ప్రశ్నార్థకంగా మారిన ఫోర్డ్ ఇండియా పరిస్థితి!: ఎందుకిలా..

అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారతదేశం తన కార్యకలాపాలను 2021లోనే అధికారికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాలు ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ కంపెనీ.. ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేక, సుమారు రూ. 15,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో తన కార్యకలాపాలను భారతదేశంలో నిలిపేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు.. ఇది అసంభవమేమో అని చెబుతున్నాయి.

ప్రశ్నార్థకంగా మారిన ఫోర్డ్ ఇండియా పరిస్థితి!

ఫోర్డ్ కంపెనీ.. చెన్నైలోని తన తయారీ కేంద్రంలో మళ్ళీ తన ఉత్పత్తిని ప్రారంభించాలనే ఆలోచలనతో ఉన్నట్లు కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే అమెరికా అధ్యక్షుడి ఆంక్షల ప్రభావం కారణంగా.. ఫోర్డ్ మళ్ళీ ఇండియాకు వచ్చే సూచనలు చాలా తక్కువని తెలుస్తోంది. కాగా 2022 మధ్య నుంచి క్రియారహితంగా ఉన్న.. తమిళనాడు ప్లాంటులో తమ కార్యకలాపాలను నిర్వహించడానికి అధికారుల సమావేశం త్వరలోనే ఉండొచ్చని సమాచారం.

కంపెనీ ఇంతకుముందు తమిళనాడు ప్లాంటును ఇంజిన్ తయారీకి ఉపయోగించుకోవాలని, ఇక్కడ తయారైన ఇంజిన్లను ఎగుమతి చేయాలనీ నిర్ణయించుకుంది. అయితే ఇది కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. ఇప్పుడు ఫోర్డ్ సంస్థ ఇండియాలోకి రావడమనేది ప్రశ్నార్దకంగా మారింది.

యూరప్ & జర్మనీ మార్కెట్లపై ఫోర్డ్ దృష్టి

ఇదిలా ఉండగా.. ఫోర్డ్ కంపెనీ యూరప్ మార్కెట్ మీద ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా జర్మనీలో తన కార్యకలాపాల విస్తరణ కోసం 4.4 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్లు తెలుస్తోంది. కొలోన్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది. యూకేలో కాంపోనెంట్ హబ్, బ్యాటరీ ఆర్&డీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో కంపెనీ ముందుకు వెళ్లాలనే ఆలోచనను చెప్పకనే చెబుతున్నాయి.

చెన్నైలోని తమ తయారీ కేంద్రం విషయంలో 2024 చివరి నుంచి మా స్థానం మారలేదని.. కంపెనీ పేర్కొంది. అయితే ప్లాంట్‌లో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి.. స్టేట్ ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌ను మెరుగుపరచడానికి సంబంధించిన ఫోర్డ్ ఉద్దేశ్యాలను స్పష్టంగా వెల్లడించాలని తమిళనాడు ప్రభ్యత్వం కోరింది. దీనిపై కంపెనీ స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంది.

భారతదేశంలో ఫోర్డ్ చరిత్ర

నిజానికి భారతదేశంలో ఫోర్డ్ కంపెనీకి.. దశాబ్దాల చరిత్ర ఉంది. 1926లో ప్రారంభమైన ఈ కంపెనీ.. మొదట తన కార్యకలాపాలను ముంబైలో ప్రారంభించింది. ప్రారంభంలో సజావుగా ముందుకు సాగినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల 1953లో ఇండియాలో తన కార్యకలాపాలను నిలిపివేసింది.

ఆ తరువాత 1995లో మళ్ళీ మన దేశంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ఫోర్డ్ ఇండియాగా అవతరించింది. కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూ.. ముందుకు సాగుతున్న కంపెనీకు 2016 నుంచి 2021 మధ్య ఆశించిన లాభాలు లభించలేదు. హ్యుందాయ్, టాటా మోటార్స్, మారుతి సుజుకి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. చేసేదేమీ లేక మరోమారు తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తోంది. ఇది జరుగుతుందా? లేదా?, అనేది త్వరలోనే తెలుస్తుంది.