేవలం భక్తి ప్రదేశాలు కాదు.. తుళునాడు (కర్ణాటక, కేరళలో కొంత భాగం) లోని ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడే సాంస్కృతిక కేంద్రాలు.
గుళిగ దైవం
నిజానికి గుళిగ సాధారణ దైవం కాదు. ఇది ఒక ప్రాంతానికి, సంస్కృతికి చెందిన ప్రధానమైన భూత దైవం. ”శివుడు.. త్రిపురాసులను సంహరించిన తరువాత ఆ సమయంలో ఆయన కోపం నుంచి అతీతమైన శక్తి సంపన్నుడు వీరభద్రుడు జన్మించాడు. అదే సమయంలో గుళిగ అనే శక్తి కూడా పుట్టిందని ఒక కథ ప్రచారంలో ఉంది”. గుళిగకు మంగళూరు సమీపంలో గుళిగ బన పేరుతో ఒక దేవాలయం ఉంది. అంతే కాకుండా కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడా కనిపిస్తాయి.
గుళిగను సంరక్షిచే ఆత్మగా పిలుస్తారు. మహా ఉగ్రరూపంలో గుళిగ ఉంటాడని సినిమాల్లో చెప్పడం కూడా వినే ఉంటారు. న్యాయం, ఇతర సంరక్షణ కోసం ప్రజలు ఈ దైవాన్ని ప్రార్థిస్తారు. మంగళూరు ప్రాంతంలో.. వార్షిక ఉత్సవాల సమయంలో గుళిగ కోలను సంప్రదాయంగా నిర్వహిస్తారు. ఇందులో చాలావరకు శైవ సాంప్రదాయం నిండి ఉండటం చూడవచ్చు. ఉడుపి ప్రాంతవాసులు ఇతర దైవాల మాదిరిగానే గుళిగను కూడా పూజిస్తారు. మాంసాహారం నైవేద్యంగా సమర్పించుకుంటారు.
పంజుర్లి దైవం
కాంతారా సినిమాలో వినిపించే మరో దైవం పేరు పంజుర్లి. నిజానికి పంజుర్లి శాంతియుత దేవతగా ప్రసిద్ధి. వన్యప్రాణులకు హాని కలిగినప్పుడు, ప్రజల సమస్యలను వినడానికి, న్యాయం చెప్పడానికి ఈ దేవతను నిష్ఠతో పూజించి వేడుకుంటారు. ఒక వ్యక్తిపై ఆవహించి ప్రజల సమస్యలను వింటుందని చెబుతారు. పంజుర్లి దైవాన్ని అడవి పంది ఆత్మగా చెబుతారు. పంట పొలాలకు, వన్య ప్రాణులకు ఈ దైవం రక్షణ కల్పిస్తుందని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం.
పంజుర్లి దైవానికి.. ఉడుపి, మంగళూరు ప్రాంతాల్లో దేవాలయాలు ఉన్నాయి. వార్షిక ఉత్సవాల సమయంలో పంజుర్లి కోలా అనే సంప్రదాయాన్ని నిర్వహిస్తారు. ఈ దైవారాధన ప్రధానంగా వైష్ణవ మత సంప్రదాయం కనిపిస్తుంది. నిష్ఠతో పూజలు చేసి, బెల్లం, కొబ్బరి ముక్కలు, సెనగపప్పు మొదలైనవి నైవేద్యంగా సమర్పించుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో మాంసాన్ని కూడా నైవేద్యంగా పెడాతారు.
కొరగజ్జ దైవం
బహుశా ఈ పేరును కాంతారా సినిమాలో కూడా ప్రస్తావించలేదు. కానీ కొరగజ్జ కూడా గుళిగ, పంజుర్లి కోవకు చెందిన దైవమే. అయితే ఈ దైవం ప్రత్యేకించి న్యాయం, రక్షణను అందిస్తుందని ప్రజల నమ్మకం. మంగళూరు పరిసర ప్రాంతాల్లో ఈ దైవానికి దేవాలయాలు ఉన్నాయి. వార్షిక ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో దైవానికి మద్యం, మాంసం వంటి వాటితో పాటూ బీడా వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.